చైన్‌ హార్వెస్టర్‌ దొరుకుత లేదు

ABN , First Publish Date - 2021-11-30T05:29:33+05:30 IST

వరి కోతలు ఆలస్యమైన వారికి పెద్ద తిప్పలు వచ్చి పడ్డాయి. కూలీల కొరత, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు హార్వెస్టర్‌తో కోతలు కోసేందుకు మొగ్గుచూపుతున్నారు. టైర్లతో కూడిన హార్వెస్టర్‌ బురదలో దిగబడుతుండడం వల్ల తప్పనిసరిగా చైన్‌ హార్వెస్టర్‌నే నమ్ముకోవాల్సి వస్తున్నది. అయితే ఈ చైన్‌ హార్వెస్టర్లకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

చైన్‌ హార్వెస్టర్‌ దొరుకుత లేదు
పెద్దకోడూరులో వరి కోస్తున్న చైన్‌ హార్వెస్టరు

విపరీతమైన డిమాండ్‌తో చుక్కల్లో కిరాయిలు

రైతుకు వరి కోతల భారం

ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్నదాత కుదేలు


చిన్నకోడూరు, నవంబరు 29 : వరి కోతలు ఆలస్యమైన వారికి పెద్ద తిప్పలు వచ్చి పడ్డాయి. కూలీల కొరత, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు హార్వెస్టర్‌తో కోతలు కోసేందుకు మొగ్గుచూపుతున్నారు. టైర్లతో కూడిన హార్వెస్టర్‌ బురదలో దిగబడుతుండడం వల్ల తప్పనిసరిగా చైన్‌ హార్వెస్టర్‌నే నమ్ముకోవాల్సి వస్తున్నది. అయితే ఈ చైన్‌ హార్వెస్టర్లకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. సాధారణ హార్వెస్టర్‌ కంటే చైన్‌ హార్వెస్టర్‌కు యాభైశాతం అదనంగా కిరాయి వెచ్చించాల్సి వస్తున్నది. సాధారణ హార్వెస్టర్‌కు గంటకు రూ.1,800 నుంచి 2,000 వరకు ఉండగా, చైన్‌ హార్వెస్టర్‌కు రూ.3,200 నుంచి 3,500 వరకు తీసుకుంటున్నారు. దీంతో రైతుకు ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. స్థానికంగా ఈ హార్వెస్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండడంతో వారికి వరంగా మారింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కోతలు త్వరగా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు వాపోతున్నారు.


చైన్‌ మిషన్లకు డిమాండ్‌ పెరిగింది

వరి కోతలు ప్రారంభించే సమయంలో వర్షాలు పడటంతో కోతలు ఆలస్యమవుతున్నాయి. పొలాల్లో బురద ఉండటంతో కేవలం చైన్‌ మిషన్‌లతోనే వరి కోయడానికి వీలుంటుంది. స్థానికంగా చైన్‌ హార్వెస్టర్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి. దీనితో మిషన్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

- కిష్టయ్య, రైతు, చిన్నకోడూరు

Updated Date - 2021-11-30T05:29:33+05:30 IST