మాట మార్చి... మడమ తిప్పి!

ABN , First Publish Date - 2021-06-20T05:51:02+05:30 IST

ప్రత్యేక హోదా విషయంలో చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతులెత్తేశారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా లభిస్తే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుందని...

మాట మార్చి... మడమ తిప్పి!

ప్రత్యేక హోదా విషయంలో చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతులెత్తేశారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా లభిస్తే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుందని, యువతకు కోరినన్ని ఉద్యోగాలు లభిస్తాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూవాడా పర్యటించి గొంతు చించుకున్న జగన్‌ రెడ్డి.. ఇప్పుడు ఇంత సులువుగా హోదా గురించి మరచిపొమ్మని చెప్పడం చూసి ఎవరైనా ఆశ్చర్యపోతే వారిని చూసి జాలిపడాల్సిందే. ఎందుకంటే, ఎన్నికలకు ముందే కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ పెద్దలతో అవగాహన కుదుర్చుకున్న ఆయనకు ప్రత్యేక హోదా రాదన్న విషయం కూడా తెలుసు. అయితే అధికారంలోకి రావడం కోసం, యువతను రెచ్చగొట్టడం కోసం, హోదా అంశాన్ని ఎత్తుకున్నారు. సంప్రదాయ రాజకీయాలనే నమ్ముకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు జగన్మోహన్‌ రెడ్డి, మరోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారంతో ఉక్కిరిబిక్కిరై అప్పట్లో ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని కూడా వదులుకున్నారు. ఫైనల్‌గా ప్రత్యేక హోదా రాకపోగా ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ర్టానికి దక్కకుండా పోయింది. అయితే, ప్రత్యేక హోదా అంశం సజీవంగానే ఉంటుందని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావడానికి జగన్‌ అండ్‌ కో స్కెచ్‌ గీస్తున్నారన్న మాట. ‘నేరస్థులను, మోసగాళ్లను, దొంగలను, దేశద్రోహులను నేతలుగా ఎన్నుకునే ప్రజలు బాధితులు కారు! భాగస్వాములవుతారు’ అని జార్జి ఆర్వెల్‌ ఎప్పుడో చెప్పేశారు. వాస్తవాలను గుర్తించడానికి, గ్రహించడానికి సమాజం నిరాకరించినప్పుడు వంచనకు గురయ్యేది కూడా ప్రజలే. నిజానికి ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండానే దేశంలోని పలు రాష్ర్టాలు అభివృద్ధి చెందాయి. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే పెట్టుబడులు అవే వస్తాయి. ఏ హోదా ఉందని కియా పరిశ్రమ అనంతపురంలో ఏర్పాటయింది? ఏ హోదా ఉందని హైదరాబాద్‌ ఇంతలా అభివృద్ధి చెందుతోంది? పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడటం ద్వారా ఆయా రాష్ర్టాలు అభివృద్ధి చెందుతున్నాయి. గడచిన రెండేళ్లలో ఈ దిశగా జగన్‌ రెడ్డి చేసిన కృషి ఏమైనా ఉందా అంటే సున్నా అని చెప్పవచ్చు. విశాఖపట్నంలో ప్రారంభించాల్సిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ కార్యాలయం కూడా ప్రభుత్వ వైఖరి కారణంగా దూరమైంది. అదేమని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని దుష్ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి చెత్త ప్రచారం వల్ల ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. రాష్ట్రమే పెట్టుబడులను కోల్పోతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంస్థ సీఈవో జెన్నిఫర్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని విశాఖపట్నంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పించారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి రాజధానులు మహానగరాలుగా అభివృద్ధి చెందిన కారణంగా అలాంటి చోట తమ కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆ సంస్థ, చంద్రబాబు చొరవతో ద్వితీయశ్రేణి నగరమైన విశాఖకు రావడానికి అంగీకరించింది. ఈ విషయంలో నీలి మూకకు, నీలి మీడియాకు అనుమానాలుంటే సదరు సంస్థ సీఈవో జెన్నిఫర్‌ను సంప్రదించవచ్చు. ఫ్రాంక్లిన్‌ సంస్థ కాకపోతే మరొకటి రాకపోతుందా? అని ఆశపడటానికి కూడా రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలో చేసిన యాగీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గురించి అంతర్జాతీయంగా అందరికీ తెలిసిపోయింది. ప్రధానమంత్రి నేతృత్వంలో ప్రతి ఏటా జరిగే సంప్రదాయేతర విద్యుత్‌ సదస్సు కూడా గత ఏడాది వాయిదా వేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే సదస్సును రద్దు చేసుకోవలసి వచ్చిందట!


