నవరత్నాలు కాదు.. టీడీపీ ఎన్నో రత్నాలు ఇచ్చింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-04T19:40:25+05:30 IST

దేశానికి అన్నంపెట్టిన ఏపీలోనే వరి వేయొద్దని చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.

నవరత్నాలు కాదు.. టీడీపీ ఎన్నో రత్నాలు ఇచ్చింది: చంద్రబాబు

గుంటూరు : దేశానికి అన్నంపెట్టిన ఏపీలోనే వరి వేయొద్దని చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. నవరత్నాలు కాదు.. టీడీపీ ఎన్నో రత్నాలు ఇచ్చిందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్‌ మీడియం అన్నారని.. నాడు- నేడు అన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులను కల్పించారన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ ఇచ్చారు. ప్రజలు, మీడియా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా దాడులకు దిగుతున్నారు. పన్నుల పేరుతో ప్రజలపై తీవ్రమైన భారం మోపారు. చెత్తమీద కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్‌రెడ్డిది. అన్న క్యాంటిన్లను ఎందుకు మూసివేశారు? రెండేళ్లలో కరెంట్‌ ఛార్జీలను ఆరు సార్లు పెంచారు. రాష్ట్రంలో మద్యంపై పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. మద్యపాన నిషేధ హామీ ఏమైంది? ఒక్కరోజే రూ.124 కోట్ల మద్యం అమ్మకాలా? ఇసుక, ఓటీఎస్‌ పేరుతో దోపిడీ చేస్తున్నారు. డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితికి తెచ్చారు’’ అని పేర్కొన్నారు.




Updated Date - 2022-01-04T19:40:25+05:30 IST