దేశవ్యాప్తంగా 50 మాడ్యుల‌ర్ ఆసుప‌త్రులు... ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా తీసుకెళ్లొచ్చు!

ABN , First Publish Date - 2021-06-14T17:43:06+05:30 IST

కరోనావైరస్ మహమ్మారిని...

దేశవ్యాప్తంగా 50  మాడ్యుల‌ర్ ఆసుప‌త్రులు... ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా తీసుకెళ్లొచ్చు!

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు దేశ‌మంతా పోరాడుతోంది. కోవిడ్ -19 థ‌ర్డ్ వేవ్ భ‌యాల  మ‌ధ్య రాబోయే రెండుమూడు నెలల నాటికి దేశవ్యాప్తంగా 50 వినూత్న మాడ్యులర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం మౌలిక సదుపాయాల విస్తరణకు, ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలపై భారాన్ని తగ్గించేందుకు ఈ మాడ్యులర్ ఆసుపత్రులను ఇప్పుడున్న‌ ఆసుపత్రుల పక్కన ఏర్పాటు చేయ‌నున్నారు.


ఐసీయూ సౌక‌ర్యం క‌లిగిన‌ వంద‌ పడకలతో కూడిన ఇటువంటి 50 మాడ్యులర్ ఆస్పత్రులను నిర్మించ‌నున్నామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. మూడు వారాల్లో నిర్మించబోయే ఈ ఆసుపత్రుల నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు ఖ‌ర్చుకానుంది. ఈ ఆసుప‌త్రులు ఆరేడు వారాల పాటు ప‌నిచేయ‌నున్నాయి. మొదటి ద‌శ‌లో బిలాస్‌పూర్, అమరావతి, పూణే, జల్నా, మొహాలిలలో 100 పడకల మాడ్యులర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఎక్క‌డికైనా త‌ర‌లించేందుకు అవ‌కాశం ఉంటుంది.  ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం గరిష్టంగా కోవిడ్ -19 కేసులు నమోదైన రాష్ట్రాలలో సుమారు 50 ఆస్పత్రుల అవసరాన్ని గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇటువంటి  ఆసుప‌త్రుల‌ను నిర్మించ‌నున్నారు. 

Updated Date - 2021-06-14T17:43:06+05:30 IST