చాణక్య నీతి: ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే.. ఎటువంటి పరిస్థితిలోనైనా విజయం మీదే.. అవేమిటో తప్పక తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-10-20T12:22:01+05:30 IST

ఆచార్య చాణక్య గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త..

చాణక్య నీతి: ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే.. ఎటువంటి పరిస్థితిలోనైనా విజయం మీదే.. అవేమిటో తప్పక తెలుసుకోండి!

ఆచార్య చాణక్య గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త, విద్యావేత్త. చాణక్య తన నీతి శాస్త్రంలో.. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. చాణక్య తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనాసరే తమ జీవితాన్ని సరళంగా, తేలికగా మార్చుకోగలుగుతారు. అందుకే చాణక్య అందించిన నీతి సూత్రాలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ, వీటిని జీవితంలో అమలుచేస్తే, సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలో ఆచార్య చాణక్య తెలియజేశారు. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ప్రతికూల పరిస్థితులలోనూ విజయం సాధిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తులు ఎంతో అంకితభావంతో పనిచేస్తూ, తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని వివరించారు. ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాల ప్రకారం మనిషి ఏమిచేస్తే విజయం సాధిస్తాడో తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


పరాజయం పాలయినవారి సలహా: విజయం సాధించాలనుకుంటున్న వ్యక్తి.. జీవితంలో పరాజయం పాలయిన వ్యక్తి నుంచి కూడా సలహా తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. అపజయాలను ఎదుర్కొన్నవారు తమ తప్పులను, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను ఇతరులకు చెబుతారు. వీటిని స్వీకరించి, సరైనమార్గం ఏర్పరుచుకోవడం ద్వారా ఎవరైనా విజయాన్ని అందుకోవచ్చని చాణక్య చెబుతారు. 

విజయం సాధించినవారి సలహా: విజయం సాధించడానికి.. ఓడిపోయిన వ్యక్తి నుండి సలహాలు తీసుకోవడంతో పాటు, విజయవంతమైన వ్యక్తి నుంచి కూడా సలహాలను కూడా తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. విజయం సాధించిన వ్యక్తి తన అనుభవంతో ఇతరులకు ప్రేరణ కల్పిస్తాడని, అన్నింటా విజయం సాధించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాడని ఆచార్య చాణక్య చెబుతారు. 

స్వీయ అవగాహన: లక్ష్యాన్ని సాధించాలనుకున్నవారికి స్వీయ అవగాహన అత్యవసరమని చాణక్య చెబుతారు. మనస్సులో పరిపరివిధాల ఆలోచించిన తర్వాత  సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయం సాధిస్తారని ఆచార్య చెబుతారు. స్వీయ అవగాహన కలిగిన వ్యక్తి..  ఇతరులు ఇచ్చే సలహాలు సరైనవా? కాదా అనేది సులభంగా గ్రహించగలడని చాణక్య వెల్లడించారు. 

Updated Date - 2021-10-20T12:22:01+05:30 IST