Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇలాంటి పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రజలు తిరగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై సోమవారం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలా?.. ఇలాంటి పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.  దొంగ ఓటర్లను పట్టించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.


గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. దొంగ ఓటర్లను పట్టుకున్నవారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తారా? అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలు, అరాచకాలే కనిపిస్తున్నాయన్నారు. అధికార పార్టీకి అడ్డూ.. అదుపు లేకుండా పోయిందన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే ధీమాలో వైసీపీ ఉందని, హద్దులు మీరితే పరిస్థితులు చేయి దాటిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. త్వరలో వైసీపీకి ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు. ఈ దుర్మార్గపు రాజకీయాలను అడ్డుకుని తీరుతామన్నారు. ఏపీ నుంచి కూరగాయల పేరుతో బాంబేకి గంజాయి తరలిస్తున్నారని, గంజాయిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వరకు పోరాడుతామన్నారు. అసలు రాష్ట్రంలో ఎస్ఈసీ ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ అక్రమాలపై ఆధారాలిచ్చినా స్పందించడం లేదని, ఫిర్యాదులను పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement