చేనేతలు.. చాంద్‌బాలీలు

ABN , First Publish Date - 2022-01-12T05:30:00+05:30 IST

సంక్రాంతి వచ్చేస్తోంది. ఊళ్లన్నీ పండగ శోభను సంతరించుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే చుట్టాలతో ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి...

చేనేతలు.. చాంద్‌బాలీలు

సంక్రాంతి వచ్చేస్తోంది. ఊళ్లన్నీ పండగ శోభను సంతరించుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే చుట్టాలతో ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాంటి ఆనందకరమైన సమయంలో ఏం కట్టుకోవాలి? ఎలాంటి నగలు పెట్టుకోవాలనే ప్రశ్నలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు- శ్యామ్‌సింగరాయ్‌ వంటి సినిమాలకు స్టైలి్‌స్టగా వ్యవహరించిన కోన నీరజ. ఆమె ఇచ్చే సలహాలేమిటో చూద్దాం..


మామూలు సమయాల్లో మామూలు రంగుల బట్టలు వేసుకున్నా సరిపోతుంది. కానీ పండగల్లో మాత్రం ముదురు రంగు బట్టలు వేసుకోండి. దీని వల్ల మన చుట్టూ ఉన్న పండగ వాతావరణానికి మరింత శోభను చేకూర్చినవారవుతారు. అందరూ అలాంటి ముదురు రంగు బట్టలే వేసుకుంటారు కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు. 

సాధారణంగా చాలా మంది పండగలకు పట్టుబట్టలను ఎంపిక చేసుకుంటారు. కానీ సంక్రాంతి వంటి పండుగలకు చేనేత బట్టలే ఎక్కువగా బావుంటాయి. గొబ్బెమ్మలు, రంగురంగుల రంగవల్లుల మధ్య చేనేత వస్త్రాలు హుందాగా కనిపించటమే కాకుండా వాటిని ధరించిన వ్యక్తులకు హుందాతనాన్ని కూడా ఇస్తాయి. 

పండగ వాతావరణం వచ్చినట్లు తెలియాలంటే- చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, చాంద్‌బాలీలు పెట్టుకోవాల్సిందే! ఈ మధ్యకాలంలో రకరకాల ఆకృతుల్లో బుట్టలు, చాంద్‌బాలీలు పెట్టుకుంటున్నారు. ఒక అందమైన చీర కట్టుకొని.. చాంద్‌బాలీలు పెట్టుకుంటే - వేరే ఏ ఇతర నగలు వేసుకోకపోయినా పర్వాలేదు. 

సంక్రాంతి మూడు రోజుల పండుగ కాబట్టి రోజూ చీరలే కట్టుకోవాల్సిన అవసరం లేదు. లెహంగాలు..కుర్తీలు.. ఇతర డ్రస్సులు కూడా వేసుకోవచ్చు. వీటితో పాటుగా స్కార్ఫ్‌లను వాడటం తాజా ఫ్యాషన్‌. స్కార్ఫ్‌లు, దుపట్టాలను వేరే దుస్తులపైకి కూడా వాడుకోవచ్చు కాబట్టి బట్టలు కొనే సమయంలోనే వీటిని కొనుగోలు చేసేయండి. 

పైన చెప్పిన సలహాలన్నీ అందంగా కనిపించటానికి. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే- దుస్తులు వేసుకున్నప్పుడు మనం ఎంత సౌఖ్యంగా ఉన్నామనేది ముఖ్యం. ఆ తర్వాతే మిగిలివన్నీ. ఎంత అందమైన డ్రెస్‌లైనా- ఽధరించినప్పుడు సౌకర్యంగా లేకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. 



Updated Date - 2022-01-12T05:30:00+05:30 IST