హైదరాబాద్‌లో ఉండటానికి కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు

ABN , First Publish Date - 2020-02-07T19:26:26+05:30 IST

‘‘రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించిన తీరుతో సీమాంధ్ర ప్రజలు తీవ్ర అవమానంతో కుంగిపోయారు. అభద్రతాభావంలో..

హైదరాబాద్‌లో ఉండటానికి కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు

ఇంతకుముందులా ప్రజలను రెచ్చగొడితే వదిలిపెట్టను

మేమెవరినీ దోచుకోలేదు.. కేసీఆర్‌ ఇది గుర్తెరగాలి

మంచిరోజులు మొదలయ్యాయ్‌!

నాడు పడిన కష్టం.. నేడు సీమాంధ్ర కోసం పడతా!

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో ముఖ్యమంత్రి చంద్రబాబు


‘‘రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించిన తీరుతో సీమాంధ్ర ప్రజలు తీవ్ర అవమానంతో కుంగిపోయారు. అభద్రతాభావంలో ఉన్నారు. వారి కష్టాన్ని నా కష్టంలా భావిస్తా. ప్రతి ఒక కుటుంబాన్ని నా కుటుంబంలా చూసుకుంటా. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా. ప్రజల కళ్లలో ఆనందం చూడాలి. ఇదే నా ముందున్న చాలెంజ్‌’’ అని ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయానంతరం ఆయన తన మనసులోని భావాలను ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కే కార్యక్రమం ద్వారా వెల్లడించారు. 17-05-2014న ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పని చేసిన మీరు... ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇబ్బందిగా అనిపిస్తోందా?

నేను అలా భావించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాంగ్రెస్‌ పార్టీ రాషా్ట్రన్ని సర్వనాశనం చేసింది. సీమాంధ్ర ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాలి. వారందరి కళ్లలో ఆనందం చూడాలి. ఇదే నా ముందున్న చాలెంజ్‌. సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఇప్పుడు నా బాధ్యత పెరిగింది. మరింతగా కష్టపడాలి.


ఎన్నికల్లో జగన్‌, మీరు హోరాహోరీగా పోరాడారు. ప్రజలు మీకే విజయం కట్టబెట్టడానికి కారణాలను ఎలా విశ్లేషిస్తారు?

తప్పులు చేసేవారు కూడా ప్రజల పక్షానే ఉన్నామని చెప్పుకున్నారు. కానీ, నిజం నిప్పులాంటిది. మేం ఇద్దరం చెప్పిందీ ప్రజలు ఓపిగ్గా విన్నారు. ఆయనను (జగన్‌ను) ఇప్పటికే చాలా రోజులు ప్రజలు భరించారు. ప్రజలు ప్రతీ ఊర్లో అభద్రతా భావంలో ఉన్నారు. మా గెలుపుకోసం ఆలయాలు, చర్చి, మసీదుల్లో ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అదే మమ్ముల్ని కాపాడింది. అంతిమంగా ధర్మం, న్యాయమే గెలుస్తుంది. ఈ 10 ఏళ్లలో జరిగిన దారుణాలను ప్రజలు భరించారు. ఎన్నికల వరకు ఓపికపట్టి... తమ కోపాన్ని ఓటు రూపంలో ప్రదర్శించారు. కాంగ్రెస్‌ను కూడా మట్టి కరిపించారు. ‘ఇష్టానుసారంగా రాషా్ట్రన్ని విభజించారు. సోనియాకు అధికారం ఉంది కదా అని ఇక్కడి ప్రజలను అవమానించారు. మేం దిక్కులేనివారిమా? మాకు ఇంత అవమానమా?’ అని ప్రజలు బాధపడ్డారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ప్రజలు భూస్థాపితం చేశారు.


సీఎంగా ఉన్నప్పుడు మిత్రులు, సన్నిహితులను పట్టించుకోలేదని అపవాదు ఉంది. పనిపేరిట ఉద్యోగ ప్రభుత్వం నడిపారు. ఇప్పుడైనా మారారా?

నేను ఉత్తమ ఫలితాలకోసం పనిచేశాను. సాదాసీదా ప్రజాజీవితం గడిపాను. కానీ, వైఎస్‌ తనను నమ్మిన వారిని ఏం చేశాడో మీకు తెలుసు. చాలా మంది జైలుకు వెళ్లారు. దారినపోయేవాళ్లు కూడా వందల కోట్లు సంపాదించుకున్నారు. గతంలో ఉద్యోగులు నా వల్ల టెన్షన్‌పడ్డారు. ఇకపై ఆ సమస్య రాదు. అందరితో మాట్లాడి కలుపుకొని పనిచేస్తాను. తప్పులు సరిదిద్దుకుంటాను. నా పాలనలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు. ప్రతీ ఒక్కరిని ఆదుకుంటాను. ప్రజల సంపద, ఆదాయం పెంచుతాను. ప్రతీ కుటుంబాన్ని నా కుటుంబంలా చూసుకుంటాను. ప్రతీ ఒక్కరి కష్టం నా కష్టంలా భావిస్తాను.


పెద్ద రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేశారు. మరి ఒక నిర్మాణం అంటూ లేకుండా ఉన్న సీమాంధ్ర కోసం ఎన్ని గంటలు పనిచేస్తారు?

దేవుడు అందరికీ ఒకే సమయం ఇచ్చాడు. ఉన్న సమయంలో ఎంత వీలైతే అంత మేరకు పనిచేస్తాను. హైదరాబాద్‌ను అద్భుతంగా రూపొందించుకునేందుకు ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. నా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. దాని విజువలైజ్‌ చేస్తాను.



ప్రమాణ స్వీకారం ఎప్పుడు? ఎక్కడ?

కొన్ని సాంకేతిక అంశాలను చూడాల్సి ఉంది. జూన్‌2 వతేదీ తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది. నిర్దిష్టంగా ఫలానాచోట అని అనుకోలేదుకానీ, సీమాంధ్రలోనే ఉంటుంది. మంచి ప్రాంతం చూసి రాజధాని ఏర్పాటు చేస్తాం. ఢిల్లీ కంటే ఉత్తమమైన రాజధానిని ఏర్పాటు చేద్దామని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.


మీరు మాత్రమే అభివృద్ధి చేయగలరని జనం ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఏంచేస్తారు? నిజంగా సీమాంధ్రను సింగపూర్‌లా చేయగలరా?

నిజంగా ఇది సంక్షోభ సమయం. దీనిని నేను అభివృద్ధికి అవకాశంగా మలుచుకుంటాను. నా మనసులో స్పష్టమైన ప్రణాళిక ఉంది. సీమాంధ్రను సింగపూర్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తానని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాను. నిజానికి సీమాంధ్రకు అనేక ఆర్థిక వనరులు ఉన్నాయి. దాన్నో విజ్ఞానగనిగా మారుస్తా. వ్యవసాయానికి సాంకేతికతను జోడించి మరింత ప్రోత్సాహం కల్పిస్తాను. విద్య, ఉద్యోగ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను. ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉంటాను. హామీలు నెరవేరుస్తాను. ఇప్పటికే ఉన్న 14 పోర్టులను మరింత అభివృద్ధి చేస్తాం. ఎయిర్‌పోర్టులను బాగుచేస్తాం. అవసరమైతే జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం.

 

రాయల సీమ జిల్లాల్లో రోడ్డు నెట్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేస్తాం. ప్రతీ పల్లెకు బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేస్తాను. వీలైనంత త్వరలో అక్కడే ఉండి అక్కడే కష్టపడతాం. నిర్మాణం చేస్తాం. శ్రమిస్తాం. ముఖ్యమంత్రిగా ఉంటూ న్యూయార్క్‌లో ఫైలు చేతిలో పట్టుకుని తిరిగాను. సింగపూర్‌లో పరిశుభ్రత ఎలా చేస్తున్నారో తెలుసుకునేందుకు రాత్రి రెండు మూడు గంటలకు లేచి రోడ్లవెంట తిరిగాను. ఇదంతా హైదరాబాద్‌కోసం, రాష్ట్ర ప్రజల కోసమే పనిచేశాను. ఇప్పుడు కూడా అదే కష్టం పడతాను.


తొలి సంతకం రుణ మాఫీపైనేనా?

అవును. రుణమాఫీ విధివిధానాలపై చర్చిస్తున్నాను. అన్నీ అందరితో మాట్లాడాకే చేస్తాను. రుణమాఫీపై నరేంద్రమోదీతో కూడా చర్చించాను.


ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతారా?

కేంద్రంలో ప్రభుత్వంలో చేరుతాం. దేశ ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చినందున మాతో పనిలేదని కొందరు అంటున్నారు. కానీ, అది సరికాదు. మేం ఇద్దరం కలిసి సుస్థిర పాలన ఇస్తాం. తెలుగువారికి మంచికాలం మొదలైంది.


బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. దీనిపై ముస్లింలకు మీరు ఏం చెబుతారు?

తెలుగుదేశం సెక్యులర్‌ పార్టీ. ముస్లింల భద్రతకు మేం భరోసా ఇస్తాం. మోదీకూడా ఇదే చెప్పారు. కావాలని కొందరు ముస్లింలను రెచ్చగొట్టి వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారు. మేం ముస్లింలకు అండగా ఉంటాం. కావాలని ఎవరైనా రెచ్చగొట్టడం మంచిదికాదు.


టీడీపీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నది. మీరు సీఎం అయ్యే రాష్ట్రంలో మీకు పార్టీ ఆఫీసు లేదు? ఇల్లు కూడా లేదు?

అందరి ఇళ్లు మా ఇళ్లే. అంతా మా కుటుంబ సభ్యులు. ఏ ఇంటికి వెళ్తే కాదంటారు!


గతంలో అన్నీ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. సీమాంధ్రలో మళ్లీ ఆ పరిస్థితి వస్తుందా?

లేదు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. కొన్ని నగరాలను, పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తాం. ఎక్కువ పరిశ్రమలు పెడుతాం. పన్ను మినహాయింపులను ఉపయోగించుకుంటాం.


మీరు చెప్పినవి పూర్తికావడానికి ఐదేళ్లు సరిపోతుందా?

కనీసం 10 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే మరో ఐదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాం. నేను ఆశాజీవిని. సాధించేవరకు వెనుకబడను. కొందరు పదవిలోకి వస్తే ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. నాకు అదిలేదు. నాకు పదవి వచ్చింది. ఇప్పుడు మా ఇల్లు ఏమైనా మారిందా?



సీమాంధ్రకు మీరిచ్చే భరోసా ఏమిటి?

నాకు ప్రజల కష్టాలు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు, నరేంద్రమోదీ కలిశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తారు. నాకు ప్రజలకన్నా సన్నిహితులు మరెవరూ లేరు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతా. విద్య, ఉద్యోగ రంగాల్లో న్యాయం చేస్తాం. పిల్లలకు బంగారు భవిష్యత్‌ కల్పిస్తాను.


రాజకీయంగా మీరు వైఎస్‌తో హోరాహోరీగా పోరాడారు. కానీ ఇప్పుడు జగన్‌, షర్మిలతో పోరాడాల్సి వస్తోంది. మీకేమనిపిస్తోంది?

ప్రజాస్వామ్యంలో ఇది తప్పదు. రాహుల్‌గాంధీ, ప్రియాంక ఎవరు? సోనియాగాంధీ వారసులే కదా? ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉంటాయి.


నిన్నటిదాకా సోనియాగాంధీ వేధించారు. ఇకపై చంద్రబాబు వేధిస్తారేమోనని జగన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?

నా జీవితంలో ఎప్పుడూ వ్యక్తులతో పోరాడలేదు. వ్యవస్థపై, సమస్యలపై పోరాడాను. ఆ సందర్భంలో కొంతమంది వ్యక్తులు తప్పుచేసి ఉంటే ఆ వ్యక్తులపై కూడా పోరాడాను. నేను, మోదీ ఒక టీమ్‌గా ముందుకొచ్చాం. ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో అవినీతి, అసమర్థ, కుట్రరాజకీయాలు. కాంగ్రెస్‌ లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. దానికి అసమర్థత తోడయింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓట్లు, సీట్లకోసం కుట్రలు చేశారు. సీబీఐని, ఈడీని ఉపయోగించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. మా లక్ష్యం ఉద్దేశం అవినీతి రహిత భారతదేశం. జగన్‌పై ఎప్పుడూ వ్యక్తిగతంగా పోలేదు. చట్టం ఎవరూ తప్పుచేసినా వదిలిపెట్టదు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే...చర్యలు హేతుబద్ధంగా ఉంటాయి. చట్టప్రకారమే చర్యలు ఉంటాయి.


టీడీపీ అధికారంలోకి వస్తే జగన్‌ అక్రమంగా సంపాదించిన ఆస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ప్రజల సంక్షేమానికి వినియోగిస్తామని మీ నేతలు చెప్పారు?

ఒక విధానాన్ని రాజకీయ కోణంలో చూస్తే సమస్యలు ఉంటాయి. అలా కాకుండా జాతీయ స్థాయిలో ఒక విధానం తీసుకురావాలి. అన్నా హజారే ఉద్యమాలు చేశారు. కానీ, ఆయన చేసిన విధానంలో తప్పు ఉన్నది. కాంగ్రెస్‌ ఆయన్ను నిర్వీర్యం చేసింది. నేను, మోదీ నిస్వార్థంగా బతికాం. మాపై కేసులు లేవు. దేశంలో అవినీతి జరుగుతుంటే చూడలేం. అవినీతిని ప్రక్షాళన చేయాలంటే సంస్కరణలు రావాలి. వ్యవస్థలను బలోపేతం చేయాలి. విదేశాల్లో ఉన్న డబ్బులు తేవాలి. ఇందులో ఎవరు దొరికితే వారిపై చర్యలు తప్పవు. ఇది ప్రజాప్రయోజనం కోసమే. నేను ఈవిషయంలో వెనుకబడినా మోదీ తగ్గరు. నాకంటే ఓ అడుగు ముందుకు వేస్తారు. తమ సొంతపార్టీ వారు తప్పుచేసినా ఏడాదిలో విచారణ పూర్తిచేసి శిక్షలు వేయిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకకోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపచేయాలి. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదు.


కేసీఆర్‌ మీకు, మీరు ఆయనకు ఫోన్‌చేసి అభినందనలు తెలుపుకున్నారా? కోపాలు తగ్గాయా?

అది పత్రికాముఖంగా జరిగిపోయింది. వ్యక్తిగతంగా ఫోన్‌లు చేసుకోలేదు. నాకు ఎవరిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. ఆయన నా దగ్గరే పెరిగారు. ఒకప్పుడు నా వద్ద మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణకు సీఎం అవుతున్నారు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఇకపై ప్రజలను రెచ్చగొట్టేలా, వైషమ్యాలు పెంచే అంశాలకు వీలు ఇవ్వను. అందరినీ కలుపుకొనిపోతాం. రెచ్చగొట్టే వారిని అడ్డుకుంటాం.


సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంకా ఎంతకాలం ఉంటారు?

ఇక్కడ కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలపై ఎవరూ లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. రెండు ప్రాంతాల్లో ప్రజలను కాపాడే బాధ్యత మాదే. ప్రజలు సామరస్యంగా ఉండాలి. రెచ్చగొడితే సహించం. కేసీఆర్‌ పని విషయంలో నాతో పోటీ పడాలి. ప్రజలకు మంచి చేస్తే ఎంతో సంతోషిస్తాను. ప్రతి రోజూ ప్రజలను రెచ్చగొట్టడం సాధ్యంకాదు. రెచ్చగొడితే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నిన్నటి వరకు ఆటలు సాగాయి. పనిచేసి, ప్రజలకు మంచిచేసి, నిజాయతీ నిరూపించుకోవాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే వదిలిపెట్టను!



దోచుకోవడం అబద్ధం

‘‘నిజానికి తెలంగాణను ఎన్టీఆర్‌, ఆ తర్వాత నేను అభివృద్ధి చేశాం. అయినా దోచుకున్నాం అని పదేపదే అన్నారు. మేం ఏం దోచుకున్నాం? నాదెళ్ల సత్య. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలో వందల కోట్ల రూపాయల జీతంతో పనిచేస్తున్నారు. అంటే ఆయన మైక్రోసాఫ్ట్‌ను దోచుకుంటున్నట్లేనా? అమెరికాలో తెలుగువారు డాక్టర్లు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు.


వారు దోచుకోవడానికి వెళ్లారా? ముంబయి ఎయిర్‌పోర్టు ఉన్నది. అది జీవీకే చేపట్టింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు జీఎమ్‌ఆర్‌ చూస్తోంది. అంటే వారు దోచుకున్నారా? హైదరాబాద్‌కు ఈ కంపెనీలు అన్నీ వచ్చాయి. ఆదాయం పెరిగింది. నేను వాడికథ చూస్తాను...వీడి కథ చూస్తాను అంటే అందరూ కలిసి నీ కథ చూస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మేం ఇలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తాం. రెండు రాషా్ట్రలకు పరస్పర సహకారం ఉంటుంది. మాకు అన్యాయం జరిగిందనే ఫీలింగ్‌ పోగొడతాం. ఈ మధ్యలో ఒకరిద్దరు వేలుపెట్టకుండా అడ్డుకోవాలి.


తెలంగాణలో టీడీపీ పాత్ర ఎలా ఉండబోతోంది?

రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి. రెండుప్రాంతాల్లో తెలుగువారిని కలిపేశక్తి తెలుగుదేశానికే ఉంది. ఇరు ప్రాంతాల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రజల మనోభావాలను గాయపరిచారు. సోనియా, జగన్‌లు కలిసి నాటకమాడారు. ఇందులో కేసీఆర్‌ భాగస్వామి. అందుకే ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే మమ్ములను ఆదరించారు.


కానీ మీ పార్టీకి చాలా జిల్లాల్లో సీట్లు రాలేదు కదా?

వరంగల్‌లో దయాకర్‌రావు బ్రహ్మాండంగా గెలిచారు. మహబూబ్‌నగర్‌లో రేవంత్‌ గెలిచారు. ఇలా చాలా చోట్ల మావాళ్లు గెలిచారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉన్నది.


భవిష్యత్‌లో తెలంగాణలో మీ పాత్ర ఏమిటి?

2019లో తెలంగాణలో మాదే అధికారం. ఈ నిర్ణయం జరిగిపోయింది. ఇదో చారిత్రక అంశం కానుంది. ఐదేళ్లు లేదా అంతకన్నా ముందే వస్తామేమో!


విభజన పరిణామాలతో చాలా రోజులు బాధపడ్డారని, నిద్రపోలేదని తెలిసింది?

అవును! విభజన చేసిన తీరుతో విస్తుపోయాను. బాధపడ్డాను, ఆవేదనతో నిద్రపట్టని రోజులున్నాయి. సమన్యాయం చేయమని అడిగాను. పారదర్శకంగా, హేతుబద్ధంగా విభజన చేయమని అన్నారు. ఇద్దరికీ న్యాయం చేశామని అనిపించుకోవాలని సూచించాను. ఈ విషయాలు చెప్పినందుకు నన్ను అవమానించారు. రెండుకళ్ల సిద్దాంతమని అవహేళన చేశారు. నీకేం కావాల్నో చెప్పు... రెండు విధానాలు వద్దని పదేపదే చెప్పారు. జాతీయ మీడియా కూడా నన్ను అవహేళన చేసింది. టార్గెట్‌ చేసింది. కరణ్‌ థాపర్‌ ఓ రోజు దారుణంగా మాట్లాడారు.

 

న్యాయం కోసం పోరాడిన నన్ను అవమానించారు. ‘నీది రెండు కళ్ల సిద్ధాం తం. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీని చూడండి అని ప్రశ్నించేశారు. ముగ్గురూ కలిసి మోసం చేస్తున్నారంటే వినేవాళ్లుకాదు. అంటే నేనేదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు.... వాళ్లు మాత్రమే తెలివైన వారనట్లు ప్రవర్తించారు. కానీ ఈ రోజు ఏం జరిగింది? ప్రజలు విజ్ఞత ప్రదర్శించారు. వాస్తవాన్ని చూపించారు. రెండు ప్రాంతాల్లో నిలబడ్డాం. కాంగ్రెస్‌ అడ్రస్‌లేకుండా పోయింది. ఇవన్నీ ఆలోచించి చాలా బాధపడ్డాను. అవమానాలు భరించాను. ప్రజల కోసం వెళ్తే నాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకుండా అవమానించారు. ఒక అభద్రతా భావం మనిషిని నిర్వీర్యం చేస్తోంది. కోపం వ స్తే ఎవరైనా తప్పుదోవపట్టిస్తే, తప్పుడు మార్గానికి కూడా వెళ్తారు. పంజాబ్‌లో ఏం జరిగింది? ఇందిరాగాంధీ చనిపోయేదాకా వచ్చింది.

 

ఎల్టీటీఈలో ఎవరి తప్పు ఉంది? రాజీవ్‌ గాంధీ సైన్యాన్ని లంకకు పంపించారు. ఆ తప్పుతో ఆయన ఎంత మూల్యం చెల్లించుకున్నారు? అసోం ఏం జరుగుతోంది? జమ్మూకాశ్మీర్‌లో చిచ్చు ఏమైనా ఆరిందా? సీమాంధ్రలో ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తే ఏమౌతుంది? అదే చెప్పాను. కూర్చోని చర్చించమన్నాను. హైదరాబాద్‌కు రమ్మన్నాను. మీ కష్టం ఏమిటని అడగమన్నాను. అది అడగకుండా నువ్వు ఏం చెబుతావో అది చెప్పు? అన్నారు. ఒక పక్క చెబితే మరోపక్క లేకుండా చేయాలని రాజకీయంగా కుట్ర చేశారు. ఈ రోజు అడ్రస్‌లేకుండా గల్లంతయ్యారు. ప్రజలు కూడా ప్రధాన స్రవంతి నుంచి దారితప్పుతారేమోనని భయపడ్డాను. మీరు 20 ఏళ్లు కష్టపడతారు. అనూహ్యంగా ఒక రోజు ఉద్యోగం నుంచి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో అప్పులు ఉంటాయి. ఇళ్లు ఉండదు. అప్పుడు ఏమౌతారు? పూర్తిగా దెబ్బతింటారు. ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ధైర్యం చెప్పాను. మోదీ భరోసా ఇచ్చారు. అవి పని చేశాయి.


హైదరాబాద్‌లో సీమాంధ్ర సీఎంకు కేటాయించిన లేక్‌వ్యూ అతిథి గృహానికి ఎప్పుడు వెళతారు?

అక్కడికి వెళ్లడమెందుకు? హైదరాబాద్‌లో నాకు మూడు బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉంది. మరో చిన్న గెస్ట్‌రూమ్‌ ఉన్నది. గతంలో ఈ ఇంట్లోనే సీఎంగా పనిచేశాను. మళ్లీ ఇక్కడే ఉంటాను. ఇది నా భూమి. 36 ఏళ్లు బతికాను. 1978 నుంచి ఇక్కడే ఉన్నాను.


ఉభయ రాష్ట్రాల మధ్య అనేక చిక్కుముడులున్నాయి. వాటిని ఇద్దరూ కూర్చొని పరిష్కరించాలి. ఇద్దరిలో ఎవరు చొరవ తీసుకుంటారు?

అన్ని సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలి. ఒక స్థాయిలో తెలంగాణకు కూడా అన్యా యం జరిగిందని టీఆర్‌ఎస్‌ పేర్కొంది. కాంగ్రెస్‌ తీరు పట్ల టీఆర్‌ఎస్‌కు కూడా తృప్తిగాలేదు. ప్రధాన మంత్రి అవుతున్న మోదీ పెద్దమనిషి హోదాలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారు.

Updated Date - 2020-02-07T19:26:26+05:30 IST