Abn logo
Jun 22 2021 @ 02:58AM

సీఎం ఇంటి చేరువలోనే ఘోరమా?

దిశ చట్టం, స్టేషన్లు, యాప్‌లు ఏం చేస్తున్నాయి?

డీజీపీ ఆఫీ్‌సకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఘటన

మీరుండే ప్రాంతాల్లోనే మహిళలకు భద్రత లేదా?

దిశలో పేర్కొన్న ‘24 గంటల్లో న్యాయం’ ఎక్కడ?

డీజీపీకి  చంద్రబాబు లేఖ


‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక శక్తులు, రౌడీ మూకలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దానివల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. గతంలో సీతా నగరం పుష్కర ఘాట్‌ వద్ద పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది శిధిలావస్థలో ఉంది. డ్రగ్స్‌ అమ్మేవారికి, వాడేవారికి అడ్డాగా ఈ ప్రాంతం మారింది. ఫిర్యాదులెన్ని వస్తున్నా దిశ చట్టం పేరిట ఆర్భాటం తప్ప ఏ చర్యలు తీసుకోవడం లేదు’’      

- చంద్రబాబు 


అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి చేరువలోనే కృష్ణానది ఒడ్డున కొన్ని అరాచక శక్తులు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాయి. సంఘటన జరిగిన ప్రదేశం డీజీపీ కార్యాలయానికి, పోలీస్‌ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి కూడా రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మీ ఇళ్లు, మీ కార్యాలయాల సమీపంలోనే మహిళలకు భద్రత లేకపోతే మీరేం చేస్తున్నారు? మీ దిశ చట్టం ఏం చేస్తోంది?’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన ఒక లేఖ రాశారు. శనివారం రాత్రి ఒక యువతి కాబోయే తన భర్తతో కలిసి సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద కొద్దిసేపు సమయం గడపడానికి వెళ్తే, ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేశారని, బ్లేడుతో గొంతు కోస్తామని బెదిరించి యువకుడిని కట్టేసి...యువతిపై అత్యాచారం చేయడంతోపాటు వారి వద్ద ఉన్నవి కూడా దోచుకొని పోయారని ఆ లేఖలో ఆయన వివరించారు. ‘‘దిశ చట్టం గురించి, దిశ పోలీస్‌ స్టేషన్ల గురించి, దిశ మొబైల్‌ వాహనాల గురించి, దిశ యాప్‌ గురించి పెద్ద ఆర్భాటం చేశారు. మహిళలకు భద్రత కల్పించలేనప్పుడు వీటి గురించి ఇంత ఆర్భాటం, హడావుడి ఎందుకు? ఇటువంటి కిరాతక చర్యలు, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టడానికి చిత్తశుద్ధితో పనిచేస్తే...ఇంతకు ముందు ఉన్న చట్టాలు, మౌలిక వసతులు సరిపోతాయి. కాని దిశ పేరుతో ఏదో అద్భుతం జరిగిపోతుందన్నట్లు ప్రభుత్వం ప్రజలకు భ్రమలు కల్పించింది. ఈ సందర్భంలో ప్రజలకు మీరు కొన్ని విషయాలకు సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 


రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? ఒకవేళ అమల్లో ఉంటే, ఆ చట్టం కింద ఇప్పటికి ఎన్నికేసులు నమోదు చేశారు? ఎంతమందిపై చర్యలు తీసుకొన్నారు? ఏ సంఘటన జరిగినా ఈ చట్టం కింద ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకొంటామన్న హామీ ఏమైంది... సీతానగరం సంఘటన జరిగి ఇప్పటికి ఎన్ని గంటలైంది?’’ అని ప్రశ్నించారు. వైసీపీ రంగులకు ప్రచారం కల్పించడం తప్ప దిశ చట్టం సాధించింది ఏమీ కనిపించడంలేదని విమర్శించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక శక్తులు, రౌడీ మూకలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దానివల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. గతంలో సీతా నగరం పుష్కర ఘాట్‌ వద్ద పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది శిధిలావస్ధలో ఉంది. డ్రగ్స్‌ అమ్మేవారికి, వాడేవారికి నిలయంగా ఆ ప్రాంతం మారింది. అసాంఘిక శక్తులు అక్కడ తిష్ట వేస్తున్నాయని ఫిర్యాదులెన్నో వచ్చినా ఏ చర్యలు తీసుకోలేదు. కొత్త చట్టాల పేరుతో హడావుడి కంటే కూడా పెట్రోలింగ్‌, పోలీసింగ్‌ పకడ ్బందీగా చేస్తే ప్రజలకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. పోలీసులు ఇప్పటికైనా వేగంగా కదిలి నిందితులను తక్షణం పట్టుకోవాలి. సీతానగరం సమీపంలో నది ఒడ్డున పోలీస్‌ నిఘా పెంచాలి’’ అని ఆయన తన లేఖలో కోరారు.