సెస్‌..తుస్‌!

ABN , First Publish Date - 2021-06-20T05:36:43+05:30 IST

గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, స్థానికసంస్థలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వాటి నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులంటూ కేటాయించడం లేదు.

సెస్‌..తుస్‌!

  • గ్రంథాలయాలకు సెస్‌ చెల్లింపుల్లో స్థానిక సంస్థల నిర్లక్ష్యం
  • సంవత్సరాల తరబడి తరబడి చెల్లించని పంచాయతీలు 
  • బకాయిల భారం... లైబ్రరీలకు శాపం
  • పట్టించుకోని స్థానిక సంస్థల అధికారులు 
  • గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, స్థానికసంస్థలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.  వాటి నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులంటూ కేటాయించడం లేదు. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్సే ఆధారంగా మారింది. లైబ్రరీలకు రావాల్సిన సెస్సు రాక గ్రంథాలయాల నిర్వహణ  కష్టంగా మారనుంది. 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : విజ్ఞానం పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఎంతో మందిని మేధావులుగా తీర్చిదిద్దడంలో వాటి పాత్ర వెలకట్టలేనిది. గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, స్థానికసంస్థలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్రంథాలయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులంటూ        కేటాయించడంలేదు. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్సే ఆధారంగా మారింది. స్థానిక సంస్థల నుంచి వచ్చే సెస్సుతోనే గ్రంథాలయాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పుస్తకాలు, ఫర్నిచర్‌, స్టేషనరీ కొనుగోళ్లు, పత్రికలు, కరెంట్‌ బిల్లులు, స్వీపింగ్‌ ఛార్జీల వంటి చెల్లింపులు కూడా ఈ సెస్సులో నుంచి చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు  ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో 0.08 శాతం గ్రంథాలయాలకు సెస్సుగా చెల్లించాలి. అయితే జిల్లాలో చాలా సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలు తాము ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన సెస్సు చెల్లించడం లేదు. మునిసిపాలిటీలు కూడా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన సెస్సు సక్రమంగా చెల్లించకపోవడం  గమనార్హం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయక ముందు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతాల్లో ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్సు చెల్లించేవారు. ఉమ్మడి జిల్లా శివారు ప్రాంతాల నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థకు చాలా వరకు సెస్సు రూపంలో ఆదాయం సమకూరేది. ఉమ్మడి జిల్లాగా కొనసాగిన సమయంలో సెస్సు రూపంలోవచ్చిన ఆదాయంతో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థకు నిధుల కొరత ఎప్పుడూ తలెత్తలేదు. ఆర్థిక పరిపుష్ఠిలో ఉన్న గ్రంథాలయాల్లో హైదరాబాద్‌ నగర కేంద్ర గ్రంథాలయం తరువాత స్థానంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉండేది. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంత మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి సెస్సు రూపంలో గ్రంఽథాలయ సంస్థకు జమ చేయాల్సిన నిధులు అనేక సంవత్సరాల పాటు చెల్లించలేదు. గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్సు విషయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు అప్పటి పంచాయతీ, మునిసిపల్‌ అఽధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకు వచ్చినా ఆశించిన ఫలితం చేకూరలేదు. అప్పట్లో తమకు నిధుల సమస్య లేకపోవడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు కూడా తమకు రావాల్సిన సెస్సు గురించి స్థానిక సంస్థలపై కూడా ఎక్కువ ఒత్తిడి తీసుకు రాలేదు. ఆ సమయంలో స్థానిక సంస్థల్లో నిధుల కొరత ఎక్కువగా ఉండడం ఓ కారణంగా నిలిచింది. 

పన్నులు వసూలైనా..

కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత స్థానిక సంస్థలకు వివిధ పథకాల ద్వారా నిధులు విడుదవుతున్నాయి. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నారు. ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు చివరి వరకు వసూలు చేయాల్సిన పన్నుల డిమాండ్‌లో 80 శాతం పైగా వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి మునిసిపాలిటీలు, పంచాయతీలు వసూలు చే సిన పన్నుల్లో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన 0.08 శాతం సెస్సు కూడా అదేరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు బదిలీ చేయాలి. అయితే కొత్త జిల్లా ఏర్పాటైన తరువాత వికారాబాద్‌ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల నుంచి గ్రంథాలయ సంస్థకు  గ్రంథాలయ సెస్సు రూపంలో ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నా.. రూ. 5 లక్షల కంటే ఎక్కువ గ్రంథాలయ సంస్థకు సమకూరడం లేదు. కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత వికారాబాద్‌కు ఇప్పటి వరకు సుమారు రూ.2.50 కోట్ల వరకు సెస్సు ఆదాయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కోల్పోయింది. ఏడాదికి గ్రామ పంచాయతీల నుంచి రూ.25 లక్షల సెస్సు రావాల్సి ఉండగా, గత ఏడాది లక్ష రూపాయల లోపే చెల్లించారు. వికారాబాద్‌ మునిసిపాలిటీ రూ.40 లక్షలు, కొడంగల్‌ మునిసిపాలిటీ రూ.1.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే అవి సక్రమంగా చెల్లించడం లేదు. పరిగి, తాండూరు మునిసిపాలిటీలు మాత్రమే సక్రమంగా చెల్లిస్తున్నాయి. మునిసిపాలిటీలు, పంచాయతీలు వసూలుచేసే పన్నుల్లో తమ సంస్థకు రావాల్సిన సెస్సు క్రమం తప్పకుండా చెల్లించే విధంగా సంబంధిత సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, డీపీవోలను కలిసి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా వివిధ మండలాల ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలు, మునిసిపల్‌ కమిషనర్లకు కలిసి క్రమంతప్పకుండా సెస్సు చెల్లించాలని కోరారు. కాగా, జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా సెస్సు చెల్లింపుల విషయంలో గ్రామ పం చాయతీలు, మునిసిపాలిటీల నుంచి సరైన స్పందన రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

విధిగా సెస్సు చెల్లించాలి 

స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో నుంచి 0.08 శాతం సెస్సు రూపంలో గ్రంథాలయ సంస్థకు విధిగా చెల్లించాలి. జిల్లా గ్రంథాలయ సంస్థకు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల నుంచి రావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు కావడం లేదు. నాలుగు మునిసిపాలిటీల్లో రెండు మునిసిపాలిటీలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే, మిగతా రెండు మునిసిపాలిటీల్లో బకాయిలు పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీల నుంచి గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్సు రావడం లేదు. ఈవిషయమై జిల్లా అదనపు కలెక్టర్‌, డీపీఓలను కలిసి విజ్ఞప్తి చేశాము.  

- సురేష్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, వికారాబాద్‌

Updated Date - 2021-06-20T05:36:43+05:30 IST