నేటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం

ABN , First Publish Date - 2021-11-27T06:34:05+05:30 IST

జిల్లాలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు.

నేటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం, నవంబరు26(ఆంద్రజ్యోతి): జిల్లాలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పని ఉంటే తప్పా... బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకుసూచించారు. శనివారం జిల్లావ్యాప్తంగా వర్షం ప్రారంభమవుతుందన్నారు. 28న అనంతపురం రూరల్‌ మండలంలో 92.21 మి.మీ, బెలుగుప్ప మండలంలో 88.89 మి.మీ, గుమ్మఘట్టలో 66.02, కళ్యాణదుర్గంలో 88.89, కూడేరులో 80.35, నార్పలలో 69.28, రాయదుర్గంలో 67.13 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఇతర మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, 104 కాల్‌సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండిపోయాయన్నారు. ఆ నీరు నదుల్లోకి భారీగా చేరుతోందన్నారు. మరోసారి జిల్లాలో భారీఎత్తున వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో నదీ తీరప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లరాదన్నారు. నదీ పరీవాహాక ప్రాంతాల్లో ఉండే ప్రజలు నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తపడాలన్నారు. వర్షాలు కురిసి భారీగా నీరు పారుతున్న సమయంలో నదులు, వాగులు, వంకలు దాటరాదన్నారు. వర్షం పడిన సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లకిందకు ఎవరూ వెళ్లొద్దని ఆమె ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-11-27T06:34:05+05:30 IST