మారండి బాబూ!

ABN , First Publish Date - 2020-04-04T06:14:15+05:30 IST

‘రోగం వస్తుందిరా బాబూ! ఇంట్లోంచి బయటకు రావద్దు’ అని చెప్పినా జనం వినడం లేదు. వీధుల్లోకి వచ్చిన వారిని తరిమికొట్టినా, వాహనాలు స్వాధీనం చేసుకున్నా మార్పు లేదు. అవసరం లేకపోయినా వీధుల్లో తిరుగుతున్న ప్రజల్ని అదుపు

మారండి బాబూ!

‘రోగం వస్తుందిరా బాబూ! ఇంట్లోంచి బయటకు రావద్దు’ అని చెప్పినా జనం వినడం లేదు. వీధుల్లోకి వచ్చిన వారిని తరిమికొట్టినా, వాహనాలు స్వాధీనం చేసుకున్నా మార్పు లేదు. అవసరం లేకపోయినా వీధుల్లో తిరుగుతున్న ప్రజల్ని అదుపు చేయడానికి బెంగళూరు పోలీసులు అన్ని ఐడియాలనూ వాడేశారు. ‘ఇంకేం చెయ్యగలం?’ అని తలలు పట్టుకున్న సమయంలో ఓ ఆలోచన ఫ్లాష్‌లా వెలిగింది. సోషల్‌ మీడియా వినియోగంలో బెంగళూరు సిటీ పోలీసులు చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళ ఒక్క ట్విట్టర్‌ ఖాతాకే పదమూడు లక్షల మంది ఫాలోయర్స్‌ ఉన్నారు. ఎవరు చెప్పినా వినని జనానికి... ముఖ్యంగా యువతరానికి తెరవేలుపుల మాటల్లో చెబితే మనసుకు పడుతుందన్న ఆలోచనతో సరికొత్త మీమ్స్‌ తయారు చేసి, ట్విట్టర్‌లోని తమ అధికారిక ఖాతా ద్వారా వదిలారు. ఒక మీమ్‌లో ప్రసిద్ధ కన్నడ నటుడు జగ్గేశ్‌ ఫొటోను ‘‘ఇంట్లోనే ఉంటే సురక్షితం’’ అంటూ సందేశంతో జోడించారు. ఆ ఫొటో 2009లో వచ్చిన ‘ఎద్దేళు మంజునాథ’ సినిమాలోది. ఆ చిత్రంలో కొండంత బద్ధకంతో పని చెయ్యకుండా, ఇల్లు కదలని మనిషిగా జగ్గేశ్‌ నటించారు. అలాగే ‘‘నువ్వు బయటకు వెళ్తే, అది ఒక ప్రయాణం ఏమాత్రం కాదు.  చివరికి క్వారంటైన్లో తేలుతావ్‌’’ అనే సందేశాన్ని మేనకోడలికి మేనమామ చెబుతున్నట్టు వినిపించారు. దానికి ‘మాణిక్య’ అనే సినిమాలోని బొమ్మను జోడించారు. ఈ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు అభినందించడంతో పాటు రీ-ట్వీట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-04-04T06:14:15+05:30 IST