వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కేసులో మళ్లీ విచారణాధికారి మార్పు

ABN , First Publish Date - 2021-04-09T08:20:34+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలపై గతంలో విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి ఆరుగురిని బాధ్యులుగా గుర్తించారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కేసులో మళ్లీ విచారణాధికారి మార్పు

కలికిరి, ఏప్రిల్‌ 8: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలపై గతంలో విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి ఆరుగురిని బాధ్యులుగా గుర్తించారు. ఆ ఆరుగురు అధికారులపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టి నిర్ధారించేందుకు నియమించిన విచారణాధికారిని మళ్లీ మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలుత కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌లో సభ్యుడు జె.సత్యనారాయణ (ఐపీఎస్‌)కు విచారణ బాధ్యత ప్పగించారు. ఆ తరువాత 2020 మార్చి 18న ఆయన్ను తప్పించి మరో విచారణాధికారి టీఏ త్రిపాఠీ (ఐపీఎస్‌)కి అప్పగించారు. ప్రస్తుతం త్రిపాఠీ నుంచి మరో విచారణ కమిషన్‌ సభ్యుడు కె.వెంకటరామి రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు విజిలెన్స్‌ కమిషనరు చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో) కార్యాలయంలో జరిగిన పలు అవకతవకలు, అక్రమాలకు అప్పటి పరిపాలనాధికారి సి.జయశేఖర్‌ (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు), సీనియర్‌ అసిస్టెంట్‌ టి.గిరిధర్‌ (ప్రస్తుతం నిండ్ర పీహెచ్‌సీ), డీఎంహెచ్‌వో కార్యాలయం గ్రేడ్‌-2 ఫార్మసిస్ట్‌ ఎల్‌.పరంధామనాయుడు, రేణిగుంట పీహెచ్‌సీ ఫార్మసిస్ట్‌ పి.విజయబాబు, రేణిగుంట పీహెచ్‌సీ వైద్యాధికారులు ఇ.బి.దేవి, జె.సి.మధుసూదన్‌రావును బాధ్యులుగా తేల్చారు. వీరిపై వచ్చిన అభియోగాలకు సంబంధించిన సంజాయిషీ నోటీసులను 2018 మే 9న జారీ చేశారు. అయితే ఆరోపణలకు సంబంధించిన అంశాలన్నింటినీ గుంభనం (కాన్ఫిడెన్షియల్‌)గా ఉంచి జీవోలు జారీ చేశారు.  

Updated Date - 2021-04-09T08:20:34+05:30 IST