మితిమీరిన తెంపరితనం!

తన పాలనలో పెట్టుబడులు గానీ, పరిశ్రమలు గానీ వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కూడా తెలిసిపోయినట్టుంది. అందుకే ఆయన ఉద్యోగాల విప్లవం అని సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. నెలకు ఐదువేల చొప్పున చెల్లిస్తూ నియమించిన వలంటీర్లను చూపించి ఆయన మురిసిపోతున్నారు. నీలి మూక కూడా అదే బాటలో నడుస్తోంది. ‘మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితుడైతే మనకు ఒరిగేదేమిటి? ఆయన జీతం పెరుగుతుంది. మైక్రోసాఫ్ట్‌ డబ్బు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తాడా? సత్య నాదెళ్లకు భజన చేసే బదులు గ్రామాల్లో పేద కుటుంబాలకు చెందిన వారిని వలంటీర్లుగా నియమించిన జగన్‌ రెడ్డి గొప్పతనాన్ని గుర్తించండి’ అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. జనాల్ని ఇంత సంకుచితంగా ఆలోచించే స్థాయికి తెచ్చిన జగన్‌ రెడ్డిని నీలిమూక అభినందించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. జాబ్‌ కేలండర్‌ విడుదల అంటూ శుక్రవారం జగన్‌ రెడ్డి చేసిన హడావుడి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సైకాలజీని ఆయన బాగా స్టడీ చేశారని అర్థమవుతోంది. ఉద్యోగాల కోసం రాజధానికి రావాల్సిన అవసరం ఉండకూడదనే గ్రామాల రూపురేఖలు మార్చివేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో నిజం ఉందా? లేదా? అన్నది గ్రామీణ ప్రజానీకమే తెలుసుకోవాలి. పంచాయతీ వ్యవస్థ ఉండగా సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఎలా ఏర్పాటుచేస్తారని హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. దీంతో సచివాలయ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక వలంటీర్లను అధికార పార్టీలో ఎవరికి కోపం వచ్చినా పీకి పారేస్తారు. అయినా అంతా బ్రహ్మాండంగా ఉందని నమ్మమని జగన్‌ అండ్‌ కో చెబుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసే యువకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు ఇష్టపడటం లేదు. ఇరవై ఎకరాల సొంత భూమి ఉన్న కుర్రాళ్లు కూడా పెళ్లి కాకుండా ముదిరిపోతున్నారు. నెలకు ఐదువేలు వచ్చే వలంటీర్లకు కూడా ఇదే దుస్థితి రావొచ్చు. గ్రామాల్లోనే ఉద్యోగం కల్పించడం గొప్ప విషయమే. అయితే అందులో వంచన ఉండకూడదు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నింటినీ రద్దు చేసి నవరత్నాల పేరుతో నగదు పంపిణీ చేస్తున్న జగన్‌ రెడ్డికి ప్రస్తుతానికి జేజేలు లభించవచ్చు. కాలం గడిచేకొద్దీ ప్రజలకు అందులోని డొల్లతనం తెలిసి వస్తుంది. ప్రభుత్వం ఇస్తున్నది ఎంతో? పన్నుల రూపంలో గుంజుకుంటున్నది ఎంతో ప్రజలు గ్రహించినప్పుడు రాజకీయ లెక్కలన్నీ తారుమారు అవుతాయి. పన్నులు పెంచడాన్ని కూడా ఘరానాగా సమర్థించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. నాసిరకం మద్యాన్ని సరఫరా చేయడమే కాకుండా వాటి రేట్లను అడ్డగోలుగా పెంచడాన్ని సమర్థించుకోవడం కోసం... ప్రజలను మద్యానికి దూరం చేయడానికే రేట్లు పెంచినట్టు ఫుల్‌పేజీ ప్రకటనలు కూడా జారీ చేసుకునే తెంపరితనం జగన్‌ ప్రభుత్వానిది. ఇప్పుడు ఆస్తిపన్ను పెంచుతున్నారు కనుక ప్రజలకు వారి ఆస్తుల విలువ తెలియడానికే ఆ పని చేస్తున్నట్టు మరో ఫుల్‌పేజీ ప్రకటన విడుదల చేయవచ్చు. రోడ్లపై అనవసరంగా బలాదూర్‌ తిరగకుండా నిరోధించడానికే ట్రాఫిక్‌ చలాన్ల రేట్లు పెంచామని గతంలో చెప్పారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి కదా అని ప్రశ్నిస్తే పొదుపు అలవాటు చేయడం కోసం ధరలు పెంచుతున్నామని చెబుతారేమో తెలియదు. అదేమని ప్రశ్నిస్తే జనం మాతో ఉన్నారా? మీతో ఉన్నారా? అని ఎదురుదాడి చేస్తున్నారు. రెండేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో సాధించిన ప్రగతి ఏమిటంటే పెరిగిన అప్పులే! ప్రభుత్వం చేసే అప్పుల వల్ల తమకు వచ్చే నష్టం ఏమిటని ప్రజలు భావిస్తున్నారు గానీ, చేసిన అప్పులు తిరిగి చెల్లించాలంటే పన్నులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రజలపైనే కదా భారం పడుతుంది. 


