సీజ్‌ చేసిన స్లాబులు మార్చేశారు!

ABN , First Publish Date - 2021-08-11T05:54:29+05:30 IST

సీజ్‌ చేసిన గ్రానైట్‌ స్లాబులను భద్రంగా కాపాడాల్సిన పోలీసు సిబ్బంది కక్కుర్తి చూపారు. వాటిలో కొన్నింటిని పక్కదారి పట్టించారు.

సీజ్‌ చేసిన స్లాబులు మార్చేశారు!
బల్లికురవ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న గ్రానైట్‌ స్లాబుల లారీలు

బల్లికురవలో పోలీసు సిబ్బంది కక్కుర్తి

ఉన్నతాధికారుల సీరియస్‌

ఎల్లలు దాటిన సరుకు వెనక్కి 

అద్దంకి, ఆగస్టు 10: సీజ్‌ చేసిన గ్రానైట్‌ స్లాబులను భద్రంగా కాపాడాల్సిన పోలీసు సిబ్బంది కక్కుర్తి చూపారు. వాటిలో కొన్నింటిని పక్కదారి పట్టించారు.  నాణ్యమైన ఆ సరుకు స్థానంలో నాసిరకం స్లాబులను ఉంచారు. విషయం ఉన్నతాఽధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్‌ అయ్యారు. ఎల్లలు దాటి వెళ్లిన ఆ స్లాబులను వెనక్కి రప్పించారు. ఈ సంఘటన బల్లికురవ పోలీసు స్టేషన్‌లో జరిగింది. అందిన సమాచారం మేరకు.. విజిలెన్స్‌ అధికారులు నెల క్రితం అక్రమంగా గ్రానైట్‌ స్లాబులు తరలిస్తున్న లారీని బల్లికురవలో పట్టుకున్నారు. దానిని సరుకుతో సహా సీజ్‌ చేసి అక్కడి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. దీనిపై లారీ యజమాని కోర్టును ఆశ్రయించారు. స్లాబులతో తనకేమీ సంబంధం లేదని, లారీని అప్పగించాలని కోరారు. కోర్టు నుంచి రిలీజ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన సరుకును స్టేషన్‌లో భద్రపరిచి లారీని విడుదల చేయాల్సిన పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. లారీలో ఉన్న కొన్ని స్లాబులను మాత్రమే దించి, నాణ్యత లేని మరికొన్ని స్లాబులను వేరే ప్రాంతం నుంచి తీసుకు వచ్చి వాటితో కలిపి అక్కడ ఉంచారు. మిగిలిన స్లాబులతో సహా లారీని రెండు రోజుల క్రితం వదిలి వేశారు. అందులో ఉన్న సరుకు విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బల్లికురవ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌, ఓ హోంగార్డు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి బల్లికురవ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. అప్పటికే గ్రానైట్‌ శ్లాబులతో ఎల్లలు దాటిన లారీని వెనక్కి రప్పించారు. ఈ వ్యవహారంతోపాటు, గ్రానైట్‌ అక్రమ రవాణాలో పోలీసుల పాత్రపై కూడా పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-08-11T05:54:29+05:30 IST