Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఒక ఓటు- రెండు రాష్ట్రాలు’ యతి ప్రాసలకోసమే

దురుద్దేశంతోనే అక్బర్‌ ప్రసంగాలు

జగనకు మేం మొదటి నుంచీ దూరమే

కేసీఆర్‌తో పోరు నష్టమే

విజయశాంతి మళ్లీ బీజేపీలోకి రావచ్చు

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో బీజేపీ నేత విద్యాసాగర్‌ రావు


చిన్న వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి.. బీజేపీ అగ్రనేతగా ఎదిగి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు. బీజేపీ హిందూత్వవాదం నుంచి తెలంగాణ అంశందాకా ఆయన తన అభిప్రాయాలను ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో వెల్లడించారు. 24-02-2013న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


అన్న రాజేశ్వరరావు కమ్యూనిస్టు.. మీరు బీజేపీ వైపు వెళ్లారేం?

వయస్సు తేడా ఇందుకు కారణం కావొచ్చు. మా అన్న రాజేశ్వరావుకు నాకు మధ్య 23 ఏళ్లు తేడా. నేను కరీంనగర్‌లో ఉన్నప్పుడు నాగభూషణం అనే ఒక టీచరు మమ్మల్ని ఆర్‌ఎస్‌ఎస్‌లో చేర్చారు. ఆ తర్వాత ఏబీవీపీలో తిరిగాను. మా అన్న దీనికి ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. ఆయనకు నేనెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. భారతదేశంలో సాంస్కృతిక జాతీయవాదం ఉంది. అది శాశ్వతం. కమ్యూనిజం వంటివన్నీ అశాశ్వతం.


మరి అన్న కొడుకుపై పోటీ చేశారేం?

అప్పుడు నేను పోటీ చేస్తానని అనుకోలేదు. ఎంపీగానే పోటీ చేద్దామనుకున్నా.. కానీ, రాజకీయ పరిస్థితులను బట్టి పోటీ చేయాల్సి వచ్చింది. రమేష్‌, నేనూ బాగానే ఉంటాం. మా కుటుంబంలో ఎన్నికల గురించి, పార్టీల గురించి పెద్దగా చర్చించం.


వ్యక్తిగత ఎజెండాకే ప్రాధాన్యమిస్తారనే ఆరోపణలు..?

అదేం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. తెలంగాణకు సంబంధించి చెప్పాలంటే.. పరకాలలో ‘అమరధామం’ నిర్మించా. 1998లో సెప్టెంబర్‌ 17న మొదటిసారిగా విమోచన దినం ప్రారంభించా. షోయబుల్లాఖాన్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తున్నా. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇలాంటివీ చేస్తుంటా.


తెలంగాణ విషయంలో దూకుడుగా ఉంటారేం?

ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కాదు. నేను చేస్తున్నది వాస్తవంగా వ్యవహరించడం. నిష్పక్షపాతంగా పనిచేయడం. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే.. మరో ప్రాంతాన్ని దూషించడం కాదు. ఇప్పుడున్న తెలంగాణ.. మూడు ప్రాంతాల బిడ్డల సమాహారం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రావాలి.


మీ పనులు కేసీఆర్‌కే ఎక్కువగా ఉపయోగమనే ఆరోపణలు?

కేసీఆర్‌కు ఉపయోగపడడం అనేదికాదు.. వాలితో పోట్లాడిన సుగ్రీవుడికి సగం బలం పోయినట్లు.. కేసీఆర్‌తోగానీ, టీఆర్‌ఎస్‌తోగానీ బీజేపీ పోట్లాడితే జరిగేది అదే. తెలంగాణలో మేం వెనుకబడుతున్నాం. అయినా ఫర్వాలేదు. తెలంగాణ విషయం ఓడిపోవడానికి వీల్లేదనే ఆలోచనతో ఉన్నాం.


తెలంగాణ కోసం పార్టీ చేసిందేమిటి?

తెలంగాణ విషయంలో మేం గెలిచాం. రాజ్యసభలో, లోక్‌సభలో ప్రస్తావించాం. జాతీయ స్థాయిలో మద్దతు సంపాదించడం బీజేపీ రాష్ట్ర పార్టీ విజయమే. ఇక ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అనే నినాదం అప్పుడు యతి ప్రాసల కోసం మాట్లాడిందే. మా ఉద్దేశం అదికాదు. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాన్ని రెండుగా విభజించాలి. కాకినాడలో మేం చేసిన తీర్మానాన్ని పార్టీ అధిష్ఠానానికి పంపించాం. వారు తిరస్కరించారు. తర్వాత 2006లో జాతీయ కార్యవర్గంలో రెండు రాష్ట్రాల అంశాన్ని ఆమోదింపజేశాం. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు చాలా బాగున్నాయి. 2014లోపు తెలంగాణ ఇస్తే బాగుంటుంది. 


