జగన్‌ వైరస్‌కు మందు లేదు!

ABN , First Publish Date - 2021-04-14T09:06:34+05:30 IST

‘కరోనా వైరస్‌ ఎంత భయంకరమైనదో చూశారు కదా! దానికన్నా ప్రమాదకరమైనది జగన్‌ వైరస్‌. కరోనాకు వ్యాక్సినయినా ఉంది.

జగన్‌ వైరస్‌కు మందు లేదు!

కరోనా కన్నా ప్రమాదకరం

ఇది సమాజాన్నే తినేస్తుంది

తిరుపతిలో ఓడించి కట్టడి చేయాలి.. వైసీపీకి ఓటేస్తే భవిష్యత్‌ భయంకరమే

రేషన్‌, పింఛన్‌ కట్‌ చేస్తామనే బెదిరింపులకు బెదరొద్దు

వాళ్ల తాత, తండ్రి సొత్తు కాదు.. రాష్ట్రాన్ని కాపాడే చాన్సు దేవుడు మీకిచ్చాడు

పనిచేసే పనబాకకే ఓటేయండి..తిరుపతి ఓటర్లకు చంద్రబాబు పిలుపు


పింఛన్లు, రేషన్‌ కట్‌ చేస్తామనే బెదిరింపులకు బెదరొద్దు. కట్‌ చేయడానికి అది వారి తండ్రి, తాత సొత్తు కాదు.. మనం పన్నులు కడితే వచ్చిన సంపద. ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. జగన్‌నే ప్రజలు పీకి పడేసే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన గుర్తుంచుకోవాలి.


సభలో ప్రజలపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు నాకు నోటీసు పంపారు. నేను వెళ్లి రాళ్లు విసిరిన వారిని చూపించాలంట! 

టీడీపీ అధినేత చంద్రబాబు


నెల్లూరు/గూడూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా వైరస్‌ ఎంత భయంకరమైనదో చూశారు కదా! దానికన్నా ప్రమాదకరమైనది జగన్‌ వైరస్‌. కరోనాకు వ్యాక్సినయినా ఉంది. జగన్‌ వైర్‌సకు అది కూడా లేదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. నోటుకో, మొహమాటానికో, బెరించారనో, భయపెట్టారనో వైసీపీకి ఓటేస్తే భవిష్యత్‌ భయంకరంగా తయారవుతుందని హెచ్చరించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్‌షో అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడే అవకాశం భగవంతుడు తిరుపతి పార్లమెంట్‌ ప్రజలకు ఇచ్చాడని.. బుధవారం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి అని.. అంబేడ్కర్‌ రాజ్యాంగం కావాలో.. జగన్‌ రాజ్యాంగం కావాలో తేల్చుకోవాలని సూచించారు. ‘ఎవరికీ భయపడొద్దు. నిర్భయంగా ఓటు వేయండి. పనిచేసే పనబాక లక్ష్మికి ఓటేసి గెలిపించండి’ అని పిలుపిచ్చారు. జగన్‌ వైర్‌సకు మందే లేదని.. ఇది మొత్తం సమాజాన్ని తినేస్తుందని.. దానిని కట్టడి చేయాలంటే తిరుపతిలో ఆ పార్టీని చిత్తుగా ఓడించడమే మార్గమని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్నీ చూస్తోందని.. ప్రజలను ఇబ్బంది పెడితే తాట తీస్తుందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..


విపక్షాలను ప్రచారం చేసుకోనివ్వరు..

ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వరు.. ప్రతిపక్షాలను ప్రచారం చేసుకోనివ్వరు.. సోమవారం తిరుపతిలో నా మీటింగ్‌ మీద రాళ్ల దాడి చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాను. జడ్‌ప్లస్‌ భద్రత కలిగిన వ్యక్తిని. నా సభపైనే రాళ్లు రువ్వితే ఇక ఇతరుల పరిస్థితేంటి? వీళ్లు మనుషులో,  మాఫియా గ్యాంగులో ప్రజలు ఆలోచించాలి. రాళ్ల దాడిపై ఫిర్యాదు చేస్తే నాకు నోటీసిచ్చారు. నేను వెళ్లి రాళ్లు రువ్విన వారిని వెతికి పట్టుకోవాలా.. పోలీసుల పనితీరు ఇదేనా..? దీనిని ప్రజాస్వామ్యం అంటారా..?


కరెంటు తీగను పట్టుకోవద్దని ఆ రోజే చెప్పా

ఒక్క చాన్స్‌ అంటూ జగన్‌ ఆ రోజు మీ ముందుకొచ్చాడు. ఒక్క చాన్స్‌ అని కరెంటు తీగను పట్టుకోవద్దని నేను ఆ రోజే చెప్పాను. నా మీద వ్యతిరేకత లేకున్నా ఆయనకో అవకాశం ఇద్దామని ఓట్లు వేశారు. ఇప్పుడేం జరిగింది? ఈ రెండేళ్ల కాలంలో ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా..? మద్యం ధరల పేరుతో బలహీన మనస్కులైన పేద, మద్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నారు. కేంద్రం పెట్రోల్‌ ధరలు పెంచితే ఈయన పోటీ పడి మరింత పెంచుతున్నాడు. 




ఆయనది హోల్‌సేల్‌.. ఈయనది రిటైల్‌

రాష్ట్ర ప్రజలకు చెందిన వనరులన్నింటిని జగన్‌రెడ్డి హోల్‌సేల్‌గా దోపిడీ చేస్తుంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే రిటైల్‌ దోపిడీ చేస్తున్నాడు. చికెన్‌ షాపు పెట్టుకోవాలన్నా ఈయనకు చిల్లర సమర్పించుకోవాల్సిందే. ఈయన ఏం చేసినా వాళ్ల నాయకుడు అడగడు. అడిగితే మీ శ్యాండ్‌, లిక్కర్‌ కథేంటి సార్‌ అని ప్రశ్నిస్తే ఎక్కడ మొహం పెట్టుకోవాలో తెలియక మౌనంగా ఉన్నాడు. తెలుగుదేశం హయాంలో ఇలాంటివి ఎప్పుడైనా చూశారా? 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో పైసా ఆశించలేదు. నిప్పులాగా బతికాను. నా మీద ఆరు లక్షల కోట్ల అవినీతి కేసు పెట్టారు. కొండను తొవ్వితే  చివరికి ఎలుక తోక బొచ్చు కూడా దొరకలేదు. నా మీద నోరుపారేసుకుంటారు. ఒక మాఫియా లీడర్‌, పేకాట ఆడించి బతికే ఇంకొకాయన నన్ను విమర్శిస్తారు. కళ్లు నెత్తికెక్కాయి.


అవి కిందకు దిగాలంటే ఈ ఎన్నికలే సరైనా మార్గం. రాష్ట్ర భవిష్యత్‌ను తిరగరాసే ఎన్నికలకు ఇక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.. దీనిని సద్వినియోగం చేసుకోండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఓటు వేయకుండా ఆగిపోతే రాష్ట్ర ప్రజలకు నష్టం చేసినవారు అవుతారు. వలంటీర్లకు భయపడి వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదు. మీరెవరికీ భయపడాల్సిన పనిలేదు. మీరు ఎవరికి ఓటు వేశారో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియదు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ పక్కాగా నిఘా పెట్టింది.

Updated Date - 2021-04-14T09:06:34+05:30 IST