సీట్లు ఆప్‌కు ఓట్లు కాంగ్రెస్‌కు.. 1,3 నంబర్లు రివర్స్

ABN , First Publish Date - 2021-12-27T21:46:57+05:30 IST

పంజాబ్ పార్టీ అయిన అకాలీదళ్ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 14 స్థానాలు కైవసం చేసుకుంది. గత పర్యాయం 20 సీట్లు గెలుచుకున్న బీజేపీని వెనక్కి నెట్టేసింది. బీజేపీ ఈసారి 12 సీట్లకు పడిపోయింది..

సీట్లు ఆప్‌కు ఓట్లు కాంగ్రెస్‌కు.. 1,3 నంబర్లు రివర్స్

చండీగఢ్: చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా తలబడ్డాయి. అయితే ఒకరు అత్యధిక సీట్లు గెలుచుకుంటే మరొకరు అత్యధిక ఓట్లు గెలుచుకున్నారు. ఒకరికి సీట్లలో మూడవ స్థానం వస్తే, మరొకరికి ఓట్లలో మూడో స్థానంలో నిలిచారు. 35 స్థానాలున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు పోటీలో నిలిచాయి. అయితే పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే కొనసాగింది.


పంజాబ్ పార్టీ అయిన అకాలీదళ్ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 14 స్థానాలు కైవసం చేసుకుంది. గత పర్యాయం 20 సీట్లు గెలుచుకున్న బీజేపీని వెనక్కి నెట్టేసింది. బీజేపీ ఈసారి 12 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ మేయర్‌గా ఉన్న రవికాంత్ శర్మవాస్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా చెబుతున్నారు.


ఇదిలా ఉంటే, సీట్లలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతంలో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 29.87 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా 29.25 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక సీట్లలో మొదటి స్థానంలో ఉన్న ఆప్ 27.13 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీట్లలో, ఓట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - 2021-12-27T21:46:57+05:30 IST