ఢిల్లీ వెళ్లి సాధిస్తున్నది ఏమిటి?

రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కేంద్రం వివిధ పథకాలకు మంజూరు చేస్తున్న నిధులను దారి మళ్లించడంపై కేంద్ర అధికారులు మండిపడుతున్నారు. ఇకపై తాము విడుదల చేసే నిధులకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని, కేంద్రం నుంచి వచ్చే నిధులను నిర్దేశించిన లక్ష్యాలకే వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రత్యేక ఖాతాలు ప్రారంభించని పక్షంలో నిధుల విడుదల నిలిపివేస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదల కోసం రాష్ట్రం నుంచి అందే అభ్యర్థనలను కేంద్రప్రభుత్వ అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు ఢిల్లీ వెళ్లి ఎన్ని శాలువాలు కప్పుతున్నా ఫలితం లేదంటే ఇదే కారణం. నిజానికి రాష్ర్టాలు అడిగినన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు, ఎలా ఇస్తుంది? అయితే ప్రజలను మభ్యపెట్టడానికే ఢిల్లీ వెళ్లి వస్తుంటారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడు... ‘నరేంద్ర మోదీని పొగిడి, అమిత్‌ షాకు శాలువాలు కప్పారు. చంద్రబాబు కప్పిన శాలువాలు, బహూకరించిన వీణలతో బీరువాలు నిండిపోతున్నాయి గానీ రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదు’ అని ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలోనే ఎద్దేవా చేశారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా! ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి భోజనం పెట్టి గంటకు పైగా హోం మంత్రి అమిత్‌ షా సమావేశం కావడాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వారు రాష్ర్టానికి ఏం సాధించారో చెప్పగలరా? కేంద్రప్రభుత్వ అధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉక్కపోతకు గురవుతున్నారు. అటు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి వివరించి చెప్పలేక, ఇటు కేంద్రప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక వారు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేదని తెలిసి కూడా మేమేం చేయలేని స్థితిలో ఉన్నామని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు. ‘రూల్‌ ఆఫ్‌ లా’ అంటే ప్రభుత్వ పాలన చట్టబద్ధంగా ఉండాలి కానీ, పాలకుల ఇష్టాయిష్టాల ప్రకారం కాదు. ముఖ్యమంత్రి అంటేనే చట్టం కాదు. అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగ నిబంధనలే ముఖ్యమంత్రికంటే బలమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘The King Is Not The Law But The Law Is King’’ ఈ సూత్రాన్ని పాటించకపోవడం వల్లనే జగన్‌ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తనకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలించడానికే గానీ అధికారం చలాయించడానికి కాదన్న వాస్తవాన్ని జగన్‌ రెడ్డి గుర్తించలేకపోతున్నారు. ఈ కారణంగానే చట్టాలు, రాజ్యాంగం రాష్ట్రంలో అపహాస్యం పాలవుతున్నాయి. 


సూర్యుడిపై ఉమ్మి వేయడమే!

