నేడు బీజేపీ ‘చలో అమలాపురం’.. కోనసీమవ్యాప్తంగా మోహరించిన పోలీసు బలగాలు

ABN , First Publish Date - 2020-09-18T17:00:27+05:30 IST

అంతర్వేది రథం దగ్ధం ఘటన నేపథ్యంలో బీజేపీ శుక్రవారం చలో అమలాపురంనకు..

నేడు బీజేపీ ‘చలో అమలాపురం’.. కోనసీమవ్యాప్తంగా మోహరించిన పోలీసు బలగాలు

మూడు రోజులపాటు 144 సెక్షన్‌ అమలు

ముందస్తుగా బీజేపీ నేతల గృహ నిర్బంధం

చలో అమలాపురం, అంతర్వేదికి అనుమతిలేదు : డీఐజీ 

ఆందోళనకు జనసేన దూరమా?


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): అంతర్వేది రథం దగ్ధం ఘటన నేపథ్యంలో బీజేపీ శుక్రవారం చలో అమలాపురంనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత చేపట్టింది. ఇప్పటికే శుక్రవారం నుంచి మూడు రోజులపాటు కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు 30 యాక్టు అమలు చేస్తూ అమలాపురం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఉత్తర్వులు జారీచేశారు. ముందు జాగ్రత్తగా కోనసీమకు వచ్చే అన్ని వారధుల వద్ద ప్రత్యేక పోలీస్‌ పికెట్‌లను ఏర్పాటుచేశారు. ఇప్పటికే బీజీపే నాయకులను గృహనిర్భందం చేయడం ప్రారంభించారు.


ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దివ్యరథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనపై రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే అంతర్వేదిలో హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో కొందరిపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలనే డిమాండుతో బీజేపీ ‘చలో అమలాపురం’ కార్యక్ర మానికి పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాం గం అప్రమత్తమైంది. ఎదుర్లంక-యానాం, బోడసకుర్రు-పాశర్లపూడి, దిండి-చించినాడతోపాటు రావులపాలెం ప్రాంతాల్లోని గౌతమీ, వశిష్ఠ బ్రిడ్జిల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్‌లను ఏర్పాటుచేసి ఆందో ళన కారులు కోనసీమలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు.


గురు వారమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విజయ వాడ ప్రాంతంలో పోలీసులు నిర్భందించడంతోపాటు ఆ పార్టీకి చెందిన కోనసీమ నేతలను ముందస్తు గృహనిర్భందంలో ఉంచారు. పోలీసులు నేతల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటుచేసి కట్టడి చేస్తున్నారు. అయితే అంతర్వేదిలోని చర్చి అద్దాలు ధ్వంసం ఘటనలో అరెస్టుచేసి రిమాండులో ఉన్న 39 మంది నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గురువారం విడుదల య్యారు. వారంతా ర్యాలీగా వచ్చి అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళు లర్పించారు. జైశ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతర్వేది రథం దగ్ధం బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండు చేస్తూ నినాదాలు ఇచ్చారు. అయితే వీరంతా వివిధ జిల్లాలకు చెందినవారు కావడంతో డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా ఆధ్వర్యంలో పోలీసులు వారిని స్వస్థలాలకు వెళ్లిపోవలసిందిగా విజ్ఞప్తిచేసి పంపించివేశారు.


ఇక బీజేపీ చలో అమలాపురంలో భాగంగా ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలపాలని నిర్ణయించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు కోనసీమ వ్యాప్తంగా మూడురోజులపాటు సెక్షన్‌ 144 అమలులో ఉందని హెచ్చరించ డంతో పాటు చలో అంతర్వేది, చలో అమలాపురం కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం పర్మిషన్‌ ఇవ్వలేదని ఆయన ప్రకటించారు. కోనసీమలో ప్రశాంతతను భగ్నం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. అంతర్వేది చర్చిపై రాళ్లు రువ్విన ఘటనలో అరెస్టు అయిన వారికి బెయిల్‌ కూడా మంజూరు అయిందని స్పష్టం చేశారు. అయితే పట్టణం లోని ఆర్డీవో కార్యాలయం ఉన్న నల్లవంతెన-ఎర్రవంతెన మధ్యనున్న ఎన్టీఆర్‌ మార్గ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


పట్టణంలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోను పికెట్‌లు ఏర్పాటుచేసి పెట్రోలింగ్‌ చేపట్టారు. ఎక్కడికక్కడే బీజేపీ నాయకులను ముందస్తుగా గృహనిర్భందం చేస్తున్నారు. పట్టణంలో బీజేపీ నేతలు నల్లా పవన్‌కుమార్‌, మోకా వెంకట సుబ్బారావుతో సహా పలువురు కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు గృహనిర్భం దంలో ఉంచారు. కోనసీమవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలను గృహనిర్భందంలో ఉంచడంతోపాటు ఎక్కడికక్కడే పికెట్‌లను ఏర్పాటుచేశారు. అయితే తొలుత బీజేపీ, జనసేన పార్టీలు చలో అమలాపురంనకు పిలుపునిచ్చినప్పటికీ ప్రస్తుతం జనసేన నాయకులు ఎక్కడికక్కడ స్తబ్ధతగా ఉండడం, పార్టీ ఆదేశాలు కూడా లేకపోవడంతో పోలీసులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. 




Updated Date - 2020-09-18T17:00:27+05:30 IST