చంద్రబాబుకు బ్రహ్మరథం!

ABN , First Publish Date - 2021-03-09T06:18:47+05:30 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 11గంటలకు ఆటోనగర్‌లోని డాక్టర్‌ బీర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చంద్రబాబుకు బ్రహ్మరథం!

టీడీపీ అధినేత పర్యటన విజయవంతం

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు 

పార్టీ శ్రేణుల్లో జోష్‌

 

 గుంటూరు, సంగడిగుంట, తూర్పు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 11గంటలకు ఆటోనగర్‌లోని డాక్టర్‌ బీర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మణిపురం ఫ్లైవోవర్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌, యాదవ బజార్‌, పొన్నూరు రోడ్డు, లాంచస్టర్‌ రోడ్డు, కన్యకాపరమేశ్వరి ఆలయం, పట్నంబజార్‌, కృష్ణమహల్‌ సెంటర్‌, నాజ్‌సెంటర్‌, డొంకరోడ్డు, పొట్టి శ్రీరాములనగర్‌ రోడ్డు వరకు ఉత్సాహంగా సాగింది. లక్ష్మీపురం మీదుగా బృందావన్‌గార్డెన్స్‌లో చేరుకుని ప్రసంగం ముగించే సరికి 4.50 గంటలైంది. అక్కడి నుంచి కుందులు రోడ్డు వరకు రోడ్‌ షో నిర్వహించి కచ్చితంగా 5గంటలు ప్రచారాన్ని నిబంధనల మేరకు ముగించారు.


 ఎదురేగిన మైనారిటీలు

చంద్రబాబునాయుడుకు గుంటూరు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రధానంగా తూర్పు నియోజకవర్గంలో మైనారిటీలు పెద్దఎత్తున ఎదురేగి చంద్రబాబుకు స్వాగతం పలికారు. పశ్చిమ నియోజకవర్గం పసుపు వర్ణంగా మారింది. పొట్ట్టి శ్రీరాముల నగర్‌ నుంచి లాడ్జిసెంటర్‌ వరకు చంద్రబాబు వాహనం వెంట పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు కదం తొక్కారు. బృందావన్‌ గార్డెన్స్‌ చేరుకునే మార్గంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. గార్డెన్స్‌ కూడలిలో మహిళలు తరలివచ్చి చంద్రబాబు ప్రసంగానికి ఆసాంతం విన్నారు.  

 

రెచ్చగొట్టిన వైసీపీ కార్యకర్తలు

చంద్రబాబు పర్యటణలో ఒక్క పాత గుంటూరులో మాత్రమే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.  7, 8 డివిజన్లలో పర్యటిస్తున్నప్పుడు వైసీపీ కార్యాలయాల మీదగా రోడ్డు షో కొనసాగింది. ఇది గుర్తించిన పోలీసులు ముందుగానే వెళ్లి వైసీపీ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి  చంద్రబాబు కాన్వాయికి దారిచ్చారు. కానీ కార్యాలయం లోపల ఉన్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను హేళన చేసే విధంగా పదే పదే సైగలు చేశారు. దీన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు సైతం అదేస్థాయిలో బదులిచ్చారు. పరిస్థితులు గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు కాన్వాయిని ముందుకు పంపిచారు.  

Updated Date - 2021-03-09T06:18:47+05:30 IST