అధికారం అన్నది మంచి చేయడానికే గానీ పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు. కేంద్ర మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఉదంతానికి వద్దాం. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి ఆయనను తొలగించి పూసపాటి కుటుంబంతో ఏనాడో సంబంధాలు తెంచుకున్న సంచయితను తీసుకొచ్చి ఆ స్థానంలో నియమించారు. ఆ నియామకం చెల్లదని హైకోర్టు తాజాగా తీర్పునివ్వడంతో అశోక్‌ గజపతిరాజు మళ్లీ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సింహాచలం దేవస్థానానికి వెళ్లిన ఆయనను అధికారులు అవమానించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆదేశించినందునే తాము ఆలయ మర్యాదలు చేయలేదని అధికారులు చెప్పుకొచ్చారు. సింహాచలం దేవాలయానికి అశోక్‌ గజపతిరాజు కుటుంబం వేలాది ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చింది. అలాంటి అశోక్‌ గజపతిరాజుకు ఆలయ మర్యాదలు చేయవద్దని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మంత్రి హోదాలో ఆదేశించడం అధికారం తలకెక్కడం కాదా? గుళ్లు, గోపురాలు నిర్మించి వేల కోట్ల రూపాయల విలువైన భూములను విరాళంగా ఇచ్చిన కుటుంబానికి చెందిన వారిని విజయవాడలో గుళ్లపై ఆధారపడి కొబ్బరికాయల వ్యాపారం చేసుకున్న శ్రీనివాస్‌ వంటి వారు అవమానించడం ఏమిటి? ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? మాన్సాస్‌ ట్రస్ట్‌ భూములను అశోక్‌ గజపతిరాజు కొట్టేశాడని, ఇందుకుగాను ఆయనను త్వరలోనే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తరఫున ఉత్తరాంధ్రను శాసిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నీతి, నిబద్ధత, నైతికత విషయంలో అశోక్‌ గజపతిరాజు ముందు నిలబడటానికి కూడా విజయసాయిరెడ్డికి అర్హత లేదు. అయితే అధికారం ఉంది కదా అని విజయసాయిరెడ్డి కానీ, వెల్లంపల్లి కానీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తమ కుటుంబమే విరాళంగా ఇచ్చిన భూములను కాజేసే అల్పుడు కాదు అశోక్‌ గజపతిరాజు. గజపతుల కుటుంబ ఔన్నత్యం గురించి తెలుసో లేదో గానీ జగన్‌ ప్రభుత్వం అశోక్‌ గజపతిరాజు విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తోంది. విజయనగరానికే పరిమితం అవుతున్న అశోక్‌గజపతిరాజు అతి సాదాసీదా జీవితం గడుపుతారు. రాజవంశానికి చెందిన వాడినని ఆయన ఎప్పుడూ భావించరు. అలా ప్రవర్తించరు. విజయనగరంలో ఆయన ఉంటున్న ఇంటికంటే కొందరు మున్సిపల్‌ కార్పొరేటర్ల ఇళ్లు ఆడంబరంగా ఉంటాయి. ఇప్పటికీ తన కారును తానే తుడుచుకుంటారు. లగ్జరీ కార్లు ఆయనకు లేవు. నిజానికి ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అలా అని ఆయన పేదవాడని చెప్పలేం. ఆస్తులు, ఆడంబరాల పట్ల ఆయనకు ఆసక్తి ఉండదు. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా వంశపారంపర్యంగా వస్తున్న వజ్ర వైఢూర్యాలు బ్యాంకు లాకర్లలో మూలుగుతున్నాయి. వాటి విలువ వేల కోట్లు ఉంటుందని అంటారు. అయినా వివాదాన్ని పరిష్కరించుకుని వాటిని సొంతం చేసుకోవడానికి అశోక్‌ గజపతిరాజు ఎన్నడూ ప్రయత్నించలేదు. వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ నగల గురించి అధికార పార్టీ పెద్దలకు తెలిసి ఉండదు. తెలిసి ఉంటే ఈ విషయంలో కూడ సంచయిత వంటి మరొకరిని తెర పైకి తెచ్చి ఉండేవారు! ఒకప్పుడు ఈ దేశాన్ని కంటిచూపుతో శాసించిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం విశాఖపట్నం వచ్చినప్పుడు అశోక్‌ తండ్రి పూసపాటి వెంకటగజపతి రాజు ముందు శిరసు వంచి నమస్కరించారు. ఆస్తులపై పీవీజీ రాజుకు గానీ, ఆయన కుమారులకు గానీ మమకారం ఉండి ఉంటే, గుళ్లూ గోపురాలూ నిర్మించి వేలాది ఎకరాల భూములను దానం చేసి ఉండేవారు కాదు. విలాసవంతమైన జీవనానికి దూరంగా ఉండే అశోక్‌ గజపతిరాజు రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేసినప్పుడు