ఇవేం చేష్టలు?

ABN , First Publish Date - 2020-09-24T18:03:03+05:30 IST

రాష్ట్రంలో చిన్న, పెద్ద దేవాలయాలతో పాటు శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల..

ఇవేం చేష్టలు?

పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠ దెబ్బతీస్తారా?

ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధి ఇన్‌చార్జిలతో ఆన్‌లైన్‌ భేటీ

రైతులకు మద్దతుగా పోరాటాలకు సమాయత్తమవ్వాలని పిలుపు

టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని నాయకుల ఏకరవు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్న, పెద్ద దేవాలయాలతో పాటు శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల ప్రతిష్ట దెబ్బతీసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఆన్‌లైన్‌ సమావేశంలో  భేటీ అయ్యారు. ఓ బూతుల మంత్రి ఏకంగా రథం తగలబడితే పోయేదేముందని, ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరిగితే దేవుడికేమైందని మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. వెంకటేశ్వరస్వామి విషయంలో జరిగిన తప్పిదాలను అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించానని బాబు గుర్తుచేశారు. దేవాలయం, మసీదు, చర్చి ఏదైనా సరే.. ప్రజల నమ్మకాలను కాపాడాల్సింది పోయి వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.


హైందవ సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని, భార్య ఉన్నపుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. తమ హయాంలో రాయలసీమలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం అణచివేశామన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా చంద్రబాబు 750 మంది కార్యకర్తలను సంప్రదించారు. జిల్లాలో వైసీపీ నాయకుల అరాచకాలపై కార్యకర్తలు ఏకరువు పెట్టారు. ఇసుక, నాటుసారా మాఫియా రాజ్యమేలుతోందని, టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతూ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారని వివరించారు. ఇటీవల నోటిఫికేషన్‌ రద్దు చేసిన స్థానిక ఎన్నికల్లోనూ డోన్‌ నియోజవర్గం నుంచి పోటీ చేయకుండా కార్యకర్తలను బెదిరిస్తూ దాడులు చేశారన్నారు.


ఓర్వకల్లు పరిధిలోని ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ కబ్జాలపై విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయిద్దామని చంద్రబాబును ఆ నాయకులు కోరారు. 


నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో సీఐపై వైసీపీ నాయకుడు దౌర్జన్యం చేసినా కేసు నమోదు కాలేదన్నారు. పోలీసులకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపల్‌ మాజీ వైఎస్‌ చైర్మన్‌ గంగిశెట్టి విజయ్‌కుమార్‌ చంద్రబాబుతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో కుందూనదిపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి పనులు ఆగిపోయాయని, దీంతో నంద్యాల మీదుగా ఈ మార్గంలో ప్రయాణించే 20 గ్రామాలకుపైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. టీడీపీపై కక్షసాధింపుతోనే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. 


కొలిమిగుండ్ల మండలంలో నిబంధనల మేరకు మైనింగ్‌ చేస్తున్న వారిని కూడా వేధిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీజీ జనార్దన్‌రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని డోన్‌ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ ఫిర్యాదు చేశారు. ఇటీవల భారీ వర్షాలకు నంద్యాల లోక్‌సభ పరిధిలోని వందలాది ఎకరాలు నీట మునిగాయని శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో పాటు పలువురు గుర్తుచేశారు. నెలలు గడుస్తున్నా పంట నష్టాన్ని పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. రైతులకు మద్దతుగా పోరాటం చేద్దామని పలువురు నాయకులు కోరగా.. చంద్రబాబు స్పందించారు. త్వరలో రైతు పోరాటానికి టీడీపీ ఉద్యమిస్తుందని తెలిపారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా భయపెడుతున్నా నిలబడ్డ కార్యకర్తలను అధినేత ప్రశంసించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముకగా నిలవాలన్నారు. 


నీరు-చెట్టు పథకం కింద పెండింగ్‌ బిల్లులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతూ కార్యకర్తలను బెదిరించడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను చంద్రబాబు ప్రస్తావించారు. కోర్టును ఆశ్రయించి తప్పకుండా బిల్లులు విడుదల చేయించేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆన్‌లైన్‌ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఎన్‌ ఎండీ ఫరూఖ్‌, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని, వైసీపీ నాయకుల అండదండలతో ఇవి జరుగుతున్నాయని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న కార్యకర్తలపై బహిరంగ దాడులకు దిగుతున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.


ఇసుక దొరక్క ఇబ్బందులు

చాగలమర్రి మండలంలో ఇసుక దొరక్క ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారు. నవరత్నాలు ప్రకటించి అభివృద్ధి పనుల్ని పట్టించుకోవడమే మానేశారు. 

- నాగరాజు యాదవ్‌, చాగలమర్రి మండలం

ఎరువుల కొరత తీవ్రంగా ఉంది 

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. రైతు భరోసా కేంద్రాలంటూ హడావుడి చేయడమే తప్ప అందించింది శూన్యం. వరి, మినుము, మొక్కజొన్న వంటి పంటలు నష్టపోయినా అధికారులు పరిశీలించిన దాఖలాల్లేవు. గత ఏడాది పంట నష్టాన్నే ఇంతవరకు చెల్లించలేదు.

- పాతి పాపిరెడ్డి, ఆళ్లగడ్డ

కరోనా నియంత్రణలో విఫలం

కరోనా నియంత్రణలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పది మందికీ ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తోంది. అన్న క్యాంటిన్లు మూసేశారు. సంక్షేమ కార్యక్రమాల్లో భారీగా కోత పెట్టారు. వైసీపీ హయాంలో ఒక్క సిమెంట్‌ రోడ్డు కూడా ఇంతవరకు పడలేదు. 

- రామలింగారెడ్డి, అహ్మద్‌ హుస్సేన్‌, శ్రీశైలం



Updated Date - 2020-09-24T18:03:03+05:30 IST