విజయశాంతిని మళ్లీ బీజేపీలోకి తీసుకుంటున్నారా?

అది నాకు తెలియదు. ఆమె బీజేపీలో ఉన్నప్పుడు చురుగ్గా పనిచేశారు. కానీ, ఆమె తిరిగొచ్చే విషయాన్ని కొట్టిపారేయలేం.


తెలంగాణ ఇస్తే బీజేపీ బలపడుతుందని అసదుద్దీన్‌ వ్యాఖ్యలు?

అసదుద్దీన్‌ ఆలోచన చాలా పొరపాటు. నిజాం తన పరిపాలనలోనూ ఓ దురాలోచన చేశాడు. హిందూ జనాభా ఎక్కువగా ఉం టే పరిపాలన చేయలేనని భావించి.. ‘తబ్లిక్‌’ పేరిట మతమార్పిడులకు పాల్పడ్డాడు. ఇప్పుడు మజ్లిస్‌ వాళ్లూ తమ సంఖ్య పెంచుకోవాలని చూస్తూ.. అలాంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. వాళ్లెప్పుడూ సక్సెస్‌ కాలేరు. ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో.. పోలీసులను, చట్టాలను తమ పని తాము చేసుకుపోనిస్తే ఏం జరుగుతుందో వాళ్లకు ఈ మద్యే అనుభవంలోకి వచ్చింది.


అక్బరుద్దీన్‌ ప్రసంగం ఏదో రాత్రి పన్నెండు గంటలకు ఇచ్చి, దానిని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడం వెనుక.. రెచ్చగొట్టాలని, తనకు పేరు రావాలనే దురుద్దేశం ఉంది. ఒకవేళ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత తొగాడియా వివాదాస్పదంగా మాట్లాడినా శిక్షార్హుడే! హిందూ ముస్లింలు కలిసి జీవించాలని వివేకానందుడు తన ముస్లిం స్నేహితుడు షరీఫుద్దీన్‌కు ఎప్పుడో ఓ లేఖ రాశారు. తల వేదాంతం అయితే.. శరీరం ఇస్లాం అనీ పేర్కొన్నాడు. ఇప్పుడు దానిని ఆచరించాల్సిన పరిస్థితి. హిందూ, ముస్లింలు కలిసి సహజీవనం చేయాల్సిందే. లేకపోతే.. దేశాన్ని రక్షించలేం.


మరి రాజకీయంగా బీజేపీ పరిస్థితి ఏమిటి?

స్వతంత్రంగా ఎదుగుతామనే నమ్మకం మాకుంది. మూడు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఎలా అభివృద్ధి చేయాలనేదిశగా కృషి చేస్తున్నాం. జాతీయ రాజకీయాల ప్రభావం త్వరలోనే రాష్ట్రంపై పడుతుంది. వాతావరణం సహకరిస్తే.. పట్టు సాధిస్తాం.


కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో అవినీతి, గడ్కరీపై ఆరోపణలు?

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. బీజేపీ నాయకులు నీతివంతంగా ఉంటారు. అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దడానికి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గడ్కరీ పదవి నుంచి తప్పుకొన్నారు కదా! వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వానికి.. ఇప్పటి యూపీఏ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. భూమి దగ్గరి నుంచి స్పెక్ట్రమ్‌ దాకా అన్నీ కుంభకోణాలే. లక్షల కోట్ల దోపిడీ జరిగిపోతోంది.


జగన్‌పై ఇటీవల దాడి పెంచారేం?

ఇది కొత్త విషయం ఏమీ కాదు. మేం మొదటి నుంచీ ఆరోపిస్తున్నాం. సుష్మాస్వరాజ్‌ కేవలం ప్రభుత్వం జగన్‌పై ఒత్తిడి చేయడానికి సీబీఐని ఉపయోగించుకుంటోందని అన్నారు. అది సీబీఐని రాజకీయంగా వాడుతున్నారనేగానీ, జగన్‌ను సమర్థిస్తూ కాదు. ఇటీవల ఏదో సందర్భం వచ్చి మా పార్టీ ప్రతినిధి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కేసుల వివరాలను పునరుద్ఘాటన చేశారు.


వచ్చే ఎన్నికల్లో పోటీ?

2014లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తా. లేదా పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆలోచిస్తా. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో పార్టీ ఉంది.

Advertisement

రాజకీయ నేతలుమరిన్ని...

Advertisement