'వరూధిని' C/O. 'స్వర్ణా ప్యాలెస్'

ABN , First Publish Date - 2021-07-26T06:11:39+05:30 IST

ఎన్నో ఆశలు... తొలిసారి కథానాయికగా అవకాశం వచ్చిందన్న హుషారు... ఉత్సాహంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. కానీ షూటింగ్‌ మొదలైన మరుక్షణమే ఆ ఆనందం ఆవిరైంది. సెట్‌లో కొందరు సహనటుల వెక్కిరింపులు...

'వరూధిని' C/O. 'స్వర్ణా ప్యాలెస్'

ఎన్నో ఆశలు... తొలిసారి కథానాయికగా అవకాశం వచ్చిందన్న హుషారు... ఉత్సాహంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. కానీ షూటింగ్‌ మొదలైన మరుక్షణమే ఆ ఆనందం ఆవిరైంది. సెట్‌లో కొందరు సహనటుల వెక్కిరింపులు. మేని చాయపై చులకన  మాటలు. వద్దు వెనక్కి వెళ్లిపోదామనుకుంది. కానీ అవమాన భారం కంటే లక్ష్యం గొప్పదని సర్దిచెప్పుకొంది. చివరకు గెలిచింది... నటిగానే కాదు... గేలి చేసిన వారి మనసులు కూడా. ఆమే చందన సేగు... ఉరఫ్‌ ‘వరూధిని’. ‘నవ్య’తో ఆమె పంచుకున్న అనుభవాలివి... 


నేను ఎప్పుడూ అనుకోలేదు... నటి కావాలని. అమ్మ సరస్వతీ గుప్తా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. చిన్నప్పటి నుంచి ఆమెతో కలిసి స్టూడియోలకు వెళ్లేదాన్ని. తరువాత కొన్నేళ్లు అదే నా జీవితం అయిపోయింది. యాక్సిడెంట్‌ కావడంతో అమ్మ డబ్బింగ్‌ మానేసింది. నేను మాత్రం కొనసాగించాను. పదో తరగతిలో ఉండగా అనుకొంటా... మొదటిసారి సినిమాకి డబ్బింగ్‌ చెప్పాను. 2008-12 మధ్య దాదాపు 45 సినిమాల్లో హీరోయిన్లకు గాత్ర దానం చేశాను. అసలు నా కెరీర్‌ అంతా ఒకదానికి ఒకటి ముడిపడుతూ సాగింది. 


గాయని కావాలనుకుని... 

అమ్మ దగ్గర చిన్నప్పుడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. తరువాత వెస్ట్రన్‌ మ్యూజిక్‌ సాధన చేశా. మంచి గాయని కావాలనుకునేదాన్ని. పాటలు బాగా పాడుతున్నానని డబ్బింగ్‌ చెప్పమన్నారు. అక్కడ ఎవరో... ‘చూడ్డానికి బాగుంటావు... యాక్టింగ్‌ చేయవచ్చు కదా’ అన్నారు. అప్పటి వరకు నా ఊహల్లో లేని ఆ ఆలోచన మనసులో నాటుకుపోయింది. ఒకరోజు ఓ టీవీ చానల్‌ వారు ‘యాంకరింగ్‌ చేస్తావా’ అని అడిగారు. అలా తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను.   


చిన్న పాత్రలతో... 

యాంకర్‌గా బిజీగా ఉన్నా. అప్పుడు కన్నడ సీరియల్‌ కోసం అడిగారు. చిన్న పాత్ర. కాదనలేదు. ఆ తరువాత రెండు సీరియల్స్‌లో అలాంటి పాత్రలే వచ్చాయి. ఇంటర్‌లో బ్రేక్‌ తీసుకున్నా. తరువాత ‘నేను బేవర్సీ గొత్తా’ షార్ట్‌ ఫిలిమ్‌లో చేశాను. దానికి మంచి ఆదరణ లభించింది. దక్షిణ భారత ఉత్తమ నటిగా నాకు ప్రతిష్టాత్మక ‘రోలింగ్‌ ఫ్రేమ్స్‌’ అవార్డు దక్కింది. 


వోకల్‌ కార్డ్‌ దెబ్బతిని...  

షార్ట్‌ ఫిలిమ్‌ తరువాతే ‘జీ తెలుగు’ నుంచి పిలుపు వచ్చింది. ‘వరూధిని’ సీరియల్‌ కోసం. మొట్టమొదటిసారి కథానాయిక పాత్ర వరించింది. 2013లో ప్రారంభమై 2016 వరకు నడిచింది. 850కి పైగా ఎపిసోడ్స్‌ చేసుంటాను. ‘వరూధిని’గా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాను. ఆ సీరియల్‌లో నటిస్తున్నప్పుడే నా వోకల్‌ కార్డ్‌ దెబ్బతింది. డాక్టర్‌ దగ్గరికి వెళితే... వోకల్‌ కార్డ్‌ పాడైందన్నారు. సర్జరీ చేస్తే బరువు పెరుగుతారన్నారు. అందుకని సర్జరీ వద్దనన్నాను. అప్పటి నుంచి పాటలు పాడడం, డబ్బింగ్‌ చెప్పడం ఆపేశాను. 


నన్ను మార్చిన పాత్ర... 

‘వరూధిని’ నన్ను పూర్తిగా మార్చేసింది. అన్నేళ్లు ఒకే పాత్ర చేసి చేసి అందులో లీనమైపోయేదాన్ని. మా ఇంట్లో నేను ఒక్కతే సంతానం కావడంతో గారాబంగా పెరిగాను. వేషం, తీరు... మగరాయుడిలానే. అలాంటిది ‘వరూధిని’తో నడవడి, ఆలోచనా విధానం, మాట్లాడే విధానం... అన్నీ మారిపోయాయి. దీని తరువాత తెలుగులో ‘దేవయాని, పవిత్ర బంధం’ సీరియల్స్‌లో నటించాను. మధ్యలో తమిళ్‌లో రెండు సీరియల్స్‌ చేశాను. తెలుగులో దాదాపు మూడేళ్ల విరామం తరువాత ప్రస్తుతం ‘స్వర్ణా ప్యాలెస్‌’ చేస్తున్నా. ఈ సోమవారం ‘జీ తెలుగు’లో  సీరియల్‌ ప్రారంభమవుతుంది. అందులో నాది ‘కుందన’ పాత్ర. తను దృఢచిత్తంగల అమ్మాయి. స్వాభిమానం ఎక్కువ. ఇది స్వర్ణకారుడు, బంగారు వ్యాపారి కుటుంబాల మధ్య ‘స్వర్ణా ప్యాలె్‌స’లో జరిగే కథ. 




నిద్ర లేని రాత్రులెన్నో... 

కెరీర్‌ను ఇప్పుడు ఎంతో ఆస్వాదిస్తున్నాను. అయితే దీని వెనక ఎన్నో అవహేళనలు, అవమానాలు ఉన్నాయి. మాది బెంగళూరు. సీరియల్‌ కోసం హైదరాబాద్‌ షూటింగ్‌కు వచ్చాను. కథానాయికగా అవకాశం రావడం కూడా నాకు అదే మొదటిసారి. చాలా సంతోషంగా సెట్‌లోకి వెళ్లాను. కానీ అక్కడ కొంతమంది సహనటులు, ఇతరులు నన్ను చులకనగా చూసేవారు. నా చాయ గురించి కామెంట్లు చేసేవారు.  పరిశ్రమకు వచ్చినప్పుడు నేను చిన్న పిల్లని. వారి మాటలు నన్ను చాలా బాధించేవి.  నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను. 


జీవిత ధ్యేయం అదే...

నటిని కాకపోయుంటే గాయని అయ్యేదాన్ని. అనుకోకుండా ఇటు వచ్చాను. కానీ ఒక్కసారి వచ్చాక ప్రేమించడం మొదలుపెట్టాను. సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక. కన్నడలో ఒక సినిమా చేశాను. అది ఇంకా విడుదల కాలేదు. నా జీవిత ధ్యేయం పారిశ్రామికవేత్త కావాలని... నాదైన ఒక బ్రాండ్‌ ఉండాలని. అది క్లోతింగ్‌ కావచ్చు... లేదంటే కాస్మొటిక్స్‌ కావచ్చు. ఇప్పటివరకు నేను అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేశాను. ఒకటి రెండేళ్లలో ఇది కూడా నెరవేర్చుకొంటానన్న నమ్మకం ఉంది. ఇక పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. ‘నేను కోరుకున్నది ఇలాంటివాడినే’ అనిపించేవాడు నాకు ఇంకా తారసపడలేదు. పెద్ద కోరికలేమీ లేవు కానీ... విధేయుడై ఉండాలి. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతే... అతడికి డబ్బు ఉన్నా లేకపోయినా పట్టింపు లేదు.


భయపడి పారిపోకూడదని... 

కాలేజీకి వెళ్లి ఆస్వాదించే వయసులో ఇవన్నీ ఎందుకనిపించింది. వదిలేసి వెళ్లిపోదామనుకున్నా. కానీ భయపడి పారిపోవడం కాదు... నిలబడి నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. ఇది జీవితం. ఏదీ శాశ్వతం కాదు కదా! ఏడాది గడిచింది. నటన మెరుగుపరుచుకున్నా. భాషపై పట్టు తెచ్చుకున్నా. నటిగా ప్రేక్షక ఆదరాభిమానాలు సంపాదించుకున్నా. చివరకు ఎవరైతే నన్ను అవమానించారో, ఎవరివల్లయితే నేను ఏడ్చానో వాళ్లే వచ్చి అభినందించారు. నా పట్ల తప్పుగా ప్రవర్తించామని తెలుసుకున్నారు. మన విజయానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి! 

- హనుమా




Updated Date - 2021-07-26T06:11:39+05:30 IST