చాణ‌క్య నీతి: ఎటువంటి స‌మ‌స్య‌కైనా చిటికెలో పరిష్కారం.. అయితే మీరు ఈ ల‌క్ష‌ణాలు అల‌వ‌ర‌చుకోవాలి!

ABN , First Publish Date - 2021-11-01T11:54:52+05:30 IST

విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపాలో..

చాణ‌క్య నీతి: ఎటువంటి స‌మ‌స్య‌కైనా చిటికెలో పరిష్కారం.. అయితే మీరు ఈ ల‌క్ష‌ణాలు అల‌వ‌ర‌చుకోవాలి!

విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని ఎలా గడపాలో ఆచార్య చాణక్య త‌న చాణ‌క్య‌నీతిలో సూచించారు. అలాగే అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలను కూడా తెలియ‌జేశారు. చాణక్య నీతి ప్రకారం ఎవ‌రికైనా స‌రే ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాని నుంచి బయటపడే మార్గం త‌ప్ప‌క ఉంటుంది. అయితే ఇందుకోసం ఆ వ్య‌క్తి కొన్ని మార్గాల‌ను అనుస‌రించాలి. ఈ నీతి సూత్రాల‌ను అల‌వ‌ర్చుకోవ‌డం ద్వారా జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను తిప్పికొడుతూ, ఎప్పటికీ కలత‌లు లేని జీవితం గ‌డ‌ప‌వ‌చ్చ‌ని ఆచార్య చాణ‌క్య సూచిస్తున్నారు.


ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అయితే చేసే ప్రతి పని ముందు.. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను.. దాని ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ ప‌నిలో నేను నేను విజయం సాధిస్తానో లేదో అనేది మీరే గుర్తెర‌గాలి.  మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు పొంది, వాటితో సంతృప్తి చెందితేనే మీరు చేయాల‌నుకుంటున్న ప‌నిని చేప‌ట్టండి. ఈ విధానాన్ని అనుస‌రించ‌డం ద్వారా మీరు అనేక ఇబ్బందులు, వైఫల్యాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

విజయ సాధ‌న‌కు, ఇబ్బందుల నివార‌ణ‌కు.. ముందుగా మీ శ‌క్తిసామర్థ్యాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. మీ సామర్థ్యాన్ని అంచనా వేయడం ద్వారా త‌గిన ప‌నిని చేప‌ట్ట‌గ‌లుగుతారు. త‌ద్వారా మీ పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి  అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఈ విధానం ప‌నిలో విజ‌యానికి త‌గిన ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న చేసుకునేందుకు మార్గం ఏర్ప‌రుస్తుంది.


సహనంతో పాటు స‌వ్యంగా ఆలోచించ‌డం.. అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. జీవితంలో త‌ట్టుకోలేనంత‌ పెద్ద‌ స‌మ‌స్యలు ఎదురైన‌పుడు బ్యాలెన్సింగ్‌గా ఆలోచిస్తూ, ఓపికగా వ్యవహరిస్తే, స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం సులభంగా దొరుకుతుంది. స‌మ‌స్య‌లు ఎదురైనపుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉండటమ‌నేది చాలా ముఖ్యం. 

వ్యామోహం, దురాశ అనేవి అనేక సమస్యలకు మూలకార‌ణం. మ‌నిషి దురాశను అధిగమించగలిగితే, అతను ఏదైనా సాధించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఎంత‌పెద్ద స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించుకోగ‌లుగుతాడు. సంతోషకరమైన జీవితం గ‌డ‌పాల‌నుకుంటే మ‌నిషి దురాశకు దూరంగా ఉండటం అవసరం.

మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా, దాని నుంచి బయటపడాలని మ‌న‌సులో గ‌ట్టిగా అనుకోండి.  మీపై మీకున్న నమ్మకాన్ని ఎప్ప‌టికీ కోల్పోకండి. ఇటువంటి సానుకూల ఆలోచన.. మీకు ఎదుర‌య్యే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం మార్గాన్ని చూపుతుంది. స‌మ‌స్య‌ల నుంచి మిమ్మ‌ల్ని బ‌య‌ట‌ప‌డ‌వేస్తుంది.

Updated Date - 2021-11-01T11:54:52+05:30 IST