వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-01T21:22:55+05:30 IST

ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ: చంద్రబాబు

హైదరాబాద్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందని, ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. గంజాయిపై ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.  డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా టీడీపీ పోరాడుతుందని, టీడీపీ అధికారంలోకి వస్తే.. యథావిధిగా ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టుపెట్టారని విమర్శించారు. ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వకపోవడం దుర్మార్గమన్నారు. నీరు-చెట్టు, నరేగా బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-01T21:22:55+05:30 IST