చంద్రబాబు పర్యటన విజయవంతం

ABN , First Publish Date - 2021-04-13T08:19:52+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు సోమవారం జరిపిన తిరుపతి పర్యటన విజయవంతమైంది.

చంద్రబాబు పర్యటన విజయవంతం
చంద్రబాబుకు మహిళల హారతి, రాళ్లదాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబుకు వివరణ ఇస్తున్న ఏఎస్పీ సుప్రజ

రాళ్ళదాడి పట్ల శ్రేణుల్లో స్థైర్యం పెంచిన అధినేత స్పందన


తిరుపతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు సోమవారం జరిపిన తిరుపతి పర్యటన విజయవంతమైంది. ఉప ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం నెల్లూరు జిల్లా నుంచీ వచ్చిన చంద్రబాబుకు రైల్వే స్టేషన్‌ కూడలిలో శ్రేణుల నుంచీ అపూర్వ స్వాగతం లభించింది. షెడ్యూలు ప్రకారం ఆయన సాయంత్రం 4.30 గంటలకే రైల్వేస్టేషన్‌ చేరుకోవాల్సివుండగా గంట ఆలస్యంగా 5.30 గంటలకు వచ్చారు. అయితే 4 గంటల నుంచే రైల్వే స్టేషన్‌ కూడలి జనసంద్రంగా మారింది. చంద్రబాబు అక్కడనుంచి కాలినడకన కర్నాల వీధి, బేరి వీధి మీదుగా కృష్ణాపురం ఠాణా చేరుకున్నారు. ఆయనను చూసేందుకు, అభివాదం చేసేందుకు జనం పోటీపడ్డారు. చివరికి రైల్వే స్టేషన్‌ కూడలి, పరిసరాల్లోని హోటళ్ళలో టిఫిన్‌ చేస్తున్న బయటి ప్రాంతాల వారు కూడా వెలుపలికి వచ్చి చంద్రబాబును చూసేందుకు, అభివాదం చేసేందుకు ఎగబడ్డం విశేషం. సభ ఏర్పాటు చేసిన కృష్ణాపురం ఠాణా పసుపుమయంగా మారింది. ప్రత్యేకించి నగరానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాళహస్తికి మించి జనం హాజరు కావడంతో పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. దానికి తోడు చంద్రబాబు ప్రసంగించినంతసేపూ ధాటిగా మాట్లాడారు. ముఖ్యంగా గతంలో సీఎంగా వున్నపుడు జిల్లాలో రౌడీయిజాన్ని అణచి వేశానని, మళ్ళీ వస్తానని, అలాంటి వారి తోక కట్‌ చేస్తానంటూ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రసంగం సాగించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. తాను పుట్టి పెరిగిన తిరుపతి ప్రాంతం గురించి, కృష్ణాపురం కూడలి గురించి తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం నగరవాసుల్ని ఆకట్టుకుంది.అంతకు మించి ఆయన తన దృష్టిలో తిరుపతి పుణ్యక్షేత్రానికున్న ప్రాధాన్యాన్ని, నగరంలో తాము చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూనే ప్రత్యర్థులు తిరుపతిలో అభివృద్ధి పరంగా తట్ట మట్టి అయినా వేశారా అంటూ ప్రశ్నించడం నగరవాసుల్ని ఆలోచింపజేసింది. ఇక సభ ముగుస్తుందనంగా ప్రత్యర్థులు రాళ్ళదాడికి పాల్పడడం, పలువురు కార్యకర్తలు గాయపడడం కలకలం రేపింది.అయితే ఆఘటనకు చంద్రబాబు ప్రతిస్పందించిన తీరు శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. సాధారణంగా జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన పార్టీ కార్యకర్తలు దూరాభారం కారణంగా సభ ముగియడానికి ముందే వెనుదిరగం పరిపాటి. అయితే చంద్రబాబు సభలో మాత్రం సభ ముగిసి, రోడ్డుపై బైఠాయింపు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి కాలినడకన వెళ్ళడం, అక్కడ నుంచీ వెనుదిరిగే వరకూ కూడా శ్రేణులంతా ఆయన వెన్నంటే వుండడం గమనార్హం. ఓ విధంగా చెప్పాలంటే ఆ ఘటన ఉప ఎన్నికల్లో టీడీపీ అవకాశాలను మెరుగుపరిచింది. కాగా చంద్రబాబు పర్యటన సంపూర్ణంగా విజయవంతం కావడంతో తిరుపతి టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది.


ఉప ఎన్నికల్లో సత్తా చూపండి: టీడీపీ నేతల పిలుపు

తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చూపించి వైసీపీకి బుద్ధి చెప్పాలని  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్లకు పిలుపునిచ్చారు.తిరుపతి నగరం కృష్ణాపురం ఠాణాలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప తిరుపతికి తామేం చేశామో వైసీపీ చెప్పగలదా అని ప్రశ్నించారు.గుంటూరు,శ్రీకాకుళం ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో చంద్రబాబు రక్షకుడైతే  జగన్‌ భక్షకుడన్నారు.ఢిల్లీకి వెళ్లి  ప్రత్యేక హోదా, ఇండస్ట్రియల్‌ పోర్ట్‌, దుగరాజపట్నం, విశాఖ స్టీల్‌ గురించి వైసీపీ ఎంపీలు ఎవరైనా నోరెత్తి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.టీడీపీ ఎంపీల పోరాటం ఏవిధంగా ఉందో చూస్తున్నారు కదా! తోడుగా పనబాక లక్ష్మిని ఆశీర్వదించి పంపితే పార్లమెంట్‌లో బలం వస్తుందని, ఎన్టీఆర్‌ పునాదులను కాపాడినవాళ్లమవుతామన్నారు.తిరుపతి తీర్పు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం సైకిల్‌కు ఓటు వేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ వైసీపీ రెండేళ్ల దుర్మార్గపు పాలనకు స్వస్తి పలికేలా పనబాక లక్ష్మిని గెలిపించాలన్నారు. నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోదే అన్నారు. ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మాట్లాడుతూ  తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా హోదా ఇస్తానని ప్రమాణం చేసిన మోదీకి, హోదా సాధించలేని జగన్‌కు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.వైసీపీ ఎంపీలంతా మన రాష్ట్రానికి హోదా గురించి పోరాడకుండా పుదుచ్చేరి హోదా కోసం పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T08:19:52+05:30 IST