మార్పులు నేటి నుంచే..

ABN , First Publish Date - 2021-08-01T06:42:26+05:30 IST

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో ఆగస్టు 1 నుంచి పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల్లో కొన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టినవి కాగా, మరికొన్ని బ్యాంక్‌లు ప్రకటించినవి.

మార్పులు నేటి నుంచే..

ఇకపై నిరంతర నాచ్‌ సేవలు .. పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలపై అదనపు వడ్డన

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో ఆగస్టు 1 నుంచి పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల్లో కొన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టినవి కాగా, మరికొన్ని బ్యాంక్‌లు ప్రకటించినవి. సరికొత్త నియమావళితో రుణాల తిరిగి చెల్లింపులు (ఈఎంఐ) జరిపేవారు, ప్రతి నెలా బ్యాంక్‌ ఖాతాలో జీతం జమయ్యే వారికి లబ్ధి చేకూరనుంది. తరచుగా ఏటీఎం లావాదేవీలు చేపట్టే వారిపైన మాత్రం అదనపు భారం పడనుంది. ఆ వివరాలు..


ఆదివారమైనా ఖాతాలో వేతనం జమ

అకౌంట్లో జీతం జమయ్యే రోజు ఆదివారం లేదా సెలవు దినమైతే వేతన సొమ్ము క్రెడిట్‌ అయ్యేందుకు బ్యాంకింగ్‌ సేవలు పునఃప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే. ఎందుకంటే, ఒక ఖాతా నుంచి పలు ఖాతాల్లోకి జీతాలు, ఫించను, వడ్డీ, డివిడెండ్‌ను జమ చేసే నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ (ఎన్‌ఏసీహెచ్‌-నాచ్‌) ఇప్పటివరకు బ్యాంక్‌ పనిదినాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆగస్టు 1 నుంచి నాచ్‌ వారంలో సంవత్సరంలో అన్ని రోజులూ అందుబాటులో ఉంటుందని గత నెల ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ప్రకటించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహణలోని నాచ్‌.. బల్క్‌ పేమెంట్‌ వ్యవస్థ. ఆటో క్రెడిట్‌ సేవలతో పాటు విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌, రుణ కిస్తీలు (ఈఎంఐ), మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, బీమా ప్రీమియం ఆటో డెబిట్‌ సేవలనూ అందిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), సబ్సిడీ చెల్లింపులు సైతం ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. 


ఏటీఎం ఇంటర్‌చేంజ్‌ ఫీజు పెంపు 

తొమ్మిదేళ్ల (2012 ఆగస్టు) తర్వాత ఏటీఎం ఇంటర్‌చేంజ్‌ చార్జీలు మళ్లీ పెరిగాయి. ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు సంబంధించి ఇంటర్‌చేంజ్‌ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. ఆర్థికేతర లావాదేవీలపై ఈ రుసుమును రూ.5 నుంచి రూ.6 కు పెంచుకోవచ్చంటూ జూన్‌లో తెలిపింది. ఏటీఎంల ఏర్పా టు, వాటి నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఈ వెసులుబాటు కల్పించింది. ఏటీఎం కార్డు జారీ చేసిన బ్యాంక్‌.. ఇతర బ్యాంక్‌ ఏటీఎంలో తన కార్డు ద్వారా జరిగిన లావాదేవీపై ఆ బ్యాంక్‌కు ఇంటర్‌చేంజ్‌ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఏదైనా బ్యాంక్‌కు చెందిన ఖాతాదారు.. ఇతర బ్యాంక్‌కు చెందిన ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించడం లేదా ఆర్థికేతర లావాదేవీలు నిర్వహించినప్పుడు ఈ ఫీజు వర్తిస్తుంది. ప్రస్తుతం బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు ఇతర బ్యాంక్‌ ఏటీఎంల ద్వారా ప్రతినెలా కొన్ని ఉచిత లావాదేవీలకు అనుమతిస్తోంది. ఉచిత పరిమితి దాటిన లావాదేవీలపై ఖాతాదారు ఇకపై అదనపు రుసుము చెల్లించాల్సి రానుంది. 


ఐసీఐసీఐ బ్యాంక్‌ చార్జీల సవరణ 

దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు (ఉపసంహరణ, జమ) లావాదేవీలతోపాటు ఏటీఎం ఇంటర్‌చేంజ్‌, చెక్‌ బుక్‌ చార్జీలను ఆగస్టు 1 నుంచి సవరిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇప్పటికే ప్రకటించింది. ఇకపై బ్యాంక్‌ సాధారణ పొదుపు ఖాతాదారులు నెలకు 4 లావాదేవీలు ఉచితం జరపవచ్చు. ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.150 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 


ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ డోర్‌స్టెప్‌ సేవలపై రుసుము 

ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతాదారులు ఆగస్టు 1నుంచి ఇంటి వద్ద (డోర్‌ స్టెప్‌) సేవల వినియోగానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బ్యాంక్‌ ఈ సేవలకు ఎలాంటి చార్జీ వసూలు చేయలేదు. ఇక నుంచి డోర్‌ స్టెప్‌ సర్వీసులపై ప్రతి అభ్యర్ధనకు రూ.20 (జీఎస్‌టీ అదనం) వసూలు చేయనుంది. ఐపీపీబీ బ్యాంక్‌ ప్రతినిధి కస్టమరు ఇంటికి వెళ్లినప్పుడు అభ్యర్థించిన కస్టమరు జరిపే లావాదేవీలపై ఎలాంటి పరిమితి ఉండదు. ఒకరు కంటే ఎక్కువ వ్యక్తులు జరిపే లావాదేవీల నెరిపినట్లయితే, ప్రతి వ్యక్తి విడివిడిగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్‌ వెల్లడించింది. 


రూ.2 కోట్ల వరకు టర్నోవర్‌.. జీఎస్‌టీ వార్షిక రిటర్నులు ఫైల్‌ చేయనక్కర్లేదు

టర్నోవర్‌ రూ.2 కోట్లకు మించని వ్యాపారులు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక రిటర్నులు  (జీఎస్‌టీ ఆర్‌-9) సమర్పించాల్సిన అవసరం లేదు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు స్వయంగా ధ్రువీకరించిన వార్షిక రిటర్నుల (జీఎస్‌టీఆర్‌-9సీ)ను సమర్పిస్తే సరిపోతుంది. ఇప్పటివరకు వీరు ఆడిట్‌ చేసిన రిటర్నులు సమర్పించాల్సి వచ్చేది. దీంతోపాటు జీఎ్‌సటీ చట్టంలో చేసిన పలు సవరణలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) శనివారం అధికారికంగా ప్రకటించింది. 

Updated Date - 2021-08-01T06:42:26+05:30 IST