చలాన్‌ బాదుడు!

ABN , First Publish Date - 2021-11-28T06:39:08+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు రహదా రి నిబంధనల పేరిట ఈ-చలానా ద్వారా భారీగానే జరిమానాలు విధిస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో కొందరు ట్రాఫిక్‌ సిబ్బంది వాహనదారులను భయబ్రాంతులకు

చలాన్‌ బాదుడు!
ద్విచక్ర వాహనం ఫొటో తీస్తున్న ట్రాఫిక్‌ పోలీసు

జిల్లా కేంద్రంలో బైక్‌ దహనం ఘటనపై సర్వత్రా విమర్శలు

బయటకెళ్లేందుకే జంకుతున్న వాహనదారులు

ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన కరువు

పట్టణంలో అస్తవ్యస్థంగా ట్రాఫిక్‌.. అయినా ఆదాయంపైనే దృష్టి

జిల్లాలో నిత్యం వాహన తనిఖీలతో విసుగెత్తి పోతున్న జనం

ఆదిలాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే జరిమానాలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు రహదా రి నిబంధనల పేరిట ఈ-చలానా ద్వారా భారీగానే జరిమానాలు విధిస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో కొందరు ట్రాఫిక్‌ సిబ్బంది వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్‌, లైసెన్స్‌, ఆర్సీ కార్డు లేని వాహనదారులకు ఈ- చలాన్‌ ద్వారా జరిమానా వేస్తే పర్వాలేదు, కానీ అన్ని ఉండి వాహనాలు నడుపుతున్న వారికి చలాన్‌ ద్వారా తెలియకుండానే ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో అవాక్‌ అవుతున్నారు. కొందరు ట్రాఫిక్‌ సిబ్బంది ఇష్టారాజ్యంగా ఫొటోలు తీయడం, చలాన్‌లు వేయడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. నిత్యం ఉన్నతాధికారులు ఈ-చలాన్‌ ద్వారా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రిబుల్‌రైడ్‌, అతివేగంపై కేసులు నమోదు చేసేలా టార్గెట్‌ విధించడంతో అడ్డగోలుగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల నడ్డి విరుస్తున్నట్లు తెలుస్తుంది. రోజుకు ఒక్కో స్టేషన్‌ పరిధిలో 10నుంచి 20 కేసులు నమోదు చేయాలనే టార్గెట్‌ పెట్టడంతో కేసులు చేయక తప్పడం లేదని కొందరు ట్రాఫిక్‌ సిబ్బంది బహిరంగంగానే చెప్పడం గమనార్హం. శనివారం జిల్లా కేంద్రంలోని పంజాబ్‌చౌక్‌లో వాహన తనిఖీలో పట్టుబడిన ఓ వాహనదారుడు జరిమానాలు చెల్లించలేక విసుగెత్తిపో యి తన వాహనానికి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా, బైక్‌ దహనం విషయమై ట్రాఫిక్‌ ఎస్సై ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశామని ఎస్సై అప్పారావు పేర్కొన్నారు.

భయంభయంగానే బయటకు..

ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలంటే భయంభయంగానే వెళ్తున్నా.. ఈ-చలాన్‌ల ద్వారా జరిమానాలు తప్పడం లేదని వాపోతున్నారు. ఎక్కడ ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేస్తారోనన్న భయం వెంటాడుతోంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ సిబ్బంది వాహనాలను తనిఖీ చేయడం పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ముందే జాతీయ రహదారి పై వాహన తనిఖీలు చేపట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొమురంభీం చౌక్‌లో వాహనాలు తనిఖీలు చేపడుతున్న పోలీసుల కంటపడకుండా కొందరు వాహనదారులు రాంగ్‌రూట్లలో హడావిడి గా వెళ్లూ ప్రమాదాల భారీన పడుతున్నారు. అలాగే ఫిల్టర్‌బెడ్‌ నుంచి కలెక్టర్‌ రోడ్డు మీదుగా బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇలా కొందరు వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలతో సావాసం చేయాల్సి వస్తోందని ఆందోళన చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారమేది?!

ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారులకు నాలుగైదుసార్లు జరిమానాలు విధించినా.. కొందరిలో మళ్లీ అదేతీరు కనిపిస్తోంది. వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై ఏమాత్రం అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో మధ్యవర్తుల ద్వారా లైసెన్సులను పొందుతూ వాహనం నడుపడం తప్ప, అసలు విషయంపై పరిజ్ఞానం లేకుండా పోతోంది. దీంతో జరిమానాలు పునరావృతం కావడంతో వాహనదారు లు నష్టపోతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం జరిమానాలకు ఇస్తున్న ప్రాధాన్యత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రాంతాల వారిగా విస్త్రతంగా అవగాహన కల్పిస్తే కొంత మేరకైనా ట్రాఫిక్‌ సమస్య గాడి లో పడే అవకాశం ఉంది. ఈ-చలాన్‌ల ద్వారా జరిమానా వేయడంతో కొన్ని వాహనాలపై 5నుంచి 10 వరకు జరిమానాలు పెండింగ్‌లో ఉంటున్నాయి.  

పట్టణంలో అధ్వానంగా ట్రాఫిక్‌

జిల్లాకేంద్రంలోని పలు ప్రధాన రూట్లలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, ప్రధాన కూడళ్ల విస్తీర్ణంతో గజిబిజిగా మారింది. ముఖ్యంగా రాంలీలా మైదానం నుంచి నేతాజీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, శివాజీచౌక్‌, రైల్వే స్టేషన్‌ వరకు ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఈ రూట్‌లలో రోడ్డు మధ్యలో డివైడర్‌ ను నిర్మించినా.. ఇరువైపుల వ్యాపారులు రోడ్డుపైననే పార్కింగ్‌ చేయడంతో అడుగు పెట్టేందుకు వీలులేకుండా పోయింది. కొందరు చిరు వ్యాపారులు రోడ్డుపైననే తోపుడు బండ్లను నిలిపి వ్యాపారం చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. అలాగే పశువుల సంచారం కూడా పెరిగిపోతున్నా.. కట్టడి చేసే ప్రయత్నాలు ఏమాత్రం చేయడం లేదు. మున్సిపల్‌ అధికారులు ట్రాఫిక్‌ పోలీసుల మధ్య సమన్వయం కొరవడడంతో ట్రాఫిక్‌ సమస్య తీరడం లేదు. అలాగే ఇండస్ర్టీయల్‌ పార్కులో సాగర్‌ సూపర్‌ మార్కెట్‌, వరసిద్ధి వినాయక షాపింగ్‌మాల్‌, డీబీ జ్యూవెలర్స్‌, ఏసీఎన్‌ షాపింగ్‌మాల్‌, రిలయన్స్‌ షాపింగ్‌ మాల్‌ల ముందు రోడ్డుపైననే వాహనాలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నా.. ట్రాఫిక్‌ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం జాతీయరహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తూ ఫైన్లు విధిస్తున్నారే తప్ప, పట్టణ నడిబొడ్డున ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతున్నా.. అధికారులకు ఏమాత్రం పట్టింపేలేకుండా పోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం

: వెంకటేశ్వర రావు, డీఎస్పీ, ఆదిలాబాద్‌

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నాం. మున్సిపల్‌ అధికారుల సహకారంతో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతాం. కొన్నేళ్ల నుంచి పట్టణం లో ట్రాఫిక్‌ సమస్య ఉంది. ఒకటి, రెండు సార్లు హెచ్చరికలు చేశాం, అయినా పట్టించుకోకుంటే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవు. 

Updated Date - 2021-11-28T06:39:08+05:30 IST