కోడెలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ABN , First Publish Date - 2021-09-17T09:33:02+05:30 IST

దివంగత టీడీపీ నేత, మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కోడెలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

వెంటబడి వేధించింది: చంద్రబాబు

ఎన్టీఆర్‌ భవన్‌లో కోడెల ద్వితీయ వర్ధంతి సందర్భంగా నేతల నివాళి

అమరావతి/నకరికల్లు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): దివంగత టీడీపీ నేత, మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోడెల ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కోడెల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, అనంతరం మాట్లాడారు. ‘‘కోడెల మరణం ఇప్పటికీ మనసును కలిచివేస్తోంది. ప్రభుత్వం ఆయన వెంటబడి, వేధించి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని కల్పించింది. పల్నాటి పులిగా ఎంతోమందికి అండగా నిలిచిన నేత చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.


ఇంత దారుణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏనాడూ చూసి ఉండం. స్పీకర్‌గా ఉన్న సమయంలో తాను వినియోగించిన ఫర్నిచర్‌ను వెనక్కు తీసుకువెళ్లాలని ఆయన ప్రభుత్వానికి రాసిన లేఖను దాచిపెట్టి ఆ ఫర్నిచర్‌ విషయంలో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారు. పరువు ప్రతిష్ఠలను తన ప్రాణం కన్నా మిన్నగా భావించే ఆయన ప్రభుత్వ వేధింపులు, తప్పుడు కేసులు భరించలేక ఆత్మహత్య చేసుకొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కోడెల తాను నిర్వహించిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రమించారు. ఆ మహా మనిషిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు’’ అని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో జరగని దారుణాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని ప్రభుత్వ టెర్రరిజం కోరలు చాస్తోందని విమర్శించారు.


అంతకు ముందు మరో కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోడెలకు నివాళి అర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ... ‘‘ఉన్మాద పాలకుల కక్షలు, కుట్రల కారణంగా డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మనకు దూరమై రెండేళ్లు. ఆయనను భౌతికంగా మన మధ్య లేకుండా చేయగలిగారు కానీ.. పల్నాటి ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది’’ అంటూ నివాళులర్పించారు. హోం మంత్రిగా ఎలా పని చేయాలో డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ చూపించారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో కోడెల ద్వితీయ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా కోడెల విగ్రహాంతో పాటు ఎన్టీఆర్‌, రావెల సైదయ్య విగ్రహాలను ఆవిష్కరించారు.

Updated Date - 2021-09-17T09:33:02+05:30 IST