Advertisement
Advertisement
Abn logo
Advertisement

చైనాతో కయ్యం వల్లే ఆయుధపోటీ

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని పలు కీలకదేశాలు నిశ్శబ్దంగా ఆయుధ పోటీలో నిమగ్నమై ఉన్నాయి. ప్రతి దేశమూ తక్కిన దేశాలతో సైనికపరంగా వెనుకబడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఆ ప్రాంతం పలు భూ సరిహద్దులు, సముద్ర సరిహద్దులు, వనరుల వివాదాలతోనూ, పాత శత్రుత్వాలతోనూ రగులుతోంది. ఈ పరిస్థితిలో పరస్పర అవగాహనలో ఏమైనా లోపాలు తలెత్తి, వివాదాలు జటిలమైతే ఆ ప్రాంతమంతటా శాంతి‍భద్రతలకు ముప్పు వాటిల్లగలదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా, చైనా ఆయుధ పోటీలో ముంద డుగులో ఉండగా, ఇతర దేశాలైన జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్థాన్ కూడా ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో పరస్పరం పోటీ పడుతున్నాయి.


చైనాలో ప్రస్తుత అధ్యక్షుడు షీ జెన్ పింగ్ అధికారంలోకి వచ్చాక సైనిక ఆధునికీకరణ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చైనా సైనిక బడ్జెట్ ఏటేటా పెరుగుతోంది. 2021లో అది అత్యధికంగా 200 బిలియన్ డాలర్లు దాటింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉన్నది. అధునాతన స్టెల్త్ ఫైటర్‌జెట్లు, 350 అణ్వాయుధాలు, 60 జలాంతర్గాములు ఈ సైన్యం అమ్ములపొదిలో ఉన్నాయి. ఈ దేశం ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని సమర్థవంతంగా పరీక్షించింది. షాంఘైలోని జియంగ్నాం షిప్‌యార్డులో అధునాతన విమాన వాహక నౌక తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది ఉపయోగంలోకి వస్తే అమెరికాకు ధీటుగా చైనా సముద్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అత్యంత వేగంగా విమానాలను ఆకాశంలోకి పంపగలదు. చైనా చేపడుతున్న ఈ సైనిక ఆధునీకరణ ప్రక్రియలు భద్రతాపరంగా ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి.


ఉత్తర కొరియా పేద దేశమైనప్పటికీ దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో నాలుగో వంతును సైన్యంపైనే ఖర్చు పెడుతున్నది. ప్రత్యర్థి దేశాలైన దక్షిణ కొరియా, అమెరికాలను ఎదుర్కోవడానికి సైనిక ఆధునికీకరణ పనులను తీవ్రతరం చేసింది. అక్టోబరులో జరిగిన కొరియా వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవంలో ఆ దేశం తన సైనిక సామర్థ్యాన్ని కవాతు ద్వారా ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసింది. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా సమకూర్చుకున్న ఆధునిక ఆయుధాల్లో్– స్నైపర్ రైఫిళ్ళు, సెమి–ఆటోమాటిక్ గ్రెనేడ్ లాంచర్లు, ట్యాంకు విధ్వంసకాలు, భారీ బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, కొత్త తరహా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన క్షిపణులు మొదలైనవి ఉన్నాయి. ఉత్తర కొరియా 40 నుంచి 50 అణ్వాయుధాలను, మరో 60 అణ్వాయుధాలకు సరిపడే ఫిజైల్ సామాగ్రిని కలిగి ఉన్నదని అంచనా.


చైనా, ఉత్తర కొరియాలకు భౌగోళికంగా సమీపంలో ఉండి అత్యంత వేగవంతంగా సైనిక ఆధునికీకరణ చేపట్టిన దేశాలు జపాన్, దక్షిణ కొరియాలు. రెండవ ప్రపంచయుద్ధం తరువాత మొదటిసారిగా జపాన్ తన సైనికవ్యయాన్ని ఇప్పుడున్న దానికి రెండింతలు చేసిందని జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. చైనా ప్రధాన భూభాగానికి సమీపంలో ఉన్న ఒకినావా ద్వీపాలలో 2022 సంవత్సరం లోగా మరిన్ని క్షిపణులు మోహరిస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. జపాన్ కొన్నేళ్ళుగా అమెరికా నుంచి పలు ఫైటర్ జెట్లను, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కొనుగోలు చేసి తన వైమానిక సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. స్వీయ రక్షిత దళంగా పిలవబడే జపాన్ సైన్యం మొట్టమొదటి సారిగా హైటెక్ జలాంతర్గాములను, విధ్వంసకాలను, స్టెల్త్ ఫైటర్లను సమకూర్చుకునే పనిలో నిమగ్నమై ఉంది. ప్రపంచంలో అణ్వాయుధాల బారిన పడిన ఒకే ఒక్క దేశం జపాన్. ఇప్పుడు అక్కడ క్రమంగా బలం పుంజుకుంటున్న రైట్‌వింగ్ రాజకీయపక్షాలు, దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా, జపాన్ స్వయంగా అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని ఒత్తిడులు తెస్తున్నాయి.


ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య క్షిపణుల అభివృద్ధిని నిరోధిస్తూ ఇరు దేశాల మధ్య ఆయుధ పోటీని నిలువరింపచేసే 1979 ఒప్పందానికి ఉత్తర కొరియా తిలోదకాలివ్వడంతో దక్షిణ కొరియా స్వతంత్రంగా తన సైన్యాన్ని శక్తివంతం చేసుకుంటున్నది. 2020 నుంచి రక్షణ రంగ సంస్కరణల ప్రణాళికలలో భాగంగా దక్షిణ కొరియా ప్రతి సంవత్సరం సైనిక వ్యయాన్ని పది శాతం పెంచుతూ వస్తున్నది. 


చాలకాలం వరకు ఇండో–పసిఫిక్ సైనిక వ్యవహారాల్లో ఆసక్తి కనబరచని ఆస్ట్రేలియా గత సెప్టెంబరులో కుదిరిన ఆకస్ (ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డం, యునైటెడ్ స్టేట్స్) ఒప్పందం ద్వారా, 1970 అణ్వస్త్రవ్యాప్తి నిరోధక సంధి సూత్రాలకు వ్యతిరేకంగా డజను అత్యాధునిక అణు జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నది. సైనిక ఆధునికీకరణ కార్యక్రమాలకు 2019నుంచే ఆస్ట్రేలియా శ్రీకారం చుట్టింది. వందల సంఖ్యలో అత్యాధునిక యుద్ధవిమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో చైనాను ఎదుర్కోవడానికి తనదైన రీతిలో తైవాన్ కూడా బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తూ తన వైమానిక రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నది.


తైవాన్ తరువాత అత్యంత ప్రమాదకరమైన సైనిక ప్రతిష్టంబన కలిగినది భారత–చైనా సరిహద్దు ప్రాంతం. గత కొన్నేళ్లుగా మొదట, భూటాన్ సరిహద్దులోని డొక్లాం, తరువాత లద్దాక్ లోని గల్వాన్ లోయలలో ఘర్షణలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా అతిక్రమణలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా చైనా పాకిస్థాన్ తో సైనిక సంబంధాలను పెంపొందించుకుంటూ వస్తున్నది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, తన సైనిక ఆధునికీకరణను మాత్రం ఆపడం లేదు. పాకిస్థాన్ సుమారు 165 అణ్వాయుధాలను కలిగి ఉంది. ఈ సంఖ్య 2025 నాటికి 200కు పెరగగలదని అంచనా. 


అమెరికా, చైనాల తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద సైనిక వ్యయం కలిగిన దేశం భారత్. ఒక అంచనా ప్రకారం మన దేశం సుమారు 156 అణ్వాయుధాలను, అన్నిరకాల క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాలకు వెనకబడకుండా ఉండడానికి భారత్ తన రక్షణ రంగాన్ని అన్ని రకాలుగా బలోపేతం చేసుకుంటున్నది. కొన్ని యుద్ధ విమానాలను, నౌకలను స్వయంగా తయారు చేసుకోవడమే కాకుండా, ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నది. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి కూడా భారత్ అధునాతన రక్షణ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో సౌదీ అరేబియా తరువాత రెండవ అతి పెద్ద యుద్ధసామగ్రి దిగుమతి చేసుకునే దేశం భారతదేశమే.


ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదిపత్య శక్తిగా ఉన్న అమెరికా ఆయుధవ్యవస్థలు, దాని నిరంతర ఆయుధ ఆధునికీకరణ ప్రక్రియల ముందు ఏ ఇతర దేశాలూ సరితూగవు. ప్రపంచ రక్షణ వ్యయంలో సుమారు 40శాతం ఒక్క అమెరికానే వెచ్చిస్తోంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆయుధ పోటీలో చైనా, ఉత్తర కొరియా దేశాల్ని మినహాయిస్తే తక్కిన అన్ని దేశాల ఆయుధ సంపత్తి పెంపులోనూ అమెరికా తన పాత్రను కలిగి ఉంది. ఇలా స్వీయభద్రత కోసం ఇండో–పసిఫిక్ దేశాలు పెంచుకుంటూ పోతున్న ఆయుధ సంపత్తి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది.

చెన్న బసవయ్య మడపతి

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...