అమర్ రాజా భూములు వెనక్కి తీసుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-01T02:56:26+05:30 IST

అమర్ రాజా భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం..

అమర్ రాజా భూములు వెనక్కి తీసుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం

గుంటూరు: అమర్ రాజా భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యెం భూముల కేటాయింపు రద్దునూ ఆయన ఖండించారు. అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు వెనక్కి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై అక్కసుతోనే అమర్ రాజా భూములు వెనక్కి తీసుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు చెల్లించే పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్రనాయుడు అని తెలిపారు. పారిశ్రామికంగా ఏపీని ప్రపంచపటంలో పెట్టాలనే లక్ష్యంతో విదేశాల నుంచి వచ్చి అమర్ రాజా యూనిట్లు స్థాపించారని చంద్రబాబు పేర్కొన్నారు. 


అభివృద్ధి చేస్తున్నా..

అమర్ రాజా కంపెనీలలో 16 వేల మందికి ఉపాధి కల్పించారని చంద్రబాబు తెలిపారు. 20వేల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ బంగారు పాళ్యెం భూముల్లో ఇప్పటికే యూనిట్‌ను నెలకొల్పారు. 5 వేల మందికి ఉపాధి కల్పించారు. సగం భూములు అభివృద్ధి చేసి మరో సగం అభివృద్దికి రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో 250 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేయడం కేవలం కక్ష సాధింపుతోనే. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టనివాళ్లను వదిలేశారు. సగం అభివృద్ది చేసి, మిగతా సగం అభివృద్ధికి సిద్దమైన వాళ్లను వేధిస్తున్నారు.’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇలా అయితే ఎలా? 

పాలకులకు పగ-ప్రతీకారాలు ఉండరాదని చంద్రబాబు సూచించారు. ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారని ఆయన చెప్పారు. ‘‘ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలతో ఆంధ్రప్రదేశ్ గత ఏడాదిగా దేశవిదేశాల్లో అప్రదిష్ట పాలైంది. జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల ఎంబసీలు హెచ్చరికలు పంపాయి. దావోస్‌లో కూడా వీటన్నింటిపై చర్చ జరిగింది. గవర్నమెంట్ టెర్రరిజం ఉందని, బీహార్ ఆఫ్ సౌత్‌గా ఏపీ మారిందని పారిశ్రామిక వేత్తల వ్యాఖ్యలకు ఈ విధమైన చర్యలు మరింత ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఇకనైనా ఇటువంటి వేధింపులకు, కక్ష సాధింపునకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాలి.’’ చంద్రబాబు సూచించారు. 

Updated Date - 2020-07-01T02:56:26+05:30 IST