చమురు వడ్డనలు చాలించండి

ABN , First Publish Date - 2021-10-26T09:33:01+05:30 IST

పెట్రోలు, డీజిలు ధరలు అక్టోబర్ 23, 2021నాటికి రికార్డు స్థాయిలో పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర లీటరుకు రూ.111.55కు డీజిల్ ధర రూ.104.70కి పెరిగింది. 2010లో లీటరు పెట్రోల్ ధర రూ.52, డీజిల్ ధర రూ.38. వీటి ధరలు పెరగడం...

చమురు వడ్డనలు చాలించండి

పెట్రోలు, డీజిలు ధరలు అక్టోబర్ 23, 2021నాటికి రికార్డు స్థాయిలో పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర లీటరుకు రూ.111.55కు డీజిల్ ధర రూ.104.70కి పెరిగింది. 2010లో లీటరు పెట్రోల్ ధర రూ.52, డీజిల్ ధర రూ.38. వీటి ధరలు పెరగడం దాదాపు రోజువారీ కార్యక్రమం అయిపోయింది. ఇలా ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల కారణంగా, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాల వల్ల పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయన్నది కేంద్రం వాదన. వాస్తవానికి పెట్రో ధరల పెరుగుదలకు ఇవి పాక్షికంగా మాత్రమే కారణమవుతాయి. అసలు కారణాలు, నిజాలు మరేవో ఉన్నాయి. వాటిని విశ్లేషించి చూపడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగు, విశ్లేషణల సెల్ (PPAC) నుంచి, పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాల నుంచి సేకరించిన గణాంకాలనే ఈ వ్యాసంలో పేర్కొంటు న్నాను. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చేనాటికి లీటర్ పెట్రోలుపై కేంద్ర సుంకాలు రూ.9.48 కాగా, లీటరు డీజిల్‌పై రూ.3.56గా ఉండేవి. ఆ సుంకాలలో ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్డు సెస్సులు కలిపి ఉన్నాయి. కేంద్రం 2014లో ఈ సుంకాలను లీటరు పెట్రోలుపై రూ.10.43, డీజిల్‌పై రూ.4.52ల వరకు పెంచింది. 2015లో వాటిని సవరించి లీటరు పెట్రోలుపై రూ.9.13, లీటరు డీజిల్‌పై రూ.6.66 అదనంగా సుంకం విధించింది.


పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర పన్నులలో తదుపరి పెద్ద పెరుగుదల 2020లో జరిగింది. జూన్ 2014లో 109 అమెరికన్ డాలర్లు ఉన్న ముడి చమురు ధరలు 2020 మార్చిలో బ్యారెల్‌కు 33.36 డాలర్లకు, మే 2020లో 30.61 డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలివిగా, పౌరులకు అర్థం కాని విధంగా సెస్‌లు, సర్‌ఛార్జీలను రికార్డు స్థాయిలో పెంచింది. 


పెట్రోలు, డీజిలుపై 2020 మార్చిలో కేంద్రం లీటరుకు రెండు రూపాయల మేరకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనితోపాటు లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ కూడా పెంచింది. 2020 మే నెలలో రెండిటిపై రోడ్డు సెస్సును లీటరుకు రూ.8 చొప్పున పెంచింది. పెట్రోలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని మరో రెండు రూపాయలు, డీజిల్‌పై రూ.5 పెంచింది. 2021–-22 బడ్జెట్‌లో  కేంద్ర వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు (AIDC) పేరిట కొత్త సెస్సును పెట్రోలుపై లీటరుకు రూ.2.5, డీజిల్‌పై రూ.4 వడ్డించింది. 


ఈ విధంగా, మార్చి 14, 2020 నుంచి సెస్సులు, సర్‌ఛార్జీలను పెట్రోలు, డీజిల్‌పై వరుసగా రూ.14.50, రూ.19లు పెంచారు. ప్రస్తుతం, వీటితో సహా మొత్తం ఎక్సైజ్ సుంకాలు లీటరు పెట్రోలుపై రూ.32.90లు కాగా డీజిల్‌పై రూ.31.80 బాదుతోంది. ఇందులో ప్రాథమిక ఎక్సైజ్ సుంకం పెట్రోలుపై రూ.1.4 కాగా డీజిలుపై రూ.1.8 మాత్రమే. ఇది చాలా తక్కువ. ఫైనాన్స్ కమిషను సూచించిన పంపిణీ విధానం ప్రకారం రాష్ట్రాలతో ప్రాథమిక ఎక్సైజు సుంకాన్ని మాత్రమే పంచుకోవడం జరుగుతుంది. కేంద్రం 2014 నుంచి 2020 మధ్య కాలంలో ఎక్సైజు సుంకాలను పెట్రోల్‌పై 216 శాతానికి పైగా, డీజిల్‌పై 604 శాతానికి పైగా పెంచడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 


