ఏమిటీ వివక్ష?

ABN , First Publish Date - 2020-04-08T09:56:24+05:30 IST

ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదుచేశారు.

ఏమిటీ వివక్ష?

టీడీపీ ఎమ్మెల్యేల ఫోన్లు కలెక్టర్‌ తీయరా?

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించి మంత్రుల సమావేశాలు

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. రైతుల సమస్యలపై నిర్వహించిన అధికారిక సమావేశానికి అధికార పక్ష ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవలేదని ఆయన ఆక్షేపించారు.


‘కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆక్వా, ఉద్యాన, పౌలీ్ట్ర, సెరికల్చర్‌, ధాన్యం తదితర వ్యవసాయ ఉత్పత్తుల రైతులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేకసార్లు విన్నవించినా ప్రభుత్వంలో ఈ సమస్యలపై చలనం లేదు. దీనితో కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యలను వివరించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే, టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు అనుకొన్నారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ను కలెక్టర్‌ తీయలేదు. దీనితో కలెక్టర్‌ను కలవడానికి లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి సైకిల్‌పై  ఒంటరిగా బయలుదేరారు.


కానీ ఆయనను అరెస్టు చేసి మళ్లీ పాలకొల్లు పంపారు. అదే రోజు పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌తో కలిసి భీమవరంలో మత్స్యశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆ జిల్లాలో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పిలవలేదు. ఎందుకీ వివక్ష’ అని తన లేఖలో చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వివక్షాపూరిత  ధోరణి, లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలపై విచారణ జరిపించి తగిన చర్య తీసుకోవాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. 


ఏబీ సస్పెన్షన్‌  పొడిగింపు

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిఘా పరికరాల కొనుగోలుకు సంబంధించి ఆయన అవకతవకలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తన సస్పెన్షన్‌పై వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని క్యాట్‌ సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయగా ఏబీపై ఆరోపణలకు సంబంధించి నెల రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించింది. అఖిల భారత సర్వీసుల అధికారుల సస్పెన్షన్‌ వ్యవహారాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏబీ సస్పెన్షన్‌ను ఆగస్టు 5వరకూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

Updated Date - 2020-04-08T09:56:24+05:30 IST