‘ఈ-చలాన్‌’ మంట

ABN , First Publish Date - 2021-11-28T00:43:37+05:30 IST

సాధారణంగా పోలీసుల తనిఖీ సమయంలో వాహనాలు పట్టుబడితే వాహనదారులు జరిమానా చెల్లించాలి.

‘ఈ-చలాన్‌’ మంట

ఆదిలాబాద్‌: సాధారణంగా పోలీసుల తనిఖీ సమయంలో వాహనాలు పట్టుబడితే వాహనదారులు జరిమానా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకుంటే వాహనాన్ని సీజ్‌ చేస్తారు. కానీ ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో ఇందుకు భిన్నంగా ఓ వాహనదారుడు ఏకంగా తన వాహనానికి నిప్పంటించాడు. ఆదిలాబాద్‌లోని పంజాబ్‌ చౌక్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన షేక్‌ ఫరీద్‌ బైక్‌పై వస్తుండగా, పోలీసులు వాహనాన్ని ఆపి ధ్రువపత్రాలు చూపించాలని కోరారు. సుమారు రూ.3 వేల వరకు పెండింగ్‌ చలాన్లు ఉండడం.. బైక్‌కు సంబంధించి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కొద్దిసేపు విచారణ చేపట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన షేక్‌ ఫరీద్‌ తాను చలాన్లు కట్టబోనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే తన మిత్రుడు షేక్‌ మక్బుల్‌తో డీజిల్‌ తెప్పించుకొని.. బైక్‌పై పోసి నిప్పంటించాడు. పోలీసులను దుర్భాలాడినందుకు, విధులకు ఆటంకం కలిగించినందుకు షేక్‌ ఫరీద్‌, మక్బుల్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-11-28T00:43:37+05:30 IST