యూట్యూబ్‌ చూసి చైన్‌స్నాచింగ్స్‌

ABN , First Publish Date - 2021-01-17T05:27:35+05:30 IST

చైన్‌స్నాచింగ్స్‌ ఎలా చేయాలనేదానిపై యూట్యూబ్‌లో..

యూట్యూబ్‌ చూసి చైన్‌స్నాచింగ్స్‌
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ అదనపు ఎస్పీ మనోహరరావు, పక్కన డీఎస్పీ రమణకుమార్‌, సీఐలు వాసు, శేషగిరిరావు

సీఏ చదువుతూ చెడు వ్యసనాలకు లోనై...

నిందితుడి అరెస్టు, 52 గ్రాముల బంగారం స్వాధీనం


గుంటూరు: చైన్‌స్నాచింగ్స్‌ ఎలా చేయాలనేదానిపై యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు. సీఏ చదువుకు మధ్యలోనే స్వస్తిచెప్పి చెడువ్యసనాలకు లోనై అందుకు అవసరమైన డబ్బుకోసం చైన్‌ స్నాచింగ్స్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ఉంటున్న నిజాంపట్నం మండలం కూచినపూడికి చెందిన కచ్చారం మధుసూదనరావును అరండల్‌పేట పోలీసులు అరెస్టుచేసి అతని వద్ద 52 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ సీసీఎస్‌ అదనపు ఎస్పీ మనోహరరావు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. 


గోపాలకృష్ణకాలనీ 2వ లైనుకు చెందిన రమావత్‌ కోటేశ్వరీభాయి గత నెల 30వ తేదీ సాయంత్రం ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా భారత్‌పేట 6/1లో ఓ యువకుడు వెనుకనుంచి వచ్చి ఆమె మెడలోని రెండుపేటల నాంతాడును తెంచుకుని పరారయ్యాడు.


అమరావతి రోడ్డులోని శివాలయం పక్కసందులో ఈనెల 8న సాయంత్రం 7 గంటలకు ఓ వృద్ధురాలి మెడలో ఓ యువకుడు బంగారపు గొలుసు తెంచుకొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు నడుచుకుంటూ వచ్చి చైన్‌ స్నాచింగ్‌ నేరాలకు పాల్పడుతున్న ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంఘటన జరిగిన ప్రదేశానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఓ వ్యక్తి హడావుడిగా నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోపాటు పలుకోణాల్లో విచారించి నిందితుడిని కచ్చారం మధుసూదనరావుగా గుర్తించి అరెస్టుచేశారు. ఇంటర్‌ అనంతరం సీఏ చదివేందుకు గుంటూరు వచ్చిన మధు మధ్యలోనే చదువు మానేసి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో  చైన్‌ స్నాచింగ్‌ నేరాలు ఎలా చేయాలో చూసి ఆ ప్రకారం  రెండు చైన్‌స్నాచింగ్‌లు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎటువంటి ఆధారాలు లేని చైన్‌స్నాచింగ్‌ కేసులో నిందితుడిని అరెస్టుచేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయా అధికారులు, సిబ్బందితోపాటు ఇన్‌చార్జ్‌ వెస్ట్‌ డీఎస్పీ వీవీ రమణకుమార్‌, సీఐలు వాసు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు

 

Updated Date - 2021-01-17T05:27:35+05:30 IST