కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు పనులపై కేంద్రం వివరణ...

ABN , First Publish Date - 2020-09-22T20:50:31+05:30 IST

ఏపీలో అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అణు విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్‌లో... అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కేంద్రం పేర్కొంది.

కొవ్వాడలో  అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు పనులపై కేంద్రం వివరణ...

న్యూఢిల్లీ : ఏపీలో అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అణు విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుపై  తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్‌లో... అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కేంద్రం పేర్కొంది. 


అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సంబంధించి... అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు గా కేంద్రం పేర్కొంది. అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటులో భాగంగా 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటుచేయనున్నట్లుగా వెల్లడించింది. అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల అధ్యయనాలూ పూర్తైన తర్వాతే... కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లుగా కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది. ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు సూచించిన అర్హతల ప్రాతిపదికనే... శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ ప్రాంతాన్ని అణు విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి ఎంపిక చేశామని కేంద్రం చెప్పింది. కాగా... అమెరికా అధ్యక్షుడు ట్రంప్... గతంలో భారత్  పర్యటంచిన సందర్భంలో కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్లుగా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ప్లాంట్ నిర్మాణానికి త్వరలో చర్యలు ప్రారంభించడానికి ఉభయ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరిందని, ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని వినవస్తోంది. కాగా... రూ. 61 వేల కోట్ల అంచనా వ్యయంతో జరగనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికిగాను  ప్రధాని మోదీ శంఖుస్థాపన చేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు గాను... ఇప్పటికే 2,700 ఎకరాలను సమీకరించారు. నిర్మాణంలో భాగంగా ఆరు అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క అణురియాక్టర్ 1,208 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని , ఒక మెగావాట్ కు రూ. పది కోట్ల చొప్పున, మొత్తంగా 61 వేల కోట్ల అంచనాలతో ఈ ప్రతిపాదనలను రూపొందించారు. ఈ సంవత్సరం శంఖుస్థాపన జరిగితే... వచ్చే ఐదేళ్లలో అణు విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తయ్యేలా కేంద్రం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-09-22T20:50:31+05:30 IST