Abn logo
May 7 2021 @ 04:17AM

రంగులపాటి ఖర్చు కూడా వ్యాక్సిన్లపై చేయలేరా?

టీడీపీ సర్వసభ్య సమావేశం మండిపాటు

టీకాల కోసం రేపు ప్లకార్డుల ప్రదర్శనలు

అసమర్థ పాలన వల్లే ప్రజలకు కష్టాలు: చంద్రబాబు


అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్‌ ట్యాంకులు, కరెంటు స్తంభాలకు వైసీపీ రంగులు వేయడానికి... తీయడానికి రూ.3,000 కోట్లు తగలేశారు. ఆ మాత్రం ఖర్చు కూడా వ్యాక్సిన్లపై చేయలేరా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.45 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకొంటారా? ప్రజల ప్రాణాలు కాపాడే పద్ధతి ఇదేనా’’ అని తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మండిపడింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం గురువారం ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే నిమిత్తం ఈ నెల 8న, శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలు నిలపాలని కోరుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరి ఇంటి వద్ద వారు ఉండి ఈ ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలని, కలెక్టర్లు, ఎమ్మార్వోలకు కూడా వినతిపత్రాలు పంపాలని నిశ్చయించారు. ‘‘ఏ సమయానికి ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఆక్సిజన్‌ దొరక్క ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మరణాలు సంభవిస్తున్నాయి. చికిత్సలకు పడకలు దొరకడం లేదు. వైద్యానికి లక్షలు ధారపోయాల్సి వస్తోంది. ఏ రోజు ఎవరికి వైరస్‌ వ్యాపిస్తుందో తెలియక ప్రజలు భీతిల్లిపోతుంటే ముఖ్యమంత్రి మాత్రం అవినీతికి ఉపయోగపడే నాడు నేడు పనులపై సమీక్షలు, కంట్రాక్టర్లకు ఏ పనులు అప్పగించాలన్నదానిపై సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో రాజమండ్రిలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా విన్నారు. రోజుకు 20 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 25 శాతానికి పెరిగింది. అయినా సీఎం కరోనాపై సమీక్షలు జరపడం లేదు. లాక్‌డౌన్‌ పెట్టి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలి. వ్యాక్సిన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాలి. వీటిపై ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి చేయాలి’’ అని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 


సలహాలు ఇస్తే బూతులు తిడుతున్నారు

రాష్ట్రప్రభుత్వానికి చంద్రబాబు సలహాలు ఇస్తే వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న 108, 104 వాహనాలు అందుబాటులో  లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే జేబులు గుల్లవుతున్నాయని మాజీ మంత్రి అయ్యన్న చెప్పారు. కరోనా పరీక్షలు చేయించుకొన్న వారికి ఫలితం రావడానికి 4 రోజులు పడుతోందని, ఈలోపు కు టుంబంలో అందరికీ ఈ వ్యాధి వ్యాపిస్తోందని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కడప జిల్లా నేత గోవర్థన్‌ రెడ్డి, అనంతపురం జిల్లా నేత కందికుంట ప్రసాద్‌ భేటీలో మాట్లాడారు.

Advertisement