Chandrababu అత్యవసర భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , First Publish Date - 2021-07-19T23:52:54+05:30 IST

తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.

Chandrababu అత్యవసర భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై  చర్చించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  సీఎం జగన్‌రెడ్డి వైఖరీతో నదీజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌తో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.  సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్‌లో వ్యవసాయరంగ అభివృద్ధికి ఇది గొడ్డలిపెట్టని చెప్పారు. జగన్‌రెడ్డి కేసులకు భయపడి నదీజలాలపై రాష్ట్ర హక్కులు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 


జాబ్‌ క్యాలెండర్‌పై పోరాటం

జాబ్‌ క్యాలెండర్‌ను ఉపసంహరించుకుని తిరిగి జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసేంత వరకు ఆందోళనలు కొనసాగించాలని సమావేశంలో తీర్మానించారు. యువనేతల అక్రమ అరెస్టులను టీడీపీ నాయకులు ఖండించారు.  ధాన్యం బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కేంద్రానికి లేఖలు రాస్తూ జగన్‌రెడ్డి కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయకపోవడంతో రహదారులు అధ్వానంగా మారాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణ పనులను  వెంటనే చేపట్టాలని తెలుగుదేశం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


ఫైబర్ నెట్‌పై తప్పుడు ఆరోపణలు

రూ.149కే ఇంటర్నెట్‌, టీవీ, ఫోన్‌ సౌకర్యం అందించేందుకు టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ఫైబర్‌నెట్‌ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయన్నారు. వైసీపీ వచ్చాక నెలకు రూ. 300కు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్‌పై తప్పుడు ఆరోపణలతో తూట్లు పొడుస్తున్నారన్నారు. ఐకాన్‌ బ్రిడ్జి ప్లాట్‌ఫామ్‌ను ధ్వంసం చేయడాన్ని నేతలు  తప్పుపట్టారు. ప్రభుత్వ వైఖరీతోనే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నేతలు తప్పుబట్టారు. 


సోషల్‌ మీడియాలో పోస్టింగులపై..

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో మహిళపై అత్యాచారం జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికీ నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అత్యాచార నిందితులను పట్టుకునేంతవరకు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితులు, బీసీలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, గృహ నిర్భంధాలను టీడీపీ నాయకులు సమావేశంలో ఖండించారు. సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెడితే పోలీసులతో అధికార పార్టీ నేతలు బెదిరిస్తే తీవ్రస్థాయిలో నిరసనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.  నిధులు, విధులు ఉన్న ఛైర్మన్‌ పోస్టులను బలహీనవర్గాలకు, మహిళలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 11% డీఏ ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 7 డీఏలను పెండింగ్‌లో పెట్టారని చెప్పారు.  వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఉద్యోగులకు అండగా తెలుగుదేశం ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2021-07-19T23:52:54+05:30 IST