చలానా హైరానా

ABN , First Publish Date - 2021-12-08T04:19:36+05:30 IST

ఈ చలానా పేరుతో పోలీసులు వాహనదారులను దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడమే

చలానా హైరానా
మహబూబ్‌నగర్‌ పట్టణంలో వాహనదారులను ఫొటోలు తీస్తున్న ట్రాఫిక్‌ పొలీస్‌

వెంటపడి జరిమానాలు విధిస్తున్న పోలీసులు

రాంగ్‌ పార్కింగ్‌ ఫెనాల్టీలపై నిరసన

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలదీ అదే పరిస్థితి

టార్గెట్‌ల కోసం ఎడాపెడా విధింపు

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది రూ.28 కోట్ల వరకు చలానాలు

మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే రూ.6 కోట్లు..


ఈ చలానా పేరుతో పోలీసులు వాహనదారులను దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడమే పోలీసుల డ్యూటీగా మారిందన్న విమర్శలొస్తున్నాయి. ఒక్కొక్కరు రోజుకు ఇన్ని ఫెనాల్టీలు వేయాలంటూ టార్గెట్‌లు పెట్టి, వారి  చేతిలో సెల్‌ఫోన్‌లు పెట్టడంతో ఎడాపెడా చలానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఈ  చలానాల విషయంలో ఉన్నతాధికారులు ఏం ఆదేశాలిస్తున్నారో తెలియదు కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తతంగంపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

- మహబూబ్‌నగర్‌ 

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన పేరుతో పోలీసులు విచ్చలవిడిగా ఈ చలానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తారు. అయితే క్షేత్రస్థాయిలో టార్గెట్‌ల కోసం వెంటపడి జరిమానాలు విధిస్తున్నారు. గల్లీ రోడ్లపైనా ఫెనాల్టీలు వేస్తున్నారు. బైక్‌పై అదేపనిగా తిరుగుతూ, ఈ చలానాలు వేయడంపై సామాన్య ప్రజలనుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మాస్క్‌ ధరించకుంటేనో, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తేనో, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తేనో, మైనర్‌లు వాహనాలు నడిపితేనో ఫెనాల్టీలు వేస్తే తప్పులేదు. కానీ హెల్మెట్‌ వాడటం లేదని, రోడ్డుపై వాహనాలు పార్క్‌ చేశారని ఫెనాల్టీలు వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో హెల్మెట్‌ లేకుండా పట్టణాల్లో వాహనాలు నడిపేవారు 95 శాతం మంది ఉన్నారు. ఇందులో పోలీసులు కూడా ఉంటారు. వీళ్లందరి ఫొటోలు తీయాలంటే ఉన్న సిబ్బంది కూడా సరిపోరు. ఇక రాంగ్‌ పార్కింగ్‌ అంటే రోడ్లపై షాపింగ్‌ చేసేవారు ఫుట్‌పాత్‌  పక్కన వాహనాలు ఆపుకుంటారు. అలాంటి వారికి కూడా జరిమానా విధిస్తున్నారు. వాహనాలు పార్క్‌ చేసుకోడానికి ప్రత్యేక స్థలం లేనప్పుడు ఎక్కడ ఆపాలి?, టార్గెట్‌ల కోసం ఇలాంటి వాటికీ ఫొటోలు తీయడం సరికాదని ప్రజల నుంచి నిరసన వ్యక్తమౌతోంది. ఈ చలానా ఫైన్లు వేసే పోలీసులు రన్నింగ్‌లోనే ఒక చేత్తో వాహనం నడుపుతూ, ఇంకో చేత్తో ఫొటో తీస్తున్నారు. ఇలా అయితే వారూ వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ వాడడం కాదా?, హెల్మెట్‌ వాడని పోలీసులు నిబంధనలు ఉల్లంఘించినట్లు కాదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిం చేందుకు ఏర్పాటు చేసిన సదరు స్టేషన్‌ ఇబ్బంది అదే పనిగా చలానా వేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రూ.28 కోట్ల వరకు చలానాలు విధించారు. పాలమూరులోని ఒక్క ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే 11 నెలల్లో రూ.3 కోట్లకు పైగా ఫెనాల్టీలు వేశారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే రూ.6 కోట్ల జరిమానాలు విధించడం గమనార్హం.


డ్రంకెన్‌ డ్రైవ్‌ విషయంలోనూ

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా పోలీసులు వెంట పడి చేస్తున్నారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు ప్రమాదాలకూ గురవుతు న్నారు. మద్యం దుకాణాలు, బార్ల ముందు మాటువేసి మరీ తనిఖీలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను వేటాడినట్లు మందు బాబులను వేటాడుతు న్నారు. అన్ని జిల్లా కేంద్రాల శివారులో దాబాలు పుట్టగొడు గుల్లా వెలుస్తున్నాయి. ఇల్లీగల్‌గా దాబాలు నడిపేవారికి రాచబాట వేస్తున్న పోలీసులు, అక్కడ నిర్వహించని తనిఖీలు లైసెన్స్‌ చెల్లించే తమ దుకాణాల వద్ద చేయడం ఏంటని మద్యం వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలంటే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాల్సిందే. అయితే ఈ ఛాలానా, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పారదర్శకత పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-12-08T04:19:36+05:30 IST