కరోనా కట్టడిలో భాగస్వాములవుదాం

ABN , First Publish Date - 2020-04-08T09:13:00+05:30 IST

కరోనా కట్టడికి జరుగుతున్న కృషిలో అందరం భాగస్వాములవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

కరోనా కట్టడిలో భాగస్వాములవుదాం

వైద్య సిబ్బందికి ధన్యవాదాలు : బాబు

జగన్‌ను చూసి ప్రజలు నవ్వుతున్నారు

ప్రజోపయోగ నిర్ణయాలేవీ? 

కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?

ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం


అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి జరుగుతున్న కృషిలో అందరం భాగస్వాములవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నిపుణుల సూచనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిద్దామని, స్వీయ నియంత్రణ, భౌతిక దూరంతో కరోనాని తరమికొడదామని మంగళవారం ట్వీట్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కరోనా విపత్తులో వైద్యసేవలు చేస్తున్న వారిని ఆయన కొనియాడారు. కాగా కరోనా వైరస్‌ నివారణలో సీఎం జగన్‌ అవగాహన లేమిని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని  అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. విపత్తు సాయంగా కేంద్రం ఇచ్చే సొమ్ముని వైసీపీ నాయకులు పంచి, రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకమని విమర్శించారు. పబ్జీ గేమ్‌ ఆడుకునే ముఖ్యమంత్రికి కరోనాని ఎలా అరికట్టాలో ఏమి తెలుస్తుందని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు.


రాజధాని భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టినా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు జగన్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరోనా నివారణపై ముందు చూపు లేని సీఎం జగన్‌.. మంచి పాలనానుభవం కలిగిన చంద్రబాబు సూచనలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకోకపోవడం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర విమర్శించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన గిరిజన రైతులను, కూలీలను ఆదుకోవాలని కిడారి శ్రావణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోకుండా నగదు పంపిణీ పేరుతో కరోనానూ రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోందని అఖిలప్రియ ౖ విమర్శలు గుప్పించారు.  రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి, జగన్‌ రాజకీయం చేయడంలో బిజీగా ఉన్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. 

Updated Date - 2020-04-08T09:13:00+05:30 IST