వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-04-17T23:48:39+05:30 IST

సున్నితమైన సమాచారం అనధికారికంగా బయటకు పొక్కే అవకాశాలు

వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక!

న్యూఢిల్లీ : సున్నితమైన సమాచారం అనధికారికంగా బయటకు పొక్కే అవకాశాలు ఉన్నాయని వాట్సాప్ యూజర్లను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరించింది. సైబర్ దాడులపై పోరాడటం, ఇండియన్ సైబర్ స్పేస్‌ను కాపాడటం ఈ సంస్థ లక్ష్యాలు. వాట్సాప్‌లో గుర్తించిన కొన్ని లోపాలను వివరిస్తూ ఓ సూచనను యూజర్లకు ఈ సంస్థ జారీ చేసింది.


వెర్షన్ 2.21.4.18కు పూర్వపు ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్, వాట్సాప్ బిజినెస్; వెర్షన్ 2.21.32కు పూర్వపు ఐఓఎస్‌లోని వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ సాఫ్ట్‌వేర్‌లో ఈ లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. వాట్సాప్ అప్లికేషన్లలో అనేక బలహీనతలు, లోపాలను గుర్తించినట్లు తెలిపింది. సుదూరంలో ఉన్న వ్యక్తి తాను లక్ష్యంగా చేసుకున్న సిస్టమ్‌లోని సమాచారాన్ని పొందడానికి లేదా ఆర్బిట్రరీ కోడ్‌ను పని చేయించడానికి ఈ లోపాలు అవకాశం ఇస్తాయని తెలిపింది. కేష్ కన్ఫిగరేషన్ ఇస్యూ, ఆడియో డీకోడింగ్ పైప్‌లైన్‌లో మిస్సింగ్ బౌండ్స్ చెక్ వల్ల ఈ లోపాలు ఏర్పడినట్లు వివరించింది. 


ఈ లోపాలను విజయవంతంగా ఉపయోగించుకునే అటాకర్స్ తమ ఆర్బిట్రరీ కోడ్‌ను తాము కోరుకున్న సిస్టమ్‌లో పని చేయించడానికి వీలవుతుందని తెలిపింది. తాము కోరుకున్న సిస్టమ్‌లోని సున్నితమైన సమాచారాన్ని పొందడానికి కూడా అవకాశం కలుగుతుందని తెలిపింది. 


ఈ లోపాలను అధిగమించడం కోసం వాట్సాప్ యూజర్లు తమ పాత వెర్షన్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి కానీ వాట్సాప్‌ అప్లికేషన్లను అప్‌డేట్ చేసుకోవాలని వివరించింది. 


Updated Date - 2021-04-17T23:48:39+05:30 IST