తాను ప్రయాణించాలనుకున్న విమానం వరకు నేరుగా కారులో వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ సాధారణ ప్రయాణికులతో పాటే క్యూలో నుంచుని విమానం ఎక్కేవారు. అలా వెళ్లినప్పుడు ఒకసారి భద్రతా సిబ్బంది తనిఖీలో ఆయన జేబులో అగ్గిపెట్టె దొరికింది. ఇందుకు ఆయన విచారం కూడా వ్యక్తంచేశారు. వ్యక్తిగా అంతటి ఔన్నత్యంతో జీవిస్తున్న అశోక్‌ గజపతిరాజుపై విజయసాయి వంటివారు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆయనపై కేసు కూడా పెట్టారు. అశోక్‌గజపతిరాజును జగన్‌ రెడ్డి ప్రభుత్వం టార్గెట్‌ చేసుకోవడానికి నేపథ్యం లేకపోలేదు. అశోక్‌ గజపతిరాజు, ఎర్రన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, జగన్‌ అండ్‌ కో పై సీబీఐ విచారణకు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు జగన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇది మనసులో పెట్టుకున్న జగన్‌, విజయసాయి తాము జైలు జీవితం గడపడానికి కారణమైన అశోక్‌ గజపతిరాజును ఇప్పుడు జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి ముందుగా ఆయనను తొలగించారు. హైకోర్టు పుణ్యమా అని ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని అశోక్‌ గజపతిపై కేసులు పెట్టి జైలుకు పంపాలని పట్టుదలగా ఉన్నారు. ఆయనపై ఆరోపణలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడానికి ప్రయత్నించడమే అవుతుంది. జగన్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిఉండవచ్చు. వేల కోట్ల రూపాయలు సంపాదించి ఉండవచ్చు. విజయనగరం సంస్థానాన్ని ఏలిన వంశం అశోక్‌ గజపతిది. ఇవాళ సాయిరెడ్డి వంటి వారు నడమంత్రంగా వచ్చిపడిన అధికారంతో అశోక్‌ గజపతిపై ఆరోపణలు చేసినంత మాత్రాన ఆయన గౌరవానికి ఏమాత్రం భంగం కలగదు. ఈ చర్య వల్ల నష్టపోయేది జగన్‌ అండ్‌ కో మాత్రమే. ప్రజాస్వామ్యంలో అపరిమిత అధికారాలకు తావు లేదు. ఈ సూక్ష్మం తెలిసి కూడా రూల్‌ ఆఫ్‌ లా అంటే లెక్కలేనితనంతో మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి కొంతకాలం పాటు అశోక్‌ గజపతిరాజును తొలగించి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో అధికారానికి పరిమితులు ఉన్నందునే హైకోర్టు జోక్యం చేసుకొని జరిగిన తప్పును సరిదిద్దింది. మంత్రులకు సద్బుద్ధిని, మంచి భాషను ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నట్టు అశోక్‌ గజపతిరాజు చెప్పారు. దేవుడి పట్ల నిజంగా నమ్మకం, భక్తి ఉన్నవారు జగన్‌ అండ్‌ కోలా ప్రవర్తించరు. ఏసు ప్రభువు కూడా క్షమాగుణాన్ని బోధించారు. క్రైస్తవ మతాన్ని ఆచరించే జగన్‌ రెడ్డికి ఏసు బోధనలు కూడా గుర్తుకొస్తున్నట్టు లేదు. ప్రతిరోజూ తెల్లవారుజామున ఆయన కొంతసేపు బైబిల్‌ పఠిస్తారని చెబుతారు. అదే నిజమైతే బైబిల్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా జగన్‌ రెడ్డి వ్యవహరించకూడదు కదా? తాను ఏం చెప్పినా జనం నమ్ముతారని, ఏం చేసినా జనం ఆమోదిస్తారని ముఖ్యమంత్రి బలంగా నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో వారి జేబులు ఖాళీ చేస్తున్నారు. అదే సమయంలో పగ, ప్రతీకారాల్లో మునిగితేలుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో వేస్తున్న పిల్లి మొగ్గలను, రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయించే దిశగా సాగిస్తున్న ప్రయాణాన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నా ఓటర్లు నాకున్నారని భావిస్తూ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించని పక్షంలో జగన్‌ రెడ్డి త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి వస్తుంది. అసత్యాలతో ప్రజలను ఎవరూ ఎల్లకాలం మభ్యపెట్టలేరు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి



Updated Date - 2021-06-20T05:51:02+05:30 IST