నకిలీ చలాన్లపై.. కేసులు

ABN , First Publish Date - 2021-10-18T05:22:28+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో జిల్లాకు కూడా లింకు ఉన్నట్లు తేలింది.

నకిలీ చలాన్లపై.. కేసులు

రూ.13 లక్షలు అవకతవకల గుర్తింపు

చలానాల కుంభకోణంలో 15 మందిపై ఫిర్యాదు

నాలుగు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో అవకతవకలు 

సబ్‌ రిజిస్ర్టార్లకు నోటీసులు, శాఖాపరమైన విచారణకు చర్యలు


గుంటూరు, అక్టోబరు 17: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలాన్ల కుంభకోణం వ్యవహారంలో జిల్లాకు కూడా లింకు ఉన్నట్లు తేలింది. గడచిన రెండేళ్లలో జరిగిన రిజిస్ర్టేషన్ల డాక్యుమెంట్లకు సంబంధించి జిల్లాలోని 35 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. మంగళగిరి, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో నకిలీ చలాన్ల కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయాల పరిధిలో రూ.13 లక్షలు అవకతవకలు జరిగినట్టు తేలింది. ఆయా సబ్‌ రిజిస్ర్టార్ల ఫిర్యాదు మేరకు 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కుంభకోణంపై ఆయా సబ్‌ రిజిస్ర్టార్లకు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. అయితే అందులో తమ ప్రమేయం లేదని సబ్‌ రిజిస్ర్టార్ల నుంచి అధికారులకు వివరణ కూడా వచ్చినట్టు తెలిసింది. అయితే ఆయా సబ్‌ రిజిస్ర్టార్లు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మొత్తాన్ని కూడా ఇప్పటికే చాలా వరకు రికవరీ  చేసినట్టు సమాచారం. ఇందులో డాక్యుమెంటు రైటర్లతోపాటు చలానా తీసినప్పుడు ఎవరైతే సంతకాలు చేశారో వారిని కూడా బాధ్యులను చేశారు. ఆస్తుల క్రయ, విక్రయాలు జరిపిన వారిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. 


నూతన విధానంలోనూ విఘాతం

రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణం నేపథ్యంలో ఉన్నతాధికారులు సాంకేతికంగా నూతన విధానం అమలులోకి తీసుకువచ్చారు. బ్యాంకులో తీసిన చలానా నెంబరును సబ్‌ రిజిస్ర్టార్‌ తన కంప్యూటర్‌లో నమోదు చేస్తే సీఎఫ్‌ఎంఎస్‌కు ఆ చలానా ద్వారా ఎంత మొత్తం జమ అయ్యిందో కనపడనుంది. దానిని పరిశీలించిన తర్వాతే సబ్‌ రిజిస్ర్టార్లు రిజిస్ర్టేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. అయితే జిల్లాలో అక్కడక్కడ సబ్‌ రిజిస్ర్టార్లకు సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లిన చలానా వివరాలు సకాలంలో డిస్‌ప్లే కావటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఆ చలానా ఆన్‌లైన్‌లో కనిపిస్తేనే రిజిస్ర్టేషన్‌కు సబ్‌ రిజిస్ర్టార్లు అనుమతి ఇవ్వాల్సి ఉండటంతో కొన్ని సందర్భాల్లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియకు విఘాతం కలుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా సాంకేతిక సమస్యల వల్ల, సర్వర్‌ ఇబ్బంది వల్లగానీ సబ్‌ రిజిస్ర్టార్ల వద్ద సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లిన చలానా డిస్‌ప్లే కాకపోయినప్పటికీ పాత విధానం ప్రకారం సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలో చలానా పరిశీలించి రిజిస్ర్టేషన్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలిచ్చారు. ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన సబ్‌ రిజిస్ర్టార్లు, సిబ్బంది ఆయా చలానాలపై సంతకాలు చేయాలని, భవిష్యత్‌లో ఏదైనా అవకతవకలు వెలుగు చూస్తే సంబంధిత సబ్‌ రిజిస్ర్టార్లు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో తమ వద్ద డిస్‌ప్లే కానీ చలానాల విషయంలో సంబంధిత సబ్‌ రిజిస్ర్టార్లు ఒకటికి రెండుసార్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాయంత్రం చలానాలు తీస్తే సమయం మించిపోయిన పక్షంలో ఆ రోజుకి ఆర్‌బీఐ నుంచి క్లియరెన్స్‌ రావటం లేదని అటువంటి ప్రత్యేక సందర్భాల్లో రిజిస్ర్టేషన్లను తర్వాత రోజుకు వాయిదా వేసుకుంటున్నట్టు పలువురు అంటున్నారు. 

 

Updated Date - 2021-10-18T05:22:28+05:30 IST