వాళ్లను పట్టుకోకుండా నాపై కేసులా: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-09T00:57:20+05:30 IST

శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్‌పై ఈ సందర్భంగా చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైన్‌ షాపులన్నీ జగన్మోహన్‌రెడ్డివేనని..

వాళ్లను పట్టుకోకుండా నాపై కేసులా: చంద్రబాబు

చిత్తూరు: టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్‌పై ఈ సందర్భంగా చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైన్‌ షాపులన్నీ జగన్మోహన్‌రెడ్డివేనని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ చేసింది గోరంత.. దోచింది కొండంతని విమర్శించారు. ‘‘లారీ ఇసుక పది వేలు.. ట్రాక్టర్‌ ఇసుక 6 వేలు చేశారు. ఇసుక దొంగతనంగా చెన్నై, బెంగళూరుకు వెళ్తోంది. టీడీపీ హయాంలో నీతివంతమైన పాలన అందించాం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది. వంటగ్యాస్‌పై ఎవరికీ సబ్సిడీ రావడం లేదు. పేదలపై జగన్‌కు ఎందుకు అంత కడుపు మంట?. జగన్‌ మాట్లాడితే ఇంగ్లీష్‌ అంటాడు.. ఇవాళ పిల్లలు చదువుకునే పరిస్థితులు ఉన్నాయా?. జగన్‌ వల్ల ఇంజినీరింగ్‌ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది.’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 


చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘మా హయాంలో నాలుగేళ్లపాటు కరెంట్‌ ఛార్జీలు పెంచలేదు. మున్సిపాలిటీల్లో కొత్త చట్టం తెచ్చి ప్రజలపై భారం వేస్తారంట. అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారో చెప్పండి. తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. పవిత్రత కాపాడితేనే తిరుపతికి భవిష్యత్‌ ఉంటుంది. రాముడి తల తీసేసిన వాళ్లని పట్టుకోకుండా నాపై కేసులా?. ఎందుకు మీకు ఇంత కండ కావరం?. మత సామరస్యాన్ని కాపాడింది టీడీపీనే. ఎప్పుడైనా మసీదులు, చర్చిలపై దాడులు జరిగాయా?. కుప్పంలో దేవుడిని తీసుకొచ్చి బయటపడేశారు. అడిగినందుకు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. ఇది ఉన్మాద, మాఫియా పాలన. నన్ను 10 గంటలు ఎయిర్‌పోర్టులో నిలబెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుని ఉంటే జగన్‌ ఒక్క అడుగు బయటపెట్టేవాడా?. ’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-09T00:57:20+05:30 IST