బీసీ జనగణన చేపట్టండి

ABN , First Publish Date - 2021-10-20T09:11:19+05:30 IST

బీసీ జనగణనను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం ప్రధానికి ఈ మేరకు లేఖ రాశారు. దేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎక్కువ శాతం ఉన్నారని, జనాభాలో వారి నిష్పత్తికి సమానంగా..

బీసీ జనగణన చేపట్టండి

  • సరైన సమాచారం అందుబాటులో లేదు
  • బీసీలు పేదరికంలోనే కొనసాగుతున్నారు
  • ప్రస్తుత కులాల వివరాలు 90 ఏళ్ల నాటివి
  • బీసీ జనగణనతో పూర్తి సంక్షేమ ఫలాలు
  • టీడీపీ హయాంలో తీర్మానం చేసి పంపాం
  • ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ


అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బీసీ జనగణనను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం ప్రధానికి ఈ మేరకు లేఖ రాశారు. దేశంలో   వెనుకబడిన వర్గాల ప్రజలు ఎక్కువ శాతం ఉన్నారని, జనాభాలో వారి నిష్పత్తికి సమానంగా ప్రయోజనాలు అందక నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ‘‘1953లో ఏర్పాటు చేసిన మొదటి బీసీ కమిషన్‌ అయిన కాలేల్కర్‌ కమిషన్‌, తర్వాత వచ్చిన కమిషన్లు, వివిధ రాష్ట్రాల కమిషన్లు, ప్రభుత్వాలు బీసీ జనగణన చేయాలని సిఫార్సు చేశాయి. దేశంలో కులవివక్ష ఇప్పటికీ ఉందనేది ఒక కఠినమైన వాస్తవం. కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడం వల్ల బీసీల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకాల అమలు సరిగా జరగడం లేదు. దీని వల్ల బీసీలు విస్మరణకు, వివక్షకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కులాల జనాభాపై ప్రస్తుతం ఉన్న సమాచారం 90 ఏళ్ల నాటిది. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు పాత సమాచారంపై ఆధారపడి అసంబద్ధంగా ఉండరాదు. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అర్థం చేసుకోవటానికి, వారికి సమాన అవకాశాలు కల్పించడానికి సరైన ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని 15(4) అధికరణ ప్రకారం బీసీలకు వృత్తిపరమైన కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా అధికరణ 16(4) ప్రకారం బీసీల నిష్పత్తి ప్రకారం వారికి ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని చెబుతోందని పేర్కొన్నారు. ఈ రెండు సందర్భాల్లో వివిధ రంగాల్లో బీసీల ప్రాతినిధ్య నిష్పత్తిని అర్థం చేసుకోవటానికి వారి జనాభాను అంచనా వేయడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కుల జనాభా లెక్కల పాత సమాచారంపై ఆధారపడి, పథకాల రూపకల్పన చేయడం సరైంది కాదని అనేక కమిషన్లు, మేధావులు, విద్యావేత్తలు, ఇతరులు అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు.


అంతేకాకుండా బీసీ జనాభా జాబితాలను కాలానుగుణంగా సవరించాలన్నదే అందరి అభిప్రాయమని తెలిపారు. ‘‘బీసీ జాతీయ కమిషన్‌ చట్టం 1993లోని సెక్షన్‌ 11ను 2018లో రద్దు చేసినప్పటికీ.. పదేళ్ల గడువు ముగిశాక ప్రతి పదేళ్లకు బీసీ జాబితాలను సవరించాలని  చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. అలాగే బీసీ జాబితాలో కొత్త తరగతులను చేర్చే విధంగా సవరణ చేయవచ్చు. టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీలో బీసీ కులగణన కోసం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. బీసీల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నా, వారు పేదరికంలో కొనసాగుతున్నారు. వారి జనాభాపై తగిన సమాచారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల బీసీల సంక్షేమం, అభివృద్ధిని నిర్ధారించడానికి బీసీ కులగణనను దేశ జనగణనలో చేర్చాలని అభ్యర్థిస్తున్నా’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T09:11:19+05:30 IST