Abn logo
Nov 24 2021 @ 13:11PM

సొంత జిల్లా అయినా CM Jagan రాలేదు.. మీరైనా వచ్చారు చంద్రబాబు సార్..!

కడప : వరదతో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల రూపాయలు ఇవ్వా లని, ఇళ్లను పునర్‌ నిర్మించాలని, ఇంటింటికి వెళ్లి సర్వే చేసి నష్టపోయిన నగలు, నగదు, వస్తువులతో పాటు వరదకు కొట్టుకుపోయిన పాడి గేదెలు, పశువులను కొనుగోలు చేసి ఇవ్వాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం రాజంపేట మండలంలోని పులపత్తూరు, మందపల్లె, నందలూరు తదితర వరద ముంపు గ్రామాల్లో పర్యటించారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఉన్నారు. చెయ్యేరు వరద ముంచిన మందపల్లె, పులపత్తూరు గ్రామాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

చలించిన చంద్రన్న..

మా ఊర్లను వరద ముంచి ఐదు రోజులైంది... ఇప్పటికీ కరెంటు లేదు, తాగునీళ్లు లేవు... కనీసం తిండి కూడా ప్రభుత్వం పెట్టలేదు.  దాతలు, సామాన్య జనం మానవత్వంతో పెట్టిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటున్నాం.. వాళ్లు ఇచ్చిన బట్టలతో శరీరాన్ని కప్పుకుంటున్నాం. అయ్యా.. కట్టుబట్టలేక ఐదు రోజులుగా స్నానం కూడా చేయలేదు. కరెంటు లేక కారు చీకట్లో కాలం గడుపుతున్నాం... అంటూ వరద బాధితులు  తమ కష్టాలను కన్నీళ్లతో ఏకరువు పెట్టడంతో చంద్రబాబు చలించిపోయారు. అన్ని విధాల అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి.. అంటూ వారి భుజం తట్టి భరోసా ఇచ్చారు. మృతులకు లక్ష రూపాయలు, బాధిత కుటుంబాలకు రూ.5వేలు సాయం ప్రకటించి మానవత్వం చాటారు.

సీఎం రాలేదు.. మీరైనా వచ్చారు..

సార్‌.. సార్‌... సీఎం జగన్‌ సొంత జిల్లా కడప. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి చెయ్యేరు వరదకు సర్వం కోలోయాం. సీఎం మా ఊరికి వచ్చి మా కష్టం చూడలేదు. హెలికాప్టర్‌లో గాలిలో తిరిగి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నాయకుడిగా మా ఊరికి వచ్చి మా బాధలు చూశారు. బాధలోనైనా సంతోషిస్తున్నాం. మా ఊర్లో ఐదు రోజులుగా ఆడపడుచులు కనీసం స్నానం కూడా చేయలేదు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మీరు మా గురించి మాట్లాడాలి. మీరే మాకు స్ఫూర్తి.. - తోట పావని, మందపల్లె


సర్వం కోల్పోయాం సార్‌..

మా పల్లెకు పాడి, వ్యవసాయం రెండు జీవనాధారం. పొలాలన్నీ ఇసుక మేటలెత్తాయి. పాడి ఆవులు, గేదెలు వరదకు కొట్టుకుపోయాయి. ఎలా బతకాలో దిక్కుతోచడం లేదు. ఇళ్లు కూలిపోయా యి. సర్వం నష్టపోయాం. ప్రభుత్వాన్ని ఒప్పించి మాకు న్యాయం చేయాలి. 19 గ్రామాలకు పూర్తి రక్షణ గోడలు కట్టించాకే అన్నమయ్య ప్రాజెక్టుకు పునర్మించాలి. లేదంటే ఈ ప్రాజెక్టు మాకు వద్దనే వద్దు. - సురేష్‌, వరద బాధితుడు


అర్థరాత్రి వరద వచ్చి ఉంటే...

చంద్రబాబు సార్‌... ఆ రోజు రాత్రి ఐదు మంది మా ఇంట్లో పడుకున్నాం. తెల్లారగానే వరద పెరిగింది. ఆనకట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా వరద ముంచేసింది. మా ఇల్లు కూలిపోయింది. సర్వం కోల్పో యాం. ఉదయం కొట్టుకుపోయిన ఆనకట్ట ఏ అర్థరాత్రి తెగిపోయి ఉంటే వందల మంది గల్లంతయ్యేవాళ్లం.- సందీప్‌, వరద బాధితుడు, మందపల్లె.