Abn logo
Dec 1 2020 @ 03:02AM

సాయంపై సమరం

చంద్రబాబు X సీఎం.. హోరాహోరీ

మైక్‌ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్‌.. సీఎం వద్దనడంతో కట్‌..  మండిపడ్డ  విపక్షం

పోడియం ముందు కూర్చుని నిరసన... బాబు సహా 14 మంది సస్పెన్షన్‌

తొలిసారి సస్పెండ్‌ అయిన చంద్రబాబు

గేలి చేస్తూ సభలో జగన్‌ హావభావాలు

ఇన్‌పుట్‌ సబ్సిడీపై తీవ్ర రగడ

అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం

వరద సాయంపై స్పష్టత లేదన్న టీడీపీ

18 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ఆ రైతులకు సహాయం చేశారా?

సర్కారుకు విపక్షం సూటి ప్రశ్న

పంటనష్టం అంచనా జరుగుతోంది

టీడీపీ సభ్యులకు బుర్ర లేదు

మార్షల్స్‌ను పెట్టి బయటికి పంపాలి

విపక్షంపై ముఖ్యమంత్రి ధ్వజం


వరద సాయంపై చర్చ... సమరంగా మారింది. శీతాకాల సమావేశాల తొలిరోజే... వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్ష నేతపైనా సస్పెన్షన్‌ వేటు పడింది. శాసనసభలో ‘పీకుడు’ భాష వినిపించింది. తనకు మైక్‌ ఇవ్వడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేయడం, వెంటనే మైక్‌ కట్‌ చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. అక్కడే అసలు వివాదం రాజుకుంది. వారూ వీరూ పోడియం ముందు మోహరించారు. చంద్రబాబు ఏకంగా పోడియం ముందు నేలపై బైఠాయించారు.  సస్పెన్షన్‌ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సర్కారుపై ధ్వజమెత్తారు. ‘ఫేక్‌ సీఎం’ అని మండిపడ్డారు. ఇక.. సర్కారు తరఫున మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని రంగంలోకి దిగారు. చంద్రబాబుపై బూతులు ప్రయోగించారు.


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్‌ మైకివ్వడంపై సీఎం జగన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది సభా సంప్రదాయం కాదని చంద్రబాబు మండిపడ్డారు. వెల్‌లో ఉన్న టీడీపీ సభ్యులపైకి 20 మంది మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకురావడంతో చివరకు చంద్రబాబు కూడా పోడియం వైపు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అధికార పక్షం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆయనతో పాటు సభలో ఉన్న 14 మంది టీడీపీ సభ్యులనూ ఒక రోజు సస్పెండ్‌ చేస్తూ తీర్మానం ఆమోదించింది. అయితే వారు సభలోనే బైఠాయించడంతో మార్షల్స్‌ను పిలిపించి బలవంతంగా బయటకు తరలించారు. 40ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. వరదల సమయంలో ప్రభుత్వం రైతులకు చేసిన సాయాన్ని మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. అనంతరం టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రసంగించారు.


వ్యవసాయం రంగంపై సభలో ప్రభుత్వం ఇచ్చిన నోట్‌లో నివర్‌ తుఫానుకు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేసిందో చెబితే బాగుండేదని అన్నారు. ఈ ఏడాది తుఫాను, వరదలు, వర్షాల కారణంగా 18 లక్షల ఎకరాల వరకూ పంట నష్టం జరిగిందని తెలిపారు. సభ ద్వారా ఈ 18 లక్షల ఎకరాల రైతులకు భద్రత, భరోసా కల్పిస్తారని ఆశించామని.. కానీ ప్రభుత్వం భరోసా ఇవ్వలేదన్నారు. ఈ సమయంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకుని.. టీడీపీ సభ్యులు కొద్దిగా బుర్రపెట్టుకుని ఆలోచించాలని.. ప్రస్తుతం రాష్ట్రంలో నష్టం అంచనా జరుగుతోందని.. 31నాటికి రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేస్తామని చెబుతున్నామని తెలిపారు. దేశంలో తొలిసారిగా నెల వ్యవధిలో ఇన్‌పుట్‌ సబ్సిడీ వేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామన్నారు. టీడీపీ నేతలకు పై కంపార్ట్‌మెంట్‌(తలలో) మొత్తం ఖాళీగా ఉందేమోనని ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగం ముగియగానే.. చంద్రబాబు లేచి స్పీకర్‌ను మైక్‌ అడిగారు. సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మైక్‌ ఇచ్చారు. సీఎం కల్పించుకుని.. ఆయనకు మైక్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, వాళ్ల పార్టీ ఎమ్మెల్యే లేవనెత్తిన అంశంపై తాము స్పష్టత ఇచ్చామని చెప్పారు. ‘దేనికైనా పద్ధతి ఉండాలి.


సభలో సీఎం ప్రకటన కోసం రైతాంగం ఎదురుచూస్తోంది. సభలో రౌడీయిజం చేయాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. ఈ పరిణామంపై చంద్రబాబు మండిపడ్డారు. సభలో మాట్లాడడానికి స్పీకర్‌ అవకాశమిస్తే.. సీఎం కాదనడం ఏమిటని నిలదీశారు. ఇది సభ సంప్రదాయం కాదన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యులను సీఎం అవమానించడమూ సంప్రదాయం కాదని చెప్పారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. చంద్రబాబు కూడా పోడియం వద్దకు చేరుకోవడంతో సుమారు 20మంది మంత్రులు, వైసీపీ సభ్యులు అక్కడకు వచ్చారు. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గుతున్నా.. అధికార పార్టీ సభ్యులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. చంద్రబాబు ఆగ్రహానికి గురై పోడియం ముందే బైఠాయించారు. సభ సజావుగా జరగకూడదనే ఆయన బైఠాయించారని సీఎం ఆరోపించారు. ‘సభలో రౌడీయిజం చేస్తూ.. కళ్లు పెద్దవి చేసి.. ఏం పీకుతారని అనడమేంటి? ఆ వయస్సులో ఆయనకు బుద్ధి ఉందా..? పీకించుకోవడానికి వచ్చామా..? ఇలాంటి వారిని మార్షల్స్‌ పెట్టి పెట్టి బయటకు పంపించేయండి’ అని స్పీకర్‌ను కోరారు.


సీఎం సూచనల మేరకు మంత్రి పేర్ని నాని.. చంద్రబాబుతో పాటు సభలో ఉన్న 14మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్‌  చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్‌ వెంటనే ఆమోదించారు. సస్పెండ్‌ అనంతరం కూడా టీడీపీ సభ్యులు పోడియంవద్ద ఆందోళన కొనసాగించారు. దీంతో మార్షల్స్‌ను పిలిపించి వారిని బయటకు తరలించారు. కొంత సమయం తర్వాత చంద్రబాబే స్వయంగా లేచి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement