Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ప్రభుత్వం ఫెయిల్..పరిపాలించే అర్హత లేదు: చంద్రబాబు

నెల్లూరు: జిల్లాలోని వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. తాజాగా గంగపట్నం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటున్నారు. చెరువులు తెగి ఆక్వా కల్చర్ సముద్రం పాలైందని చంద్రబాబు ఎదుట ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ఇరుక్కొని బయటకు తీసుకురామంటే వైసీపీ వాళ్లు డీజల్ తీసుకురమన్నారని ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. గంగపట్నం గ్రామానికి బ్రాందీ షాపులు తప్ప అభివృద్ధి లేదంటూ చంద్రబాబు ఎదుట మహిళలు వాపోయారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నవంబర్ నెలంతా వర్షాలు ఉన్నాయని, రిజర్వాయర్లు, డ్యామ్‌లు, చెరువులు నిండిపోయాయని, ఈ ప్రభుత్వానికి వాటర్ మ్యానేజ్మెంట్ తెలియదని మండిపడ్డారు. పక్కజిల్లాల్లో 60 మంది చనిపోయారని, పెద్ద హుదూద్ తుఫాన్‌లో 20 మంది మాత్రమే చనిపోయారని గుర్తు చేశారు. ఇది కేవలం మానవ తప్పిదమేనని, ఇసుక దోపిడీకి పాల్పడి జేబులు నింపుకోవడానికి కరకట్టలు తొవ్వేశారని విమర్శించారు. వరద నివారణలో, వరద సహాయ చర్యలు చేపట్టడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. హుదూద్ తుఫాన్‌ను దీటుగా ఎదుర్కొని ఇతర ప్రాంతాల్లో వండించి ఆకలి తీర్చామన్నారు. గతంలో తుఫాన్ల సమయంలో 4 వేల రూపాయలు నుంచి 14 వేల వరకు ఇచ్చామని చెప్పారు.  రూ.2కే కూరగాయలు అందించామని తెలిపారు. ఇళ్లల్లో చేరిన బురదలో పిల్లలు ఆడుకుంటుంటే చూసి కడుపు తరుక్కుపోయిందని, ఇలాంటి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదన్నారు. ఆక్వా కల్చర్‌పై ప్రభుత్వం రివైవ్ చేయాలని సూచించారు. ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే రెండేళ్ల పాటు కరెంటు సబ్సిడీ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎం అగ్గిపెట్టెలు కట్టి 30 లక్షల ఇల్లు కడుతున్నట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పట్టాలకు రూ. 10 వేలు డిమాండ్ చేస్తున్నారని, ఎవరూ కట్టవద్దవని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా పట్టా ఇస్తామని బాధితులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 


Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement