కేంద్రం ఆంతర్యమేంటి?

ABN , First Publish Date - 2021-06-16T08:56:57+05:30 IST

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి రాష్ట్రప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. సవరించిన తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలుపకుండా సా..చివేత వైఖరి కొనసాగించడంలోని ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని సాగునీటి రంగ నిపుణులు

కేంద్రం ఆంతర్యమేంటి?

జలశక్తి శాఖ అనధికారిక భేటీ అసలు ఉద్దేశమేంటి?

తరచూ లోపాలు ఎత్తిచూపడమెందుకు?

తుది అంచనా కేంద్ర కేబినెట్‌కు వెళ్తుందా?

పోలవరం ప్రాజెక్టుపై అసలేం జరుగుతోంది?

సాగునీటి నిపుణుల్లో సవాలక్ష సందేహాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి రాష్ట్రప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. సవరించిన తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలుపకుండా సా..చివేత వైఖరి కొనసాగించడంలోని ఉద్దేశమేంటో అర్థం కావడం లేదని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కనీసం కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలు నియమించిన సవరణ కమిటీ సూచించిన రూ.47,725.74 కోట్ల అంచనాల గురించి కూడా కేంద్ర అధికారులు ప్రస్తావించడం లేదు. ఇది గడచిన రెండేళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత సోమవారం జలశక్తి శాఖ అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ సుధాకరబాబులతో సమావేశమైంది. తుది అంచనాలు ఆమోదించాల్సిందేనని రాష్ట్ర అధికారులు ఈ సందర్భంగా మళ్లీ కోరారు. నిధులపై అటు నుంచి స్పందనే లేదు. ఈ నేపథ్యంలో అసలు తుది అంచనాలకు ఆమోదముద్ర పడుతుందా అనే సందేహం బలంగా కలుగుతోంది. 2013-14 అంచనాల ప్రకారం.. రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయానికే కేంద్రం పరిమితమవుతోంది. ఈ మొత్తంతో ప్రాజెక్టును పూర్తి చేయలేమని ఆంధ్రప్రదేశ్‌ గట్టిగానే చెబుతున్నా కేంద్రం వైఖరిలో మార్పు కనిపించడం లేదు. అసలు ఈ ప్రాజెక్టుపై ఏం జరుగుతోందని నిపుణుల్లో పలు సందేహాలు రేగుతున్నాయి. తుది అంచనాలను ఆమోదించాలంటే కేంద్ర కేబినెట్‌ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని.. ప్రధాని మోదీ ఆదేశాలు లేనిదే. ఇది జరగదని స్పష్టం చేస్తున్నారు.


నాడు వైసీపీ చేసిన పనికి..

2018 మే 21వ తేదీన కేంద్ర జల సంఘం ఆధ్యర్యంలో సాంకేతిక సలహా మండలి (టీఏసీ) పోలవరం ప్రాజెక్టు 2017-18 అంచనా విలువను రూ.55,548.87 కోట్లుగా తేల్చింది. తర్వాత దానిని రూ.55,656.87గా రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంటూ వస్తోంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ పునఃసమీక్షించి.. రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసింది. వాస్తవానికి అంచనా వ్యయం పెరుగుదలపై ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ విమర్శలు చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే భారీస్థాయిలో అంచనాలు పెంచేశారని ఆరోపించింది. సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదాన్ని గుర్తించనేలేదు. ఇది కేవలం కొందరు ఇంజనీరింగ్‌ అధికారుల కమిటీ మాత్రమేనని పేర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ఆర్థిక శాఖ బాంబు పేల్చింది. పోలవరం అంచనాలను 2013-14 లెక్కల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా పేర్కొంటూ 2019 అక్టోబరు 12వ తేదీన.. అదే నెల 21వ తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి లేఖలు రాసింది. అప్పటి నుంచి రాష్ట్రప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లిన ప్రతిసారీ.. అంచనా వ్యయాన్ని పెంచాలంటూ కేంద్రాన్ని కోరుతున్నామంటున్నారు. 


అయినా.. రూ.20,398.61 కోట్లకే పరిమితం కావాలని కేంద్రం చెబుతూ వస్తోంది. దీనికితోడు తాజాగా అంచనా వ్యయాన్ని పనుల వారీగా విభజించింది. ప్రధాన కాలువల పనులకు ఇకపై పైసా కూడా మంజూరుచేసేది లేదని తేల్చేసింది. రూ.500 కోట్ల బిల్లులు చెల్లించకుండా వెనక్కి పంపింది. సోమవారం జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో.. ప్రాజెక్టు పనుల్లో మార్పులూ చేర్పులూ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. టన్నెల్స్‌, కాలువల సామర్థ్యాల పెంపునూ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తరచూ ప్రాజెక్టు పనుల్లో లోపాలను, పనుల నత్తనడక, పునరావాస అంశాలను లేవనెత్తుతూ.. అసలు సమస్య అయిన నిధుల మంజూరును కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాటవేస్తోందని నిపుణులు అంటున్నారు. రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు కదిలేలా లేదని అభిప్రాయపడుతున్నారు.



Updated Date - 2021-06-16T08:56:57+05:30 IST