రాష్ట్రంలో రౌడీ రాజ్యం!

ABN , First Publish Date - 2021-08-01T08:08:50+05:30 IST

‘‘రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా? గూండాలు, నేరస్థుల రాజ్యం ఉందా? మీరు బెదిరిస్తే మేం భయపడిపోవాలా? మీరు దాడులు చేస్తుంటే మేం పారిపోతామనుకుంటున్నారా? ఇలాంటి ముఖ్యమంత్రులను టీడీపీ చాలామందిని

రాష్ట్రంలో రౌడీ రాజ్యం!

మీరు బెదిరిస్తే మేం బెదిరిపోవాలా?

దేవినేనిపై దాడిచేసి.. రివర్స్‌ కేసు పెడతారా? 

సీఎం జగన్‌, డీజీపీలపై చంద్రబాబు ఆగ్రహం

మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు పరామర్శ


విజయవాడ, జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా? గూండాలు, నేరస్థుల రాజ్యం ఉందా? మీరు బెదిరిస్తే మేం భయపడిపోవాలా? మీరు దాడులు చేస్తుంటే మేం పారిపోతామనుకుంటున్నారా? ఇలాంటి ముఖ్యమంత్రులను టీడీపీ చాలామందిని చూసింది. ఇలాంటి అరాచక శక్తులను ఎంతోమందిని అణిచివేసింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్‌ సర్కారుపై విరుచుకుడ్డారు. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమాను జైలుకు పంపిన నేపథ్యంలో శనివారం ఉదయం చంద్రబాబు గొల్లపూడికి వచ్చి ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..  ‘‘టీడీపీ ఎవరికీ భయపడదు. ఇప్పుడు అరాచకాలు చేస్తే రేపు ఎక్కడికి పోతారు? నా మంచితనాన్ని అసమర్థతగా, చేతగానితనంగా తీసుకోవడం సరికాదు’’ అని నిప్పులు చెరిగారు. 


మీరు పట్టించుకోలేదు కాబట్టే

‘‘కొండపల్లి అటవీ ప్రాంతం నుంచి విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కాబట్టే దేవినేని ఉమా నేతృత్వంలో మైలవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులంతా ముందుగా పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాతే కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టుకు వెళ్లారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే ఉమ ఎస్సీలపై దాడి చేసినట్టు, హత్యాప్రయత్నం చేసినట్లు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పాలన చేతకాకపోతే పడుకోండి

‘‘రాష్ట్రంలో బాక్సైట్‌ కుంభకోణం జరిగిందని చెన్నై ఎన్జీటీ ఆధారాలతో సహా నిరూపించింది. ఆరోజు అడ్డంగా బొంకిన అధికారులు ఇప్పుడేమయ్యారు? ఉమాపై వైసీపీ దుండగులు దాడిచేసిన తర్వాత 8-9 గంటలు కారులోనే ఉన్నారు. నేను కూడా రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడాను. వేరొకరితో మాట్లాడే అవకాశమే లేని వ్యక్తి ఎక్కడ కారు దిగారు? ఎవరిపై హత్యాయత్నం చేశారు? ఎస్సీలతో ఎక్కడ మాట్లాడారు? ప్రభుత్వ చేతగాని తనాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలపైన, రాజకీయ నాయకులపైనా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. పరిపాలన చేతగాకపోతే ఇంట్లో పడుకోండి’’ 


ఆ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఎవరబ్బ సొత్తు?

‘‘కొండపల్లి ఫారెస్ట్‌ ఎవరబ్బ సొత్తూ కాదు. అది ప్రజల ఆస్తి. ప్రజాధనాన్ని లూటీ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని బాబు హెచ్చరించారు. ఉమాను రాజమండ్రి జైలుకు తరలించిన తర్వాత ఆ జైలు సూపరింటెండెంట్‌ను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. కొండపల్లి అక్రమ మైనింగ్‌పై గవర్నర్‌ స్పందించాలని, సీనియర్‌ అధికారులతో ఒక కమిటీని నియమించి చర్యలు తీసుకోవాలని కోరారు.


అలజడి సృష్టికి వైసీపీ వ్యూహం!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని టీడీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు గొల్లపూడికి వస్తున్న సందర్భంగా వైసీపీ నేతలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, దీనికిగాను వైసీపీ దళిత నేతలను రంగంలోకి దింపి.. చంద్రబాబుకు వినతిపత్రం అందజేసే నెపంతో అలజడి సృష్టించేలా పన్నాగం పన్నారని తెలిపారు.  


చంద్రబాబును ఒక్కసారైన చూడాలని!

గుంటూరు, జూలై 31(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలేనికి చెందిన కట్టా పెదవేమారెడ్డి (97) టీడీపీ సానుభూతి పరుడు. చంద్రబాబును ఒక్కసారైనా చూడాలని కొన్నేళ్లుగా తపిస్తున్నారు. ఆయన కోరికను కుటుంబసభ్యులు, సన్నిహితుల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు శనివారం తన నివాసానికి పిలిపించి ఆయనను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-08-01T08:08:50+05:30 IST