Abn logo
Sep 27 2021 @ 23:51PM

గంటల వ్యవధిలోనే చైనస్నాచర్‌ పట్టివేత

వివరాలు వెల్లడిస్తున్న సౌత డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, పక్కన సీఐ ప్రేమయ్య, ఎస్‌ఐ కిషోర్‌

గుంటూరు, సెప్టెంబరు 27: స్థానిక నల్లపాడు పోలీస్‌స్టేషన పరిధిలోని గోరంట్ల శివారు పొలాల్లో గేదెలు కాస్తున్న మహిళ మెడలో గొలుసు తెంచుకెళ్లిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈమేరకు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సౌత డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నిందితుడు దయాకర్‌ను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. గోరంట్లకు చెందిన గోళ్ల వెంకటేశ్వరమ్మ పొలంలో గేదెలు కాస్తుండగా... ఆదివారం మధ్యాహ్నం ఆటోలో అక్కడకు ముగ్గురు యువకులు వచ్చారు. అక్కడ ఫెన్సింగ్‌ వేసే సిమెంటు రాళ్లను కొనుగోలు చేసేందుకు వచ్చినట్టు తెలిపారు. ఆమె ఒంటరిగా ఉండటంతోపాటు ఆమె మెడలో బంగారపు గొలుసు ఉండడాన్ని బుర్రా దయాకర్‌ గమనించాడు. తనతోపాటు ఆటోలో వచ్చినవారిని పంపించి.. కొద్దిసేపటి ఆ మహిళ వద్దకు వచ్చిన దయాకర్‌ సిమెంటు దిమ్మెల ధర కనుక్కుంటూ ఆమె మెడలోని నాలుగు సవర్ల గొలుసును తెంచుకోవడమే కాకుండా ప్రతిఘటించిన ఆమెపై దాడికి కూడా పాల్పడి ఉడాయించాడు. దీంతో బాధితురాలు నల్లపాడు పోలీస్‌స్టేషనలో ఫిర్యాదుచేయగా.. డీఎస్పీ ప్రశాంతి వెంటనే  సీఐ ప్రేమయ్య, ఎస్‌ఐ కిషోర్‌లను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో మేడికొండూరు కేసుదర్యాప్తులో ఉన్న ఎస్‌ఐ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి సమీపప్రాంత సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. దీంతో వారికి దయాకర్‌ వచ్చిన ఆటో కనిపించింది. దాని ఆధారంగా ఎస్‌ఐ కూపీ లాగారు. చైనస్నాచింగ్‌కు పాల్పడింది స్వర్ణభారతినగర్‌ పరిధిలోని కృష్ణతులసీనగర్‌ 5వ లైనుకు చెందిన బుర్రా దయాకర్‌గా గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చోరీచేసిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఐ కిషోర్‌ను సౌత డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ప్రేమయ్యలు అభినందించారు.