ఎక్సైజ్ సుంకాలతో పాటు, దిగుమతి చేసుకున్న ముడిచమురుపై కేంద్రం కస్టమ్స్ సుంకాలను విధిస్తోంది. మన దేశం ముడిచమురు అవసరాలలో దాదాపు 89 శాతం మేరకు దిగుమతి చేసుకుంటోంది. 2014–15లో దిగుమతి చేసుకున్న ముడిచమురుపై కస్టమ్స్ సుంకం మెట్రిక్ టన్నుకు రూ.50 కాగా, ఇప్పుడు మరో రూపాయి పెరిగింది.


2020 మార్చి, మే నెలల్లో ఎక్సైజ్ సుంకాల పెరుగుదల చాలా ఎక్కువగా జరిగింది. 2020 మార్చి నాటికి అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి కేంద్రానికి మంచి అవకాశం వచ్చింది. కానీ దానికి భిన్నంగా విపరీతంగా సుంకాలను పెంచింది. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం చమురుపై సుంకాలను తగ్గించాల్సిన అవసరం ఉందనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... 


i) ఇప్పుడు భారత్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 83 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నది. మే 2020లో ఉన్న 31.61 డాలర్లతో పోలిస్తే ఇది 171 శాతం కంటే ఎక్కువ.


ii) కేంద్రానికి పెట్రోలియం రంగం (కస్టమ్స్ అండ్ ఎక్సైజ్) నుంచి 2014–15లో రూ.1,72,065 కోట్ల ఆదాయం రాగా, అది 2020–21లో రూ.4,55,069 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 165 శాతం. 2020–21 సంవత్సరంలో సుంకాలను బాగా పెంచడంతో పెట్రోలియం ఆదాయం రూ.1,20,754 కోట్లు పెరిగింది.


iii) దేశంలో పెట్రోలు, డీజిల్‌ వినియోగం ఇప్పుడు కొవిడ్‌ మహమ్మారికి ముందున్న స్థాయికి చేరుకుంటున్నది. కొవిడ్ నియంత్రణ వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. మార్కెట్‌ ఆశాజనకంగా ఉంది. పెట్రోలు, డీజిల్‌ వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల కేంద్ర ఆదాయం కూడా పెరుగుతుంది.


పన్నుల వసూలులో కేంద్రం ఎల్‌పిజి(వంటగ్యాస్)ని కూడా విడిచిపెట్టలేదు. 2013–14లో ఎల్‌పిజిపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు లేవు. కానీ ఇప్పుడు గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌పై 5 శాతం కౌంటర్‌వైలింగ్ కస్టమ్స్ డ్యూటీ, అయిదు శాతం గూడ్స్ సర్వీసు టాక్స్ విధిస్తున్నారు. దాంతో గృహ వినియోగదారులపై 10 శాతం భారం పడుతున్నది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాటు ఎల్‌పీజీ ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు 14.2కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.952. పార్లమెంటులో అనేక ప్రశ్నలకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర పెట్రోలియం మంత్రి 14.2కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ ధర మార్చి 1, 2014న రూ.410.50 ఉన్నదని వివరించారు. అంటే ప్రస్తుత ధర దాదాపు 132 శాతం అధికం. ఇది దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్‌పై పన్నులతో పాటు సబ్సిడీ సిలిండర్‌లపై కూడ పన్ను తగ్గింపు గురించి కూడ తగిన నిర్ణయం తీసుకోవాలి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆదాయం గణనీయంగా పెరిగింది. అది బడ్జెట్ అంచనాలను మించిపోయే అవకాశం సైతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో (ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు) కేంద్రం మొత్తం ఆదాయం రూ.7,93,493 కోట్లు కాగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.3,70,642 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 18.3 శాతం ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో ఆగస్టు వరకు అవి 44.4 శాతానికి పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, ప్రధానంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు సుంకాల పెంపు ద్వారా ఎంతో ఆదాయాన్ని గడించింది. కనుక ఇప్పుడు అంతర్జాతీయ మార్కెటులో ముడి చమురు ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్రం పెట్రో సుంకాలను తగ్గించి వినియోగదారులకు సాంత్వన కలిగించాల్సిన సమయం వచ్చింది.


టి.హరీశ్‌రావు

(రాష్ట్ర ఆర్థిక మంత్రి)

Updated Date - 2021-10-26T09:33:01+05:30 IST