చండీగఢ్ ట్రయిలర్, పంజాబ్ సినిమా...

ABN , First Publish Date - 2021-12-27T23:36:25+05:30 IST

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఘనవిజయం ట్రయిలర్‌ మాత్రమే అని ..

చండీగఢ్ ట్రయిలర్, పంజాబ్ సినిమా...

న్యూఢిల్లీ: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఘనవిజయం ట్రయిలర్‌ మాత్రమే అని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు. ఈ విజయం ట్రయిలర్  అయితే.. సినిమా పంజాబ్ అని అభివర్ణించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించబోయే విజయానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అద్దంపడుతున్నాయని చెప్పారు. ఆప్ లాంటి నిజాయితీ కలిగిన చిన్న పార్టీని, అందులోనూ తొలిసారి పోటీలోకి దిగిన పార్టీని విశ్వసించి, ఆదరించిన అందరికీ ఆప్, అరవింద్ కేజ్రీవాల్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.


బీజేపీ, కాంగ్రెస్‌పై రాఘవ్ చద్దా విమర్శలు గుప్పిస్తూ, చండీగఢ్ కార్పొరేషన్‌ను 25 ఏళ్లుగా ఈ పార్టీలు ఏలాయని చెప్పారు. బీజేపీ 13 ఏళ్లు, తక్కిన 12 ఏళ్లు కాంగ్రెస్ ఏలినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సంప్రదాయ పార్టీలకు పదేపదే అవకాశాలు ఇచ్చిన ప్రజలు విసిగిపోయారని, నిజాయితీతో పనిచేసే సరైన ప్రత్యామ్నాయం కోసం వారు ఎదురు చూస్తున్నారని అన్నారు. సైకిలు, స్కూటర్ల మీద తిరిగే సాధారణ కౌన్సిలర్లు ఎలా పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లు, ఆస్తులు కూడబెట్టుకున్నారో ప్రజలు స్వయంగా చూశారని అన్నారు. చండీగఢ్ ఫలితాలు ఇప్పుడు చూశామని, ఇక పంజాబ్ ఫలితం బాకీ ఉందని, ఇప్పుడు ప్రజలు చూపించిన ఆదరణే పంజాబ్ ఎన్నికల్లో కూడా కనిపించబోతోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చద్దా చెప్పారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 14 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 12, కాంగ్రెస్ 8, శిరోమణి అకాలీదళ్ ఒక సీటు గెలుచుకున్నాయి.

Updated Date - 2021-12-27T23:36:25+05:30 IST