ఇకనైనా నేరస్వభావం మార్చుకోండి

ABN , First Publish Date - 2020-06-01T08:35:55+05:30 IST

వైసీపీ ఏడాది పాలనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు.

ఇకనైనా నేరస్వభావం మార్చుకోండి

ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ధ్వజం


అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఏడాది పాలనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. ‘గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చాకయినా.. వారి గత చరిత్ర ప్రభావం పాలనపై పడకుండా చూసుకుంటారని వైసీపీ నేతల నుంచి అందరూ ఆశించారు. కానీ ఆ నేరస్వభావం మార్చుకోకుండా కక్షలు సాధించడానికి, అక్రమార్జనల కోసం వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి వైసీపీ పాలకులు వచ్చారు’ అని ట్విటర్‌లో విమర్శించారు. మీడియాపై ఉక్కుపాదం, రాజధానిని మూడు ముక్కలు చేయడం, శాసనమండలిని రద్దు చేయడం, ఎన్నికల కమిషనర్‌ని తొలగించడం.. ఇవన్నీ తమ మాటే చెల్లుబాటు కావాలనే గూండా మనస్తత్వానికి నిదర్శనాలని చంద్రబాబు అభివర్ణించారు. ఏడాది పాలనలోనే ఇంత గూండాయిజాన్ని ఇంత వరకూ చూడలేదని పేర్కొన్నారు.


స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులను నామినేషన్‌ కూడా వేయనివ్వకుండా దౌర్జన్యాలు చేసి, ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే కూల్చేయాలనుకున్నారని ఆరోపించారు. కోర్టులు దాదాపు 65 కేసుల్లో వీళ్ల చర్యలను కట్టడి చేయకపోయి ఉంటే రాష్ట్రం ఏమై ఉండేదా? అని భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల భాష చూస్తుంటే.. వీధి రౌడీలు వీళ్ల కన్నా నయమనిపించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇకనైనా వైసీపీ పాలకులు నేరపూరిత స్వభావాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రజలు మిమ్మల్ని గౌరవప్రదమైన స్థానాల్లో కూర్చోబెట్టారని, ఆ మర్యాదను నిలబెట్టుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

Updated Date - 2020-06-01T08:35:55+